అగ్రహారం రామానంద అనంతపురంలో ఉంటారు. బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. మంచి చదువరి. పుస్తక పఠనంతో ఆలోచన పెంచుకోవచ్చు, జీవితంలోని సవాళ్లను దీటుగా ఎదుర్కోవటానికి కావలసిన శక్తినీ పొందవచ్చునని గట్టిగా నమ్మేవారిలో రామానంద ఒకరు. అన్ని అనుభవాలూ మనమే పొంది పాఠాలు నేర్చుకోవాలంటే ఒక జన్మ సరిపోదు. ఇతరుల అనుభవాల పునాదులపై సమున్నత సౌధాలను నిర్మించుకోవచ్చు. దృష్టి కేంద్రీకరించి పుస్తకం చదివితే అంతకుమించిన యోగం మరొకటి ఉండబోదనీ రామానంద అంటారు.
పుస్తకాలపై రామానందకున్న ప్రేమే ఆయనతో స్నేహసంబంధాలకు నారూనీరూ పోసింది. ఎప్పుడైనా ఫోను చేసి మాట్లాడతారు. తన ఆలోచనలనూ పంచుకుంటారు. ఆయన్ను నేను వ్యక్తిగతంగా కలుసుకున్నదీ లేదు. అయినా ఆత్మీయంగా ఎన్నో ముచ్చట్లను కలబోసుకుంటూ ఉంటాం. అన్వేషించగలిగితే ఉత్తమ అభిరుచులుగలవారు, ఆలోచనాపరులు మన చుట్టూ చాలామందే ఉంటారు.
2021 సంవత్సరం ముగుస్తున్న వేళ రామానంద ఫోను చేశారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ పేరెంటింగ్ మీదకు సంభాషణను మళ్లించారు. ఆయన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే ఇలా ఉంది.
* * *
ముఫ్ఫై ఏళ్ల క్రితం టేకు ప్లాంటేషన్ గురించి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టి విరివిగా ప్రచారం చేశారు. ఒక్కో టేకు మొక్కపై వేయి రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఇరవై ఏళ్ల తర్వాత లక్షరూపాయల రాబడి పొందండి అనే నినాదంతో చాలామంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ పథకంలో డబ్బుపెట్టి మోసపోయామన్న సంగతి ఆ తర్వాతగానీ వారికి తెలియలేదు.
ఈ కాలపు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను టేకు చెట్టులా పెంచుతున్నారు. వారి చదువులకు లక్షలు వెచ్చిస్తున్నారు. ఇరవై ఏళ్ల తర్వాత టేకు చెట్లు లాభాలు తెచ్చిపెట్టినట్లే తమ పిల్లలూ బాగా చదివి ఏ అమెరికాలోనో ఉద్యోగం సంపాదించుకుని తమను కళ్లలో పెట్టుకు చూస్తారని భ్రమపడుతున్నారు. తమ ఆశలు అడియాసలేనన్న సంగతి చాలామంది తల్లిదండ్రులకు త్వరలోనే బోధపడుతుంది.
టేకు చెట్టు నిటారుగానైతే పెరుగుతుంది. కానీ నీడనివ్వదు. పక్షులకూ ఆశ్రయం కల్పించదు. టేకు చెట్లలా నిటారుగా విద్యా ఉద్యోగాల్లో పెరిగిన పిల్లలు కూడా చివరకు తల్లిదండ్రులకు రవ్వంత నీడను కల్పించలేకపోతున్నారు. ఆసరా ఇవ్వలేకపోతున్నారు. అమెరికా డాలర్లను ఇండియాలో పెట్టుబడులుగా సమకూర్చి వాటి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. కాళ్లు కీళ్లు అరిగి ఒంట్లో ఓపిక తగ్గి కృష్ణా! రామా! అనుకుంటూ ప్రశాంతంగా కాలక్షేపం చేయాల్సిన వయసులో తల్లిదండ్రులు తమ కొడుకు ఆస్థిపాస్తుల సంరక్షణ కోసం ఇష్టం ఉన్నాలేకున్నా నానా తిప్పలు, ప్రయాసలు పడుతున్నారు.
‘‘అమ్మకు వంటచేసే ఓపికా ఉండటం లేదురా!’’అని తండ్రి చెబితే ఫైవ్ స్టార్ వృద్ధాశ్రమంలో చేర్పించి తమ బాధ్యత తీరిందనుకుంటున్నారు.
అక్కడ దేనికీ లోటు లేకున్నా, కన్నవారి ప్రేమాదరణలు కరువై ఆ వృద్ధ తల్లిదండ్రులు తీరని వెతలు అనుభవిస్తున్నారు.
