హైదరాబాదు నుంచి తిరుపతి రైల్వేస్టేషన్లో దిగే సమయానికి ఉదయం ఏడుగంటలయింది. ఆటోలో బస్టాండుకి చేరుకున్నాను. అరగంట తర్వాత నేను ఎక్కవలసిన “నెల్లిమాను కండ్రిగ” బస్సు వచ్చింది. అప్పుడు నాతోపాటు ఆరుగురు మాత్రమే బస్సెక్కారు. తర్వాత ఐదు నిమిషాల్లోనే బస్సు మొత్తం నిండిపోవడంతో బస్సు బయలుదేరింది.
ఈ ఊరికి రావాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఏర్పడింది. మా నాన్న ఈ ఊరి హైస్కూల్లో పదేండ్లు టీచరుగా పనిచేయడంవల్ల నేను పదవతరగతి వరకు ఈ ఊళ్లోనే చదువుకున్నాను.
ఈ ఊళ్లో చాలామంది మిత్రులు ఉన్నప్పటికీ పరమేశం అనే స్నేహితుడు నాతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ ఊరి నుంచి వెళ్ళిన తర్వాత అందరితో సంబంధాలు తెగిపోయాయి. కానీ, పదేహేనేళ్ళ తర్వాత ఇప్పుడు పరమేశం నుంచి ఫోను రావడంవల్ల నా రాక తప్పనిసరి అయింది. కానీ వాడికి వస్తానని ఖచ్చితంగా చెప్పలేదు. వెళ్ళి సర్ప్రైజ్ చేస్తామని.
పరమేశం ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతిరోజూ స్కూలుకి నుదుటిపై విభూతితో మూడు అడ్డుగీతలు, ఆ గీతల కింద రెండు కనుబొమ్మల మధ్యలో ఎర్రటిబొట్టు పెట్టుకుని వచ్చేవాడు. అప్పుడు వాడ్ని చూస్తే పరమశివుడు మఫ్టీలో ఉన్నట్లుండేది. వీడికి ఈ భక్తి ఎక్కడ నుంచి వచ్చిందని మాకే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమయ్యేదికాదు.
క్లాసులో మేం అల్లరి చేస్తుంటే వాడు మాత్రం బుద్ధిగా ఉండేవాడు. అయితే ఏ విషయాన్ని అంత తేలిగ్గా అంగీకరించడు. వాడు చెప్పిందే వినాలంటాడు. అంతేకాదు ఆ వయసులోనే మాకు వేదాంతం బోధించేవాడు. అందుకే మేం వాడ్ని ఎప్పుడూ పేరుతో పిలిచిన దాఖలాలులేవు. అందరం ‘స్వామీ’ అని పిలిచేవాళ్ళం.
పరమేశం ఖచ్చితంగా ఏదోక ఆశ్రమం పెట్టుకుని వేదాంత విషయాలు బోధిస్తూ కాలంగడుపుతూ ఉంటాడని, ఇన్ని రోజులూ ఊహల్లో ఉన్న నాకు వాడి ఫోను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే వాడు ఇప్పుడు నన్ను ఆహ్వానించింది వాడి కుమారుడి నామకరణానికి.
‘ఎంత ప్రయత్నించినా నీ అడ్రసు, ఫోను నంబరు దొరకక పోవడం వల్ల పెళ్ళికి పిలవలేకపోయాను. అతికష్టంమీద నీ ఫోను నంబరు సేకరించి నా కుమారుడి నామకరణానికి పిలుస్తున్నాను. నీవు ఖచ్చితంగా రావాలి’ అని చెప్పడంతో నా ఈ ప్రయాణం అనివార్యం అయింది.
“నెల్లిమాను కండ్రిగ” కండక్టర్ కేకతో వాడి ఆలోచనల నుంచి బయటకు వచ్చి బస్సు దిగాను. ఈ పదిహేనేళ్ళల్లో ఊరు చాలా మారిపోయింది. ఎడమవైపు ఉండాల్సిన మామిడితోట స్థానంలో ఇండ్ల ప్లాట్లు దర్శనమిస్తున్నాయి. కుడివైపు ఉండాల్సిన పొలాల్లో పైపుల ఫ్యాక్టరీ ప్రత్యక్షమైంది.
అలా నడచుకుంటూ వాడి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళగానే, బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంటు, దానిమీద వైట్ కలర్ టీ షర్టు, కళ్ళకు నల్లటి అద్దాలు పెట్టుకుని ఒకతను కనబడ్డాడు.
“పరమేశం ఉన్నాడా అండి ఇంట్లో?” అని అతణ్ణి అడిగాను.
“మీరెవరండి?” అన్నాడతను.
“నేను పరమేశం ఫ్రెండ్ని. నా పేరు నందగోపాల్ అండి” అన్నాను.
“రేయ్ నందా! నేనేరా పరమేశాన్ని” అంటూ కళ్ళకు ఉన్న నల్లటి అద్దాలను తీసి టీషర్టుకు తగిలించుకున్నాడు. అప్పటివరకు నేను గుర్తుపట్టలేకపోయాను వాడే పరమేశమని.
“రేయ్ స్వామీ! ఎంత మారిపోయావురా నీవు” అన్నాను.
“నా సంగతి అలా ఉంచు. రేలంగిలా ఉండే నీవు రమణారెడ్డిలా తయారయ్యావేమి” అనే వాడి ప్రశ్నకు సమాధానం ఇవ్వక ఒక వెర్రినవ్వు నవ్వి నేను మౌనందాల్చడంతో, “సరే లోపలికి రారా” అంటూ వాడి గదిలోకి తీసుకెళ్ళాడు నన్ను.
నాకు తెలిసి ఆ గదిలోని గోడలకు చాలా దేవుడి పటాలు వ్రేలాడుతుండేవి. పార్వతీపరమేశ్వరులు, రాధాకృష్ణులు, సాయిబాబా,శ్రీవళ్ళీ, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి తదితర పటాలు లెక్కలేనన్ని ఉండేవి. కానీ, వాటి స్థానంలో ఇప్పుడు ప్రకృతి దృశ్యాలు, ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఫోటో, మోడరన్ ఆర్ట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
“ఏంరా స్వామి, ఈ పటాల మార్పు వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవచ్చా?” అన్నాను ఆసక్తిగా.
అప్పుడే తెల్లటి లెగిన్ మీద కనకాంబరం కలర్ టాప్, పోనీటెయిల్ జడతో ఉన్న ఓ ఆవిడ ఒక ప్లేటులో రెండు టీ కప్పులు తీసుకువచ్చి, “సార్ నమస్తే. టీ తీసుకోండి” అని పలకరించింది
“రేయ్ నిన్ను చూసిన ఆనందంలో మా ఆవిడను పరిచయం చేయడం మర్చిపోయాను. తన పేరు హేమలత. వీళ్ళది కూడా హైదరాబాదే. వీళ్ళ నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీరు. తను కంప్యూటర్ సైన్సులో బి.టెక్ చేసింది” అని పరిచయంచేశాడు.
“అమ్మా నా పేరు నందగోపాల్. మా ఆవిడ పేరు మాధవి..” అని నా గురించి పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తుండగానే,
“మీ పేరు నందగోపాల్. మీ ఆవిడ పేరు మాధవి. మీది ప్రేమ వివాహం. మీరిద్దరూ ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు” అని తనే చెప్పేయడంతో.
‘నా విషయాలు అప్పుడే మీ ఆవిడకు చెప్పేశావా?’ అన్నట్లు ఆశ్చర్యంగా పరమేశం వైపు చూశాను. ఔనన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పాడు పరమేశం.
నన్ను ఈ ఊరికి రమ్మని పిలవడానికి ఫోను చేసినప్పుడు నా గురించిన విషయాలు వాడితో పంచుకున్నాను. అవి అప్పుడే వాళ్ళ ఆవిడతో చెప్పేసినట్లున్నాడని నేను అనుకుంటుండగా, పరమేశం అమ్మా,నాన్న మేం ఉండే గదిలోకి వచ్చారు. వాళ్లు రాగానే, “మీరు మాట్లాడుతూ ఉండండి” అని చెప్పి ఏదో పనిమీద హాల్లోకి వెళ్ళింది హేమలత.
“నాన్నా, వీడు గుర్తున్నాడా? మన రామనాథం మాస్టారిగారి అబ్బాయి నందగోపాల్” అని వాళ్ల అమ్మా,నాన్నలకు పరిచయం చేశాడు నన్ను.
“బాబు, మీ అమ్మా,నాన్న బాగున్నారా. నీవు ఏం చేస్తున్నావు” అని అడిగారు.
“బాగున్నారండి. నాన్న రిటైర్ అయిన తర్వాత అమ్మా,నాన్న సొంతూర్లోనే ఉండిపోయారు. నేను హైదరాబాదులో జాబ్ చేస్తున్నాను” అని చెప్పడంతో వాళ్లూ హేమలతాలాగే అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
వాళ్లు అటు వెళ్ళగానే, “అవున్రా స్వామి! బి.టెక్ చేసిన అమ్మాయి నిన్ను ఎలా పెళ్ళి చేసుకుంది?” ఆశ్చర్యంగా అడిగాను. దానికి పరమేశం తనదైన శైలిలో ఒక నవ్వు నవ్వి మొదలెట్టాడు, “తనకి పల్లె వాతావరణం అంటే చాలా ఇష్టమట. బాగా చదువుకుని పల్లెలోనే ఉండే అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని వాళ్ళ నాన్నతో తెగేసి చెప్పేసిందంట. దాంతో అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇక్కడే వ్యవసాయం చేస్తున్న నన్ను వలపన్ని పట్టుకున్నాడు వాళ్ళ నాన్న. అందులోనూ నేను తనకి బాగా నచ్చడంతో మా పెళ్ళి సాఫీగా జరిగిపోయిందిరా. తను వర్క్ ఫ్రం హోమ్ చేస్తోంది.” అని నవ్వుతూ కుర్చిలో వెనుకకు వాలి రిలాక్స్ అయ్యాడు పరమేశం.
“రేయ్ స్వామి! నిన్ను చూస్తుంటే నీవు భార్యకు పూర్తిగా బానిసయినట్లు అనిపిస్తోందిరా” అన్నాను.
నా మాటకు పరమేశం మళ్ళీ నవ్వి, “రేయ్ నందా, అదే నీ అజ్ఞానం. నీవు నాణేనికి ఓ వైపే చూస్తున్నావు. మరో వైపు చూడడంలేదు. తన దృష్టిలో నేనెలా ఉండాలో రిక్వెస్ట్ గా తను అభ్యర్థించింది. తనకి నెలకి రెండుసార్లు సినిమాకి వెళ్ళాలని, అప్పుడప్పుడు పట్టణానికెళ్ళి మంచి హోటల్లో భోజనం చేయాలని ఆశ. నేను తన ఆశలకు గౌరవం ఇచ్చి సరేనన్నాను. దాంతో నేను చెప్పిన విషయాలను కూడా కాదనకుండా తను అమలు పరుస్తుంది. నాకు ప్రతి సోమవారం గుడికెళ్ళటం అలవాటని నీకు తెలుసుకదా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకూ తను ప్రతి సోమవారం నాతో గుడికొస్తుంది. నాకు ఇష్టమైన వంటకాలన్నీ కాదనకుండా చేసి పెడుతుంది. ఇందులో ఒకరు ఇంకొకరికి బానిసవ్వడం ఎట్లా అవుతుందిరా” అని చెప్పగానే చిన్నతనంలో ప్రతిమాటకి అడ్డు చెప్పే పరమేశమేనా వీడు అని అనిపించింది.
“రేయ్ నందా, ఏంట్రా ఆలోచిస్తున్నావు. అంతేకాదురా వివాహం ముందు అమ్మాయి పరిసరాలు, ఆచారాలు వేరుగా ఉంటాయి. అలాగే అబ్బాయి అలవాట్లు, నమ్మకాలు, వేరుగా ఉంటాయి. వివాహం అయిన తర్వాత భిన్న పరిస్థితుల మధ్య ఇద్దరికీ కాస్త సర్దుబాటు అవసరమవుతుంది. భార్యాభర్తల్లో ఎవరి వ్యక్తిత్వం బలీయమైనదో వాళ్ళ అభిరుచికి, అలవాట్లకి అనుకూలంగా మరొకరు సర్దుబాటుకు లోనుకావలసి వస్తుందే తప్ప బానిసవ్వడం అనేది ఉండదు” అని వాడు చెప్పగానే, వాడి మాటలు నా అంతరంగంలోకి వెళ్ళి సూదుల్లా గుచ్చుకుని నన్ను కలవరపెడుతున్నాయి.
ఇన్నాళ్లు నేను చేసిన పొరబాటును వాడు నా ముందు ఆవిష్కరింపజేశాడు. ఇప్పుడు వాడు నాకు స్నేహితుడిలా కనబడటంలేదు. నా జీవితానికి దిశానిర్దేశం చేసిన గురువులా కనబడుతున్నాడు.
వాళ్ళ కుమారుడికి పేరు పెట్టడంలోనూ పరమేశం, హేమలత తమ విజ్ఞతను చాటుకున్నారు. హేమలత నాన్నగారి పేరులోని సగాన్ని, పరమేశం నాన్నగారి పేరులోని సగాన్ని కలిపి “రఘురామ్” అనే పేరుని తమ బిడ్డకు పెట్టుకున్నారు.
నామకరణ కార్యక్రమం పూర్తైన తర్వాత వాడి దగ్గర శెలవు తీసుకుని వచ్చి బస్సు ఎక్కానుగాని మనస్సు ప్రశాంతంగాలేదు.
పరమేశంలా ‘నేను నా భార్యతో ఇన్నిరోజులు సఖ్యంగా ఎందుకు ఉండలేకపోయాను’ అనే తలంపే నన్ను ఎక్కువగా బాధిస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఎడబాటుకాదు సర్దుబాటు అనే విషయాన్ని తెలియజేసిన పరమేశం ఇప్పుడు నాకు పరమాత్ముడిలా కనిపిస్తున్నాడు.
* * *
తిరుపతి నుంచి హైదరాబాదు రైల్వేస్టేషన్లో దిగి ఆటోలో ఇంటికి చేరేటప్పటికి వరండాలోని కుర్చీలో కూర్చుని ఫోను చూసుకుంటోంది మా ఆవిడ మాధవి. నన్ను చూడగానే హడావుడిగా ఇంట్లోకి వెళ్ళింది.
నేను ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చోగానే గ్లాసులో నీళ్ళు తెచ్చిచ్చి వెంటనే వంటగదిలోకి వెళ్ళింది. నీళ్లు తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చోగానే కాఫీ కప్పు నా చేతికిచ్చి తనూ కాఫీ తాగుతూ ఫోను చూసుకోవడం మొదలెట్టింది.
కాఫీ ఒక సిప్ చేసి, “కాఫీ చాలా బాగుంది” అని తనకి కితాబు ఇచ్చేసరికి, ఆశ్చర్యంతో నావైపు చూసి మళ్ళీ ఫోనులో నిమగ్నమైపోయింది.
తన ఆశ్చర్యానికి అర్థం ఉంది. ఎప్పుడూ విసుక్కునే నేను చాలారోజుల తర్వాత తన వంటకాన్ని మెచ్చుకోవడంతో తనకు ఆశ్చర్యం కలగడంలో అతిశయోక్తిలేదుగాని నా మనస్సులో మాత్రం ఏదో తెలియని ఆనందం మాత్రం నన్ను ఆవహించింది.
సృష్టిలో ఏ మార్పులకైనా కారణాలు ఉండకపోవు. సూర్యుడు ఉదయించనిదే వెలుతురురాదు. దుఃఖం రానిదే సుఖం విలువ తెలియదు. ఆకలివేస్తే అన్నం తింటాం. దాహం వేయనిదే నీళ్ళు త్రాగం. ఇలా కారణాలు, కార్యాలు బహిరంగంగా తెలిసిపోతూ ఉంటాయి. కానీ, మనిషికి సంబంధించినంతవరకు ఒక్కోసారి అతని అంతరంగంలో కారణాలు రహస్యంగా ఉండి కార్యాలు మాత్రం కొట్టొచ్చినట్లు బహిర్గతమవుతాయి. అప్పుడు మనిషి మనకు అర్థంగాని సమస్యగా గోచరిస్తాడు.
ఆ విధంగా నా అంతరంగంలోని అహంకారం కారణంగా మా ఆవిడకు నేను రాక్షసుడిలా కనబడ్డాను. అందువల్లే మా మధ్య మనస్పర్థలనే అడ్డుగోడలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే మనిషిలో అహంకారం అనేది అంతమవుతుందో అప్పుడు ఎదుటి వ్యక్తిలో ఏ దోషాలు కనిపించవు. ఇతరులలో ఎప్పుడైతే మనకు దోషాలు గోచరించవో అప్పుడు మనలోని దైవత్వాన్ని అందరూ దర్శిస్తారు.
ఆరోజు నుంచి తన అలవాట్లకు, అభిరుచులకు గౌరవం ఇవ్వడం మొదలెట్టాను. క్రమక్రమంగా నేను చెప్పే మాటలకు తనూ విలువివ్వడం ప్రారంభించింది. నెలరోజలకంతా మా మధ్య వున్న మనస్పర్థలు అన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు మా మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది.
ఒకే ఆఫీసు అయినప్పటికీ రోజూ విడివిడిగా వెళ్ళే మేము ఇప్పుడు ఒకే బైకులో కలిసే వెళ్తున్నాం.
నా అంతరంగంలో నాటుకుపోయిన ‘అహంకారం’ అనే విషబీజాన్ని తొలగించి ‘పరస్పర అవగాహన’ అనే అమృతాన్ని చొప్పించి, పరివర్తనం ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చనే ఆలోచన కలిగించిన పరమేశానికి మనసులో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
Discussion about this post