సినీ వైనతేయం : డబ్బింగ్ ఢమాల్

249

డబ్బింగ్ సినిమాలు ఒకప్పట్లో ఇక్కడ రాజ్యమేలాయి. స్ట్రెయిట్ తెలుగు చిత్రాలను కూడా భయపెట్టాయి. కానీ క్రమంగా పరిస్థితి మారింది. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. ఏవో కొన్ని అరుదైన చిత్రాలను తప్ప… మూస డబ్బింగ్ లను దారుణంగా తిప్పి కొడుతున్నారు. నానా చెత్తా తీసుకువచ్చి.. చీప్ డబ్బింగ్ క్వాలిటీతో ప్రజల మీదికి వదిలేసి.. అయిన కాడికి సొమ్ము చేసుకుందామనుకునే వాళ్లకి ఇప్పుడు పని లేకుండా పోతోంది.

రజనీకాంత్, కమల్ హాసన్… వీళ్ళు ఏ భాష హీరోలు? సినిమా మార్కెట్ పరిభాష ప్రకారం వాళ్ళకు భాషతో సంబంధం లేదు. వీరి సినిమాలు తమిళంలో తీసినా తెలుగు, హిందీ, మళయాలంతోపాటు విదేశీ భాషల్లోకీ వెళ్తాయి. ఈ గ్లోబల్ హీరోల పరిస్థితి టాలీవుడ్ లో ఎలా ఉంది? అసలు వీళ్ళు మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల కథానాయకులకు తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం ఆదరణ దక్కుతోంది? అనువాద చిత్రాల మార్కెట్ ఎందుకు నష్టాల్లో ఉంది?

తమిళంలో ఆడిన లేదా ఆడుతుందని ఊహించిన సినిమాలను… అందునా మాస్ అప్పీల్ ఉండే హీరోల సినిమాలను తెలుగులోకి అనువదించి ప్రేక్షకుల ముందుపెడుతూ ఉంటారు. తమిళ డబ్బింగ్ సినిమాల మార్కెట్ 2010కి ముందు ఎలా ఉందంటే – సూర్య, విక్రమ్, రజనీ, కమల్ సినిమాలు వస్తున్నాయంటే ఇక్కడి టాప్ స్టార్స్ చిత్రాల విడుదల గురించి పునరాలోచించేవారు. ఆ రకంగా అప్పట్లో వారు టాలీవుడ్ స్టార్స్ కి గట్టి పోటీగా నిలిచారు. అపరిచితుడు, గజినీ సినిమాలతో విక్రమ్, సూర్య తమిళ డబ్బింగ్ లకు గొప్ప క్రేజ్ తెచ్చారు. ఆ తరవాత సూర్య తమ్ముడు కార్తీ ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’ సినిమాలతో తెలుగులో మార్కెట్ పట్టాడు. విశాల్ ‘పందెం కోడి’తో ఓ స్థానం దక్కించుకున్నాడు. అదే సమయంలో శింబు ‘మన్మథ’ బాగా ఆడింది. ఇలా తమిళ యువ హీరోలు కూడా తెలుగులో ఆదరణ పొందారు. అదే సమయంలో తెలుగు హీరోలు ఇతర భాషల్లో పాగా వేసే ప్రయత్నం చేయలేదు. అందుకు తగ్గ మార్కెట్ వ్యూహాలను ఇటు హీరోలు, అటు దర్శక, నిర్మాతలు తీసుకోలేదు. అనూహ్యంగా అల్లు అర్జున్ కు మాత్రం మలయాళంలో క్రేజ్ వచ్చింది. ఆయన చిత్రాలు కేరళలో బాగా ఆదరణ పొందాయి… ఎంత అంటే అతన్ని ‘మల్లు అర్జున్’ అని పిలుచుకొనేంత!

మరి ఇప్పుడు పరిస్థితి అలాగే కొనసాగుతోందా? అంటే అవునని చెప్పలేం. తమిళ, పరభాషా డబ్బింగ్ చిత్రాలకు ఇప్పుడు టాలీవుడ్ లో టికానా లేకుండా పోయింది. ఏవో అడపాదడపా కొన్ని మెరుస్తున్నాయి తప్ప.. సూపర్ స్టార్ ల సినిమాలైనా… వాటిని జనం సులువుగా తిప్పి కొట్టేస్తున్నారు. ఇక అలాంటివాటికోసం ఎదురుచూడడం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది- అది ఎంత పెద్ద చిత్రమైనా సరే!

