4 రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రై-రన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అస్సాం లో నేడు రేపు డ్రై రన్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే ఉద్దేశంగా డ్రై-రన్ సాగుతుంది.
కొన్ని రకాల వ్యాక్సిన్లకు అతిశీతల వాతావరణంలో భద్రపర్చడమే పెద్ద సవాల్ గా మారుతున్న నేపథ్యంలో కొవిడ్ వాక్సిన్ ను -76 డిగ్రీల చల్లదనం వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. అలాంటి కోల్డ్ స్టోరేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, పంపిణీలో తలెత్తే సమస్యలు, వ్యాక్సినేషన్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై ఫోకస్ పెట్టేలా ఈ డ్రైరన్ ప్లాన్ చేశారు.
డ్రై-రన్ సందర్భంగా ఎదురైన సమస్యలను రాష్ట్రాలు, కేంద్రానికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రాల నివేదిక ఆధారంగా లోపాలు సరిదిద్ది దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వ్యాక్సిన్ దుష్ప్రభావాలను ఎదుర్కొనే యంత్రాంగం సైతం సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వినియోగానికి తమ వాక్సిన్ లకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే 3 వ్యాక్సిన్ తయారీ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద ఈ 3 సంస్థల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వారి పరిశీలనలో భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్ సంస్థల దరఖాస్తులు ఉన్నాయి. అనుమతి లభించిన వ్యాక్సిన్లతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది.
.

Discussion about this post