సీఎం జగన్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని వారాల కిందట.. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతారని.. ఆయన భార్య వైఎస్ భారతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని.. ప్రకటించి సంచలనం సృష్టించిన విష్ణుకుమార్ రాజు.. మరోమారు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో విచిత్రమైన మనిషి బయటకు వచ్చారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ లో విచిత్రమైన మనిషి ఉన్నారని తనకు ముందే తెలుసునని, ఆయన వ్యక్తిత్వం, మనస్తత్వం తనకు గతంలోనే తెలుసునని రాజు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిస్తే వెళ్లి కలిసానే తప్ప, జగన్ అంటే తనకు తొలినుంచి ఇష్టం లేదని విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రజల మీద జగన్ దొంగ ప్రేమ చూపించారని అన్నారు.
31 కేసులు, 11 సీబీఐ, 5 ఈడీ కేసులున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని రాజు ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీద కూడా ఇన్ని లేవన్నారు. కోర్టులు వెంటనే తీర్పు ఇచ్చే పరిస్థితి లేనందునే జగన్ సీఎంగా ఉన్నాడని, ఒక్క తీర్పు వచ్చినా కూడా జగన్ ఉండాల్సిన స్థానం జైలే అని రాజు వ్యాఖ్యానించారు. బెయిల్ పై ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది జగన్ ఒక్కడేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు దేశంలో ఎక్కడా జరగడంలేదని.. వైసీపీకి 151 సీట్లు వచ్చాయని బలం అనుకుంటే పొరపాటు అది వాపు మాత్రమేనని ఆయన తెలిపారు.
కనబడిన ఎవ్వరినీ వదలకుండా నెత్తి మీద చెయ్యి వేసి, మొహం మీద ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడిగారని ఆ రకంగా ప్రజలను మోసం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా జగన్ ను నమ్మి అత్యద్భుత పాలన అందిస్తారనుకున్నారు. కానీ, ఎన్నికలకు ముందు జగన్ ప్రజల నెత్తి మీద వేసిన చెయ్యి భస్మాసుర హస్తం అని ప్రజలకు ఇప్పుడు తెలిసిందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం విశేషం.
చంద్రబాబునాయుడు హయాంలో నిర్మించిన ప్రజా వేదిక సెమీ ఇంజనీరింగ్ బిల్డింగ్.. నట్లు,.బోల్టులు విప్పి వేరో చేట పెట్టేయవచ్చునని.. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టినట్టుగా కూల్చివేసాడని రాజు విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలను కూల్చివేసే సీఎం దేశంలో జగన్ ఒక్కడేనని ఆయన ఎద్దేవా చేశారు. అన్న క్యాంటీన్లను జగనన్న క్యాంటీన్ లుగా పేరు మార్చి కొనసాగిస్తే బాగుండేదని, కానీ వాటిని మూసేయడం మంచి పని కాదని విమర్శించారు.
.