ఇవాళ (26-02-2023) ఉదయం 9:15 నిమిషాలకు అల్పాహారం చేసుకుని నేను, జ్ఞానశిశువు గురుసన్నిధికి వెళ్ళాం. అప్పటికే కొంతమంది జిజ్ఞాశువులు గురుసన్నిధిలో ఆసీనులై ఉన్నారు.
గురువుగారి ఆత్మీయ స్పర్శతో నుదుటిపై విభూతి, తీర్థం పుచ్చుకున్నాక, నిత్యం గురుతత్వ సారాన్ని ఆస్వాదించే సిరిసాపలపై కూర్చున్నాము.
ఇక్కడకు వచ్చేవారు మోక్షం పొందలేదంటే ఇక్కడ మీరు కూర్చుంటున్న సిరిసాపలకు కూడా అవమానం అని ఓ సందర్భంలో అన్నారు గురువుగారు. అంటే మోక్షం పొందినవారే ఇక్కడ అడుగు పెడతారని దానర్థం. అందుకే సిరిసాపల గురించి ప్రస్తావన తెచ్చాను.
సూదూర ప్రాంతాల నుంచి గురుతత్వాన్ని ఆస్వాదించడానికి వచ్చే ముముక్షువులకు వెంటనే దేహ తాపాన్ని సేదతీర్చే తియ్యనైన తేనీటిని అందించడం ఇక్కడ ఓ మధురానుభూతి. మేం కూర్చున్న క్షణాలలోనే మేమూ ఆ మధురానుభూతిని ఆస్వాదించాం. మేం టీ తాగిన కాసేపటి తర్వాత,
“ప్రసాదు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది” అని అడిగారు గురువుగారు.
“పర్వాలేదు సార్” అన్నాను. కాసేపటి తర్వాత నేనే “ఇంకా వీపులో, భుజానికి కింది భాగంలో చురుక్కు, చురుక్కు మనే నొప్పి ఉంద”ని చెప్పాను.
రెండు నిమిషాలు మౌనం తర్వాత, “అర్థంగాని అనుభవంలోకి రాని సమాధానమే ప్రశ్న” అన్నారు.
నావీపు నొప్పికి డాక్టర్లకు చూపించుకుంటే ప్రాబ్లమ్ ఏమీలేదని అన్నారు. మరి నొప్పి ఎందుకొస్తోంది అంటే అదే అర్థంకావడంలేదు.
బహుశా అందుకే గురువుగారు పై విధంగా అన్నారేమో.
“మనకు అర్థమయి అనుభవంలోకి వచ్చిన ప్రశ్నే సమాధానం. మనకు అర్థంగాని, అనుభవంలోకి రాని సమాధానమే ప్రశ్న” అని ప్రశ్న, సమాధానాలకు సంబంధించి సరైన నిర్వచనాలను గురువుగారు ప్రభోదించారు.
మనము ఒక సినిమాకి వెళ్ళామనుకోండి. ఆ సినిమా మనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ సినిమా పూర్తిగా చూసిన తర్వాతే బయటకు వస్తాం. ఒకవేళ సినిమాలో సన్నివేశాలు మనకు నచ్చినట్లు లేవనుకో. వాటిని మనం మార్చలేం కదా. మనమే కాదు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా దర్శకుడు కూడా మార్చలేడు.
అదేవిధంగా జీవితమనే సినిమా కూడా షూటింగు పూర్తయిపోయి రిలీజ్ అయిన సినిమానే. మధ్యలో మనం ఏమీ మార్చలేము. కానీ, నాకు ఇలా జరగకుండా ఉంటే బాగుణ్ణు. నేనేం పాపం చేశానని నాకు ఈ బాధలు అని అనవసరంగా ఆందోళన పడుతుంటాం.
గురువుగారు మీరు ఓ సందర్భంలో “అన్నిటికీ సిద్దపడి ఉండడమే సిద్ధి” అని చెప్పారు కదా అని అన్నాను నేను.
“అన్నిటికీ సిద్ధపడి ఉండడంకాదు. సిధ్ధపడి ఉండడం తప్ప మనం చేసేదేమీలేదు” అన్నారు గురువుగారు.
“కర్త వారి వారి ప్రారబ్దకర్మానుసారము జీవుల నాడించును. జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు; జరుగునది ఎవరెంత యడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము గనుక మౌనముగ నుండుటయే ఉత్తమము” అని రమణ భగవానులు కూడా ఇదే ఉద్భోదించారు.
కాబట్టి
మన జీవితంలో ఎదురయ్యే దుఃఖాలకే కాదు, సంతోషాలకు కూడా మనం బాధ్యులం కాము. సుఖం కలిగినప్పుడు సుఖపడాలి. దుఃఖం కలిగినప్పుడు దుఃఖపడాలి. అదే అసలైన స్థితప్రజ్ఞత.
గురువుగారు చెప్పినట్లు జీవితం అనేది షూటింగు పూర్తయిపోయి రిలీజ్ అయిన సినిమా. ఇష్టం ఉన్నా, లేకున్నా చూసి తీరవలసిందే. జీవితంలో ఎదురయ్యే దేన్నైనా అనుభవించవలసిందే. అంతే ఇక వేరే మార్గమేలేదు.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
(26-02-2023)
.