నేను చరిత్ర విద్యార్థిని కాదు. పదోతరగతి దాకా పరీక్షలు రాయడానికి తగినంత పుక్కిటపట్టిన చరిత్ర జ్ఞానం తప్ప నాకు తెలిసింది శూన్యం. అలాగని మనకు తెలియని విషయం తారసపడినప్పుడు, తెలియని సంగతులు నిండిన పుస్తకాన్ని చదివేప్పుడు భారంగా, అనాసక్తిగా భావించే రకం వ్యక్తిని కూడా కాను.
చదివే పుస్తకంలో తెలియని సంగతులు వస్తూ ఉంటే వాటిని మరింత ఆసక్తిగా చదవడం అలవాటైంది. జర్నలిస్టుకు ఉండవలసిన మౌలిక లక్షణం కొద్దీ.. మనకు తెలియని సంగతి వస్తే.. మరింత శ్రద్ధగా చదివి దాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అలాంటి నాకు- నా స్నేహితురాలు డిపి అనురాధ రాసిన ‘జగమునేలిన తెలుగు’ పుస్తకం గొప్ప ఆసక్తిని కలిగించడం విశేషం కాదు. కానీ,
తెలుగునేలపై పుట్టినందుకు.. వందల, వేల సంవత్సరాలకు పూర్వం మన తెలుగుజాతి వైభవం ఎటువంటిదో తెలుసుకోడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరికీ కూడా ఎంతో గొప్ప ఆసక్తిని కలిగించే పుస్తకం ‘జగమునేలిన తెలుగు’!
జర్నలిస్టు డి.పి. అనురాధ తన వృత్తిగమనానికి తోడు, అదనపు నిబద్ధతతో శ్రమకోర్చి.. తెలుగుజాతి ప్రాచీన మూలాలు విస్తరించిన అనేక దేశాల్లో స్వయంగా పర్యటించిన సేకరించిన వివరాలను.. నవలారూపంలోకి గుదిగుచ్చి అందించిన పుస్తకం ‘జగమునేలిన తెలుగు- గోదావరి నుంచి జావా దాకా’. చరిత్రలోకి అన్వేషణ- నవల గా దీన్ని అభివర్ణించారు. తెలుగుజాతి ట్రస్టు తరఫున.. తెలుగు భాష కోసం వ్యయప్రయాసలకోర్చి పాటుపడుతున్న డాక్టర్ సామల రమేష్ బాబు సంపాదకత్వంలోని ‘అమ్మనుడి’ మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిన రచన ఇది. ఇప్పుడు నవలరూపంలో పుస్తకంగా తెలుగుజాతి ట్రస్టు వారే బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆర్థిక సహకారంతో ప్రచురించారు. ‘గెలుపు వలసల చరిత్ర’ అంటూ ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ‘దారిదీపం’ అంటూ సామల రమేష్ బాబు ముందుమాటలుగా వ్యాసాలు అందించారు.
నవల గురించి.. :
ఇందులో కథా నాయకుడి పాత్ర పేరు సూర్యవర్మ. సూర్యవర్మ తెలుగుభాష మూలాలు విస్తరించిన, తెలుగు భాష వెలుగులు ప్రసరించిన ప్రతి ప్రాంతానికి ప్రతి దేశానికి పర్యటిస్తాడు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. డబ్బుంటే మీరు కూడా అన్ని దేశాలూ తిరిగి రావొచ్చు. కానీ ఈ సూర్యవర్మ.. ఆయా అన్ని కాలాల్లోకీ ప్రయాణిస్తాడు! ఇలా ‘కాలప్రయాణం’ అనగానే మీరు టైం మెషీన్ ను ఊహించుకోకండి. చరిత్రలో సైన్స్ ఫిక్షన్ జోడించారా? అని తూకం వేయకండి. ఈ నవలలో అదేం లేదు. ఏ రీతిగా.. కథానాయకుడిని అనురాధ అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అత్యంత సునాయాసంగా తిప్పిందో చదివి తెలుసుకోవాల్సిందే.
మౌలికంగా ‘జగమునేలిన తెలుగు’ తెలుగు జాతి ప్రాచీన చరిత్రను తెలియజెప్పే కథ! ప్రాచీన తెలుగు చరిత్రను తెలుసుకోడానికి ఇతర గ్రంథాలు కొన్ని మనకు దొరకవచ్చు. రచయిత్రి తన ముందుమాటలో భావరాజు వేంకట కృష్ణారావు పుస్తకాన్ని కూడా ప్రస్తావించారు. అవి తెలుగుజాతి ప్రాచీన మూలాలను మనకు వివరించవచ్చు. కానీ.. ‘జగమునేలిన తెలుగు’లో ఆ చరిత్ర ఒక అంతఃసూత్రంగా.. అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ‘తెలుగుదనం’ అనే ఆత్మిక సౌందర్యం మాత్రమే ముడివేసిన ప్రేమ అది. దేశాలతో పాటు తిరిగిన ప్రేమ అది. కాలాలతో పాటు ప్రయాణించిన ప్రేమ అది. అయితే కథలో ప్రేమ.. ఎంత ఉండాలో అంత మాత్రమే ఉంటుంది. అసలు కథా ప్రయాణానికి ఎక్కడా అడ్డుపడదు.