నాణ్యమైన టేకుకు మంచి గిరాకీ ఉండటంతో ఓడల్లో విదేశాలకు ఎగుమతి అయినట్లు, మంచి చదువులు చెప్పించిన ఫలితంగా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు ఈ కాలపు యువతరం.
తల్లిదండ్రులంటూ కూచుంటే జీవితంలో ఎదగలేం. డబ్బు సంపాదించలేం. సెంటిమెంట్లతో, ప్రేమ బంధాలతో మా కెరీర్ ను నాశనం చేసుకోలేం. అయినా ఇప్పుడు మీకు ఏం లోటు చేశామని? కావలసినంత డబ్బు పంపిస్తున్నాం. సేవలు చేయటానికి పనివారు, అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నాం. మీ కళ్లముందు ఉన్నా ఇంతకంటే మేం ఏం చేయగలం? అన్నది పిల్లల వాదనగా ఉంటోంది.
టేకు బదులు మామిడి చెట్టు అయితే పరిస్థితి మరొకలా ఉంటుంది. మామిడి చెట్టును పెంచితే ఇంటి పెరడులో చల్లటి నీడను ఇస్తుంది. పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ఉదయాస్తమానం పక్షుల కిలకిలారావాలు మనసును సేదతీరుస్తాయి. పండగో పబ్బమో వస్తే మామిడి ఆకులు ఇంటి గుమ్మాలకు తోరణాలై శుభమంగళ గీతాలు పాడతాయి.
మామిడి కాయలు నోరూరించే ఆవకాయ, మాగాయ వంటి ఊరగాయలకు ఊపిరై ఏడాది పొడవునా జిహ్వకు పనిపెడుతూ ఇంతకంటే మరింకేం కావాలన్న సంతృప్తినిస్తాయి. ఆ మామిడికాయ పండుగా మారి మధుర రసాలనిస్తుంది.
లాభాపేక్ష లేకుండా పిల్లలను చదువులు, ర్యాంకుల పేరిట పరుగులు తీయించకుండా పెంచగలిగితే పరిస్థితి మరోరకంగా ఉంటుంది. అమెరికా డాలర్లే జీవితానికి పరమావధి కాదు. డబ్బు ఒక్కటే సుఖశాంతులను, ఆరోగ్యాలను ఇవ్వదు. చేవ ఉంటే, చొరవ ఉంటే భారత్ లోనూ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. డబ్బు సముపార్జించే మార్గాలూ అనేకం ఉన్నాయి. ఈ ఇంగితాన్ని మనసులో నాటగలిగినపుడు, జీవితంలో ఆటుపోట్లను తట్టుకు నిలబడగలిగే వ్యక్తిత్వాన్ని ఇవ్వగలిగినపుడు.. పచ్చటి మామిడి చెట్టు పెరడులోనే విరాజిల్లినట్లు, పిల్లలు కూడా దేశం దాటకుండా కళ్లముందే ఉంటూ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
తమ పిల్లలను టేకు చెట్లలా పెంచాలనుకుంటున్నారా? మామిడి చెట్టులానా? అని ప్రతి తల్లీ, తండ్రీ ఆలోచించుకోవలసిన సమయం వచ్చేసింది.
కొసమెరుపు :
మామిడికీ జీవితానికీ గొప్ప అవినాభావ సంబంధం ఉంది. మామిడి పిందెగా ఉన్నపుడు వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చి కాయగా మారినపుడు నాలుక చిల్లిపడుతుందా? అన్నంత పులుపుగా ఉంటుంది. అదేకాయ పండుగా మారితే ఆ పులుపు మటుమాయమై మధర రసాలను ఇస్తుంది.
తెలిసీ తెలియని వయసు – మామిడి పిందె దశ అనుకుంటే, కన్నూ మిన్నూ కానని పొగరూ వగరూ చూపే యవ్వనం కాయదశ.
అనుభవాలతో రాటుతేలి పరిణతి సాధిస్తే – అది పండుదశ.
మామిడి పండు – వారు వీరనే విచక్షణ లేకుండా అందరికీ మధురరసం పంచినట్లే మీ జీవితమూ చుట్టూ ఉన్నవారికి కొత్త వెలుగులు నింపాలి. ప్రతి ఒక్కరూ మామిడి పండును కోరుకున్నట్లే ప్రతివారూ మిమ్మల్ని ఇష్టపడేలా, మీ అనుభవాలు పంచుకునేలా మిమ్మల్ని మీరు మలుచుకోండి.
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్
Discussion about this post