రాజధాని రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించిన వ్యవహారం ముదిరి తీవ్రంఅవుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలిపెట్టేలా లేదు. రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చి.. అధికార పార్టీకి అప్రతిష్ట తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది. తెదేపా శ్రేణులను ఈ దిశగా యాక్టివేట్ చేయడానికి పార్టీ అధినేత వ్యూహరచన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు ఆయన పిలుపు ఇచ్చారు.
రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జేఏసీ ఇచ్చిన మూడు రోజుల ఆందోళనలకు టీడీపీ సంఘీభావం తెలుపుతోందన్నారు. రైతు, ప్రజాసంఘాల ఆందోళనలకు టీడీపీ మద్దతు ఇస్తోందని ప్రకటించారు.
వరద నష్టాలు, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం దుర్మార్గమని చంద్రబాబు అభివర్ణించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర రైతాంగ ఆశాదీపం పోలవరంను తాకట్టు పెట్టారని, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు గురువారం మండల రెవిన్యూ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఆర్.డి.ఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేయాలని, శనివారం ‘ఛలో గుంటూరు జిల్లా జైలు’ కు సంఘీభావం తెలపాలని పిలుపు ఇచ్చారు.
రాజకీయ, ప్రజా సంఘాలు మూడు రోజుల పాటు ఆందోళనల్లో పాల్గొనాలని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలపాల్సిందిగా పేర్కొన్నారు.
.

Discussion about this post