పైగా ఆయా ప్రాంతాలు స్వయంగా తిరిగి, అక్కడి వారితో మాట్లాడి.. ఇదివరకటి పుస్తకాల్లో ఎన్నడూ లేని క్షేత్రస్థాయి వివరాలనుకూడా జోడించి అందించిన సాధికారికమైన కథ ఇది.
విశేషాలు..:
సూర్యవర్మకు ఒక స్వప్నం ఉంటుంది. కథకు నాందీ ప్రస్తావన- స్వస్తివాచకమూ రెండూ ఆ స్వప్నం చుట్టూనే తిరుగుతాయి. వేలసంవత్సరాల కిందకు తీసుకు వెళ్లిన అనురాధ- భవిష్యత్తులో మాత్రం కేవలం పదేళ్ల ముందుకు తీసుకెళ్లి మనల్ని 2030లో విడిచి పెడుతుంది. ఆ స్వప్నం సాకారం అయిన తీరును వివరిస్తుంది. నేను స్వయంగా ఎరిగిన పెద్దలలో అసామాన్యుడైన విజ్ఞానఖని, నిరాడంబరుడు, నిగర్వి తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి గారి పేరును ఈ నవలలో రాష్ట్రపతి పాత్రకు వాడుకోవడం ఒక ముచ్చట.
తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి గారి జీవితంపై ప్రచురించిన పుస్తకం ‘గురుశిఖరం’ చదవండి
భాషా పటాటోపాలు, ప్రయోగాలు, శైలీ విన్యాసాలు, రచనా చమత్కృతులూ వీటిని ప్రధానంగా ఇష్టపడేవారు ‘జగమునేలిన తెలుగు’ను చదవకండి. ఇందులో అవేమీ ఉండవు. కథనం సాధారణంగా ఉంటుంది. అక్కడక్కడా వ్యాసధోరణి అనిపించొచ్చు. కానీ మనం చదువుతున్నది మనదైన తెలుగుజాతి ప్రాచీన మూలాల విశేషాలు అనే స్పృహ ఉన్నంతవరకు ఇబ్బంది ఉండదు. తెలుగుదనం మీద ప్రేమ ఉంటేనే, తెలుగు మూలాల కోసమే చదవండి.
ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడక్కడా తీసిన ప్రాంతాల ఫోటోలు, వ్యక్తుల ఫోటోలు, వాటి రైటప్ లు మధ్యమధ్యలో చికాకు అనిపిస్తుంది. మనం చదువుతున్నది నవలా? వార్తాకథనమా? అనిపిస్తుంది. రచయిత్రి అనురాధ స్వయంగా తిరిగి, వారిని కలిసి సేకరించిన వివరాలే ఈ నవలగా తయారయ్యాయి అని చాటుకోవడానికి చేసిన ప్రయత్నం అది కావచ్చు. ఆ ఫోటోలన్నింటినీ నవల పూర్తయిన తర్వాత.. ఒక అనుబంధం రూపంలో అన్నీ ఒకేచోట ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ మధ్యలో ఇవ్వడం బాగాలేదు. అది ప్రచురణకర్తల తరఫు లోపం అనుకోవాలి.
ముగింపు.. :
నవలలో రచయిత్రి అనురాధ సూత్రీకరించి చెప్పినట్టు- తెలుగువాళ్లు ఆగ్నేయాసియా దేశాలలో తెలుగు ప్రభలను పంచిపెట్టిన సంగతి నిజమే కావొచ్చు.. కానీ, ఆమె అన్నట్టు- వీళ్లందరూ మన ముత్తాతలు ఎందుకు అవుతారు? అనే ప్రశ్న ఎవరిలోనైనా తలెత్తవచ్చు. మా ముత్తాతలు ఫలానా కదా అనే సందేహం కలగొచ్చు.
మిమ్మల్ని మీరు భాషా, ప్రాంత అస్తిత్వాలతో మమేకం చేసుకోకుండా, చేసుకోలేకుండా- ఒక కుల మత ప్రాధాన్యాలతో ముడిపడిన మాత్రమే చూసుకునే వ్యక్తిగా పరిగణించుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది! అలాకాకుండా తెలుగు భాషకు, తెలుగుదనానికి, తెలుగు నేలకు సంబంధించిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తించుకోగలిగితే.. మీకు ఈ ‘జగమునేలిన తెలుగు’ చాలా మంచి పుస్తకం అనిపిస్తుంది.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
99594 88088
వివరాలు
ప్రచురణ : తెలుగుజాతి ట్రస్టు, తెనాలి ఫోను : 94404 48244
కాపీలకు : ప్రచురణకర్తలు, నవోదయ, అన్ని పుస్తక కేంద్రాలు
Discussion about this post