ఎక్కడ దెబ్బతిన్నారు ?

తొమ్మిదేళ్ళకు ముందు నువ్వా నేనా అన్న రీతిలో ఉన్న డబ్బింగ్ మార్కెట్ ఇప్పుడు ఈ విధంగా దెబ్బ తినడానికి కారణం ఆ చిత్రాలు చేసే నిర్మాతల వైఖరే. ఒక హీరోకు తెలుగులో మార్కెట్ ఏర్పడింది అనగానే దాన్ని సొమ్ము చేసుకొనే పనిలోపడి – సదరు హీరో చేసిన ఫ్లాప్ సినిమాలను కూడా అనువదించి జనం మీదకు వదిలేస్తుంటారు. దాంతో ఆ హీరో సినిమాల మీద ప్రేక్షక జనం దృష్టిలో చిన్నచూపు వస్తుంది. ‘అపరిచితుడు’, ‘శివపుత్రుడు’ సినిమాలతో విక్రమ్ కు ఇక్కడ గుర్తింపు రాగానే ఆయన తమిళంలో అంతకు పూర్వం నటించిన చెత్తను కూడా దిగుమతి చేశారు. అందుకు తోడు విక్రమ్ కూడా ‘అపరిచితుడు’ తరవాత జనాన్ని మెప్పించే సినిమా చేయలేకపోయారు. ప్రయోగాలు చేస్తారు అనే పేరు తప్ప పైసలు రాబట్టేలా చేయలేదు. ఆ మధ్య మహానటితో తెలుగువాళ్లని మెప్పించిన దుల్కర్ సల్మాన్ మలయాళంలో చేసిన గత చిత్రాలను తీసుకువచ్చారు. అవి వచ్చినట్లు వెళ్ళినట్లు కూడా తెలియదు. జనతా గ్యారేజ్ వచ్చిన సమయంలోనే మోహన్ లాల్ చేసిన మలయాళ చిత్రం ఒకటి ‘మన్యంపులి’ పేరుతో విడుదలై భారీ లాభాలు తెచ్చింది. ఆ క్రమంలో మోహన్ లాల్ సినిమాలు అనువదించడం మొదలుపెట్టారు. అలాగే బిచ్చగాడు హిట్ తరవాత విజయ్ ఆంటోని సినిమాలను తెచ్చారు. అవన్నీ ప్రేక్షకులను దారుణంగా నిరాశ పరచాయి. దాంతో పరభాష హీరోలు ఇక్కడ పాగా వేసే అవకాశం లేకుండా పోతోంది.

మార్కెట్ స్థాయి ఎంత?

తెలుగులో ఏటా నేరుగా నిర్మితమైన చిత్రాలు 90 నుంచి 100 వరకూ తెరమీదకు వస్తాయి. ఒక దశలో అనువాద చిత్రాలు అంతకంటే ఎక్కువే వచ్చాయి. అనువాద చిత్రం చేసే ముందు ఆ కథ ఇక్కడి వాళ్ళకు నచ్చుతుందో లేదో చూడటం సహజం. ‘బిచ్చగాడు’ సినిమాకు ముందు విజయ్ ఆంటోని పెద్దగా తెలుగువారికి తెలియదు. అయితే ఆ సినిమా కథలో తల్లి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకువచ్చారు. రూపాయికి రెండు రూపాయిల లాభం పొందారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మాస్ కి నచ్చుతాయి. రజిని, కమల్ చిత్రాలకి క్లాప్ కొట్టిన రోజు నుంచి టాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ మొదలవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్కడి నిర్మాతలు కొండెక్కి కూర్చోంటున్నారు. మీకు కేవలం థియేటర్ హక్కులు మాత్రమే ఇస్తాం… ఓవర్సీస్, శాటిలైట్ హక్కులు ఉండవు… లాభాల్లో వాటా కావాలి అంటూ నానారకాల షరతులు పెడుతున్నారు. శంకర్ సినిమాలకి అనువాద హక్కులు పొందేవాళ్లు పేరు వేయించుకోవడానికి కూడా బతిమాలుకోవాలి అని తెలుగు సినీ వర్గాలు చెబుతుంటాయి. కోట్ల రూపాయలు వెచ్చించి పేరు కోసం అడుక్కొనే పరిస్థితి బాధాకరమే. ఇటీవలి కాలంలో శంకర్ నుంచి వచ్చిన ‘ఐ’, ‘2.0’ రెండూ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ . అన్నాయి.

