“ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. అర్ధయితే… పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా..ది గ్విజయీభవా”
అని బడి పిల్లలు రాము, కృష్ణ, పార్థు, మిగిలిన వాళ్ళు కలసి ‘శమీపురమనే’ ఊరులో తమ గురువైన వేంకట శాస్త్రిగారికి గురుదక్షిణ సమర్పించడానికి తిరుగుతూ ప్రజలు ఇచ్చిన బహుమతుల్ని, డబ్బుని తీసుకుని వేంకట శాస్త్రి గారిముందు పెట్టారు. పిల్లల ప్రేమ, గురుభక్తికి ఆనందంతో పొంగిపోయిన శాస్త్రిగారు వాళ్ళకు తనింట్లో వండించిన పిండివంటలు పెట్టి, వాళ్ళు తింటుంటే అమ్మలా సంబరపడిపోయారు.
“మాష్టారండి! మనం ఈ దసరా పండగం ఎందుకు చేసుకుంటామండి !”
అని రాము అడిగిన సందేహానికి, నవ్వుతూ “మీరు మన తెలుగు పుస్తకంలో దసరా అనే పాఠంలో ఏం చదువుకున్నార్రా?” అని అడిగారు.
ఏకసంధాగ్రహి అయిన పార్థు తనకి ఆ పాఠం వచ్చు! అంటూ గబగబ ‘‘మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని బాధ పెడుతుంటే అమ్మవారు మహాశక్తితో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు అష్టదిక్పాలకులు ఇచ్చిన ఆయుధాలని ధరించి తొమ్మిది రాత్రులు పోరాడి మహిషాసురుణ్ణి చంపింది.’ అదే కదండి దసరా పండగ అంటే’’ అని ఆతృతగా అప్పజెప్పేశాడు.
మధ్యలో మాష్టారు అందుకుని.. ‘‘అదే చెడుమీద మంచి యొక్క విజయంగా మన పెద్దలు అభివర్ణించారు. మహిష అంటే దున్నపోతు కదా! మనిషి విచక్షణ మరిచి పశువులా ప్రవర్తిస్తే వాడిని తుదముట్టించడానికి భగవతి ఇలా భూమి మీద ఉదయించి అలాంటి వాళ్ళను చంపుతుంది. ఆ రోజు నుండి తొమ్మిది రోజులు అమ్మని కొలచి ప్రజలందరు దసరా పండగ చేసుకుంటారనమాట’’ అని ముక్తాయించారు.
‘‘మరి మనం శమీ చెట్టుకి ఎందుకు పూజ చేయాలి?’’ అని కృష్ణ అడగగానే, ఆయన
‘‘శమీవృక్షం అంటే జమ్మి చెట్టన్న మాట. మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళుతున్న సమయంలో అస్త్ర శస్త్రాలు అంటే విల్లులు, బాణాలు, కత్తులు మొదలైనవి శమీచెట్టు మీద పెట్టి దుర్గమ్మని ప్రార్ధించి అవి తమకు తప్ప ఎవరికి కనబడకుండా ఉండాలని పాండవులు కోరారుట. ఆ భగవతి అనుగ్రహంతో ఆమె ఇచ్చిన శక్తి సామర్థాలతో కౌరవులని కురుక్షేత్ర యుధ్దంలో జయించారు. అప్పటినుంచి రాజులు, ప్రజలు తమతమ ఆయుధాలని ఆ చెట్టుదగ్గర పెట్టి పూజలు చేసే ఆచారం వచ్చింది’’ అని వివరించారు.
“శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్దర్త్రి రామస్య ప్రియదర్శిని”
అనే శ్లోకం ఈ విజయదశమి నాడు చదువుకొని ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షణ చేస్తే అన్నింట విజయము కలుగుతుందని నానుడి.
అలాగే శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపడానికి ముందు అపరాజితా దేవికి పూజచేసి రావణుడి మీద యుధ్ధం చేసి విజయం పొందాడని శ్రీమద్రామయణంలో వివరించారు. అందుకనే ప్రతి పిల్లవాడు, ప్రతీ మానవుడు ధర్మ బధ్ధంగా, మహనీయుడుగా, నైతికంగా జీవించి తమ జీవితాలని సుసంపన్నం చేసుకోవడానికి రామాయణ, భాగవత, మహాభాగవతాలు చదవాలి. మానవుడు సుఖంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా సత్యమే పరమావధిగా జీవించాలంటే రామాయణం మహోత్కృష్టమైన మహాకావ్యం పిల్లలు!
ఈ దశహర (దసరా) నాడు అమ్మకి పూజచేసి, శ్లోకం చదువుకుని. మీ జ్ఞానం పెంచే ఆయుధాలైన పాఠ్యపుస్తకాలని అమ్మముందుంచి బాగా చదువు రావాలని, మీకు మంచి ధైర్యం, శక్తి , విజ్ఞానం రావాలని కోరుకుని దసరా పండగ చేసుకోండి. అమ్మ కరుణిస్తుంది. అని పప్పులు, బెల్లం ముక్కలు, పిల్లలందరికి పంచారు.
పిల్లలందరు దసరా పాటలు పాడుకుంటూ ఆ వీధిలో నవరాత్రి ఉత్సవాలు చేస్తున్న పందిట్లో కి పరుగెత్తారు.
స్వస్తి! సర్వేజనః సుఖినోభవంతూ!
అమ్మ సేవలో
..చాగంటి ప్రసాద్
9000206163
Discussion about this post