సాధారణంగా ప్రభుత్వం అంటే.. ఒక దేశంలో సర్వాధికారాలు ఉన్న సర్వోన్నతమైన వ్యవస్థగా మనం గుర్తిస్తాం, భయపడతాం కూడా. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, చట్టాలను గౌరవిస్తాం.. ఇష్టంలేకపోయినా వాటికి కట్టుబడి ఉంటాం. ధిక్కరించాలంటే.. తప్పుడుపని చేస్తున్నామనే భయంతో ఉంటాం. చట్టమే తప్పు అని ఉద్దేశపూర్వకంగా ధిక్కరించే ఉద్యమాల సంగతి వేరు. యావత్ దేశం మీద ప్రభుత్వానికి అంత అదుపు, అధికారం ఉంటాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయంలో జరుగుతున్న రగడ, ప్రచారం, కేసులు, వాటి చుట్టూ జరుగుతున్న రాద్ధాంతాలు.. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ ను కీర్తించిన వారంతా.. ఎగబడి ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ (#saynotobettingapps) అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ ఉపదేశాలు చెబుతుండడం ఇవన్నీ కూడా చిత్రంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తోంటే.. మనదేశంలో ప్రభుత్వం అనేది అంత అచేతనమైనదా.. ఒక తప్పుడు వ్యవస్థను నియంత్రింగచల స్థితిలో ప్రభుత్వాలు లేవా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
బెట్టింగ్ యాప్ ల వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా నాశనం అవుతుున్నారని అందరూ అంటున్నారు. వాటిని ప్రమోట్ చేసినందుకే ఇంతమంది సెలబ్రిటీల మీద ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రానా వంటి వారు ఇవన్నీ 2016, 17లలో చేసిన ప్రకటనలు అని, అలా చేయడం తప్పు అని గ్రహించి.. కాంట్రాక్టులు ముగిసిన తర్వాత మళ్లీ అలాంటి పని చేయలేదని వివరణ ఇచ్చారు కూడా. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం అంత పెద్ద నేరం అని పోలీసులు భావిస్తుంటే గనుక.. 2017 నాటినుంచి యాడ్స్ వస్తుండగా.. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? యాడ్స్ మొదలైనప్పుడే.. నటుల మీదగానీ, ఆ యాడ్స్ వేస్తున్న వారి మీద గానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనేది సామాన్యుల సందేహం. మామూలు వినియోగ వస్తువుల విషయంలోనైనా సరే.. తప్పుడు సమాచారంతో.. ప్రజలను మాయచేసేలా ప్రకటనలు రూపొందిస్తే వాటి మీద కోర్టుకు వెళ్లి సదరు ప్రకటనల్ని ఆపు చేయించే.. అన్ని సోషల్ ప్లాట్ ఫారమ్స్ మీద నుంచి కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అలా చాలా జరుగుతూ ఉంటాయి.
బెట్టింగ్ యాప్ ల వల్ల జరిగే ప్రమాదం గురించి పోలీసులకు ఉన్నంత అవగాహన ఇలా కేసులు వేసే మామూలు సామాజిక కార్యకర్తలకు ఉండకపోవచ్చు. ఆ యాడ్స్ మొదలైనప్పుడు.. వాటి విపరీత పర్యవసానాలను పోలీసులు గుర్తించగలిగి ఉంటారు. అలాంటప్పుడు.. అప్పుడే వాటిని కట్టడి చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అనేది ప్రజల సందేహం. కాంట్రాక్టులు కూడా ముగిసిపోయి.. ఎన్నడో వచ్చిన యాడ్స్ ఇప్పుడు కనిపించడం కూడా మానేసిన తర్వాత.. అప్పుడు చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించడం.. కేసుల పేరుతో సంచలనం చేయడం ఎంత కరెక్టు అనేది గమనించాలి.
అలాగే.. ఈ యాప్ లను నియంత్రించడానికి ప్రభుత్వ పరమైన వ్యవస్థ ఉన్నదా లేదా అనేది కూడా సందేహమే. మనకు తెలిసినంత వరకు ఒక దేశంలో ఒక యాప్ పనిచేయకుండా కట్టడి చేయడం ప్రభుత్వాలకు చిటికెలో పని. ఈ పని ప్రభుత్వ పరంగా ఎందుకు చేయడం లేదు. ఈ దేశంలో ఒక యాప్ పని చేసే అవకాశం లేనప్పుడు దానిద్వారా ప్రజలు నష్టపోవడం కూడా జరగదు కదా. కేవలం బెట్టింగ్ యాప్ లు మాత్రమే కాదు.. లోన్ యాప్ లు కూడా ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వారిని ఆత్మహత్యల దిశగా నడిపిస్తున్నాయి. వాటిని కూడా ప్రభుత్వమే కట్టడి చేస్తే సమాజానికి ఉమ్మడిగా మేలు జరుగుతుంది కదా? అనేది పలువురి ప్రశ్న.
ప్రమోట్ చేసేవారిపై కేసులు పెట్టి విచారించి, శిక్షలు వేసినా కూడా దానివలన ఒనగూరే ప్రయోజనం తక్కువ. వీరు కాకపోతే.. మరొకరు.. సెలబ్రిటీలు కాకపోతే సామాన్యులతో, కొత్తవారితో ఇంటరెస్టింగ్ యాడ్స్, లేదా యానిమేటెడ్ యాడ్స్ చేయించి.. అలాంటి దుర్మార్గులు తాము కోరుకున్న మోసపూరిత ప్రచారం చేసుకోగలరు. బెట్టింగ్ యాప్స్ ను నిర్విఘ్నంగా నడుపుకోగలరు. కొత్తవారు, ఆశపడుతున్న వారు మోసపోతూనే ఉంటారు. కానీ నిజంగా సమాజానికి , ప్రజలకు మేలు చేయాలంటే.. అసలు యాప్స్ ను నిషేధించడం, వాటిని దేశంలో పనిచేయకుండా కట్టడి చేయడమే మంచి మార్గం అని ప్రభుత్వాలు గ్రహించాలి. మన ప్రభుత్వాలు అచేతనమైనవి కాదని నిరూపించుకోవాలి.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
Discussion about this post