ఒక దశలో సూర్య, కార్తీ సినిమాలు డబ్బింగ్ అంటే వాళ్ల సొంత సంస్థ స్టూడియో గ్రీన్ నుంచే వచ్చేవి. ఇప్పుడు వాళ్ళ సినిమాలు ఆడకపోయేసరికి బయటివాళ్లకి అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ సోదరుల సినిమాలేవీ ఆడలేదు. అలాగే విక్రమ్ సినిమా అంటే కొనేవాళ్లూ కూడా లేరు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ కి ఉన్నది అరకొర మార్కెట్ మాత్రమే. అప్పుడెప్పుడో ‘రఘువరన్’ ఆడింది. ఈ మధ్య ‘మారి2’ కాస్త నయం అనిపించింది.

అమ్ముకోవడం తెలియాలి

అనువాద చిత్రాలను తెలుగులోకి పంపేటప్పుడు సదరు హీరోలే జాగ్రత్తలు తీసుకోవడం మేలు. తెలుగులో సినిమాను మార్కెట్ చేసి, క్రేజ్ తెప్పించే సత్తా ఉన్న నిర్మాతలకు అమ్ముకొనేలా ప్లాన్ చేసుకొంటే వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది. ‘మన్యం పులి’ తరవాత మోహన్ లాల్ సినిమాలకు క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ‘కనుపాప’ అనే డబ్బింగ్ సినిమా వచ్చింది. ఇది ఆసక్తికరమైన కథ. ఈ సినిమా చేసిన అనువాద నిర్మాతకు టాలీవుడ్ మార్కెట్, సినిమాను ముందుకు తీసుకువెళ్లడం మీద పట్టు లేదు. కొత్తవాడు. దాంతో ఆ సినిమా జనంలోకి వెళ్లలేదు. అలాగే ఒక్కోసారి అదృష్టవశాత్తు కొన్ని సినిమాలకు బి, సి కేంద్రాల్లో క్రేజ్ వచ్చి ఆడుతుంటాయి. అలాంటివాటిలో ‘లూసిఫర్’ ఒకటి. ఇది బి, సి ల్లో ఆడాక అందరికీ తెలిసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో బాగా ఆడుతోంది.

హాలీవుడ్ నుంచి వచ్చే అనువాద చిత్రాలకు క్రేజ్ బాగా ఉంది. ‘జెర్సీ’ సినిమా వసూళ్లకు కొంతమేరకు గండి కొట్టింది హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ఎవెంజర్స్. ఈ నెల 19న ‘లయన్ కింగ్’ రాబోతోంది. దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమా ప్రచారం జోరుగా సాగుతోంది.

టాలీవుడ్ కు క్షేమమే

డబ్బింగ్ సినిమాలు, ప్రధానంగా అరవ చిత్రాలకు అనువాదాలు ఢమాల్ మనడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమకు శుభసంకేతమే. అసలే థియేటర్ ల ద్వారా లాభాలు పలచబడిపోతున్న ఈ రోజుల్లో, అంతో ఇంతో తెలుగు మార్కెట్ తెలుగు చిత్రాలకే పరిమితం కావడం మంచి పోకడ. దీనివల్ల ఇక్కడ ప్రొడక్షన్ సవ్యంగా ఉండి.. పరిశ్రమ వర్ధిల్లుతుంది. అయితే.. ఎవడైనా రచయిత వచ్చి కథ చెబితే… దాని మంచి చెడుల్ని జడ్జ్ చేయడం చేతగాని నిర్మాతలు తమిళంలో ఏం హిట్ అయ్యాయో వాటి రీమేక్ లు చేయడానికి ప్రతి శుక్రవారం చెన్నై వైపు చూసే దుర్మార్గపోకడ ఇంకా కొనసాగుతోంది. అదికూడా అంతరించిపోతే.. పరిశ్రమకు మేలు జరుగుతుంది.

… వైనతేయ

Facebook Comments