టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య అప్రకటిత యుద్ధం నడుస్తోంది. టాలీవుడ్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాల మీద వారికి పీకలదాకా కోపం ఉంది. కాకపోతే.. వ్యాపారం చేసుకునే వారు గనుక.. కోపం అనేది వ్యాపారానికి ప్రథమ శత్రువు అనే లౌక్యం తెలిసిన వారు గనుక మౌనం పాటిస్తున్నారు.
టాలీవుడ్ వైపునుంచి ప్రభుత్వంతో మంతనాలు సాగించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు గానీ.. ఏవీ పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. టాలీవుడ్ వైపునుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తున్నవారు తక్కువగానే ఉన్నారు. అయితే అదే సమయంలో.. ప్రభుత్వం వైపునుంచి టాలీవుడ్ మీద సెటైర్లు, విమర్శలు చేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు.
తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా టాలీవుడ్ మీద నిందలు వేశారు. కులాలను బట్టి.. టేలెంట్ ను తొక్కేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. కమ్మ- కాపు కులాలు తప్ప మిగిలిన వారిని తొక్కేస్తున్నారని అర్థం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
సినిమా రంగం వివాదంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సామాన్య పేద ప్రజలకు వినోదం కల్పించేందుకు సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ఆ రంగ ప్రముఖులు ప్రభుత్వంపై విరుచుకు పడడం అన్యాయమన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఆర్ కే వీబీ పేట గ్రామంలో ఆదివారం సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ… రాజకీయ వారసత్వం అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్న వారు.. సినిమా రంగంలోనే అసలైన వారసత్వం హవా నడుస్తోందనేది గ్రహించాలని ఆయన చురకలు అంటించారు.
ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, చిరంజీవి కుటుంబాల వారే.. సినిమా వారసత్వ హవాను కొనసాగిస్తున్నారన్నారు. మిగిలిన కులాల్లో ఎంత టాలెంట్ ఉన్నా వారిని ఎదగనీయకుండా చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
జగన్‌ను ఇక ఏమీ చేయలేమనే నిర్ణయానికి వచ్చిన ఇతర పార్టీలు ఏకమై జగన్‌పై ఎదురు దాడికి దిగాయని ఆయన ఆరోపించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చేశారన్నారు.
సోము వీర్రాజు మందు, డబ్బు ఇచ్చి ఓట్లు అడిగే పరిస్థితికి బీజేపీ దిగజారడం దారుణమన్నారు. ఇలాంటి చర్యపై ప్రధాని మోదీ కూడా స్పందించకపోవడం అంటే వారికి మతపిచ్చి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ 75 ఏళ్ల లో నిజమైన స్వాతంత్రం మహిళలకు ఇప్పుడే వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ స్వాతంత్రం.. పేదవాడికి విద్యా స్వాతంత్రం జగన్ నేతృత్వంలోని వైసీపీ ద్వారానే సిద్ధించిందన్నారు.
.