“కడిగి పారేశా”… అంటాడొకాయన.
“కుమ్మేశా”… అంటుందొకామె.
“క్లాసు పీకా”… అంటాడు బాసు.
“తోలుతీశా”…”కుళ్ళబొడిచా”… “వాయించా”…”ఉతికేశా”… “తిక్క కుదిర్చా”…
ఇలాంటి మాటలు మనం నిత్యం ఇళ్లల్లో, రోడ్ల మీద, ఆఫీసుల్లో వింటాం.
ఇలాంటి మాటలు వాడే వారు పెద్ద ఘనకార్యం చేసినట్లు ఫీలై ఫ్రస్ట్రేషన్ తీరిన ఆనందంతో చెబుతారు. అంతే తప్ప, వీరివల్ల అవతల వ్యక్తి ఎంత బాధ పడిందీ, కలత చెందిందీ, క్షోభ పడిందీ పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళ బారిన పడి కుళ్ళికుళ్ళి ఏడ్చేవాళ్ళు, లోలోపల కుమిలిపోయేవాళ్లు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. కొట్టి భౌతికంగా గాయపరిచి రక్తస్రావం చేసే దానికన్నా ఎక్కువగా మాటలతో దాడిచేసి గాయపరుస్తారు. ఈ క్రమంలో ఎదుటివ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారు. ఆఫీసులో మాటల దాడికి బలైన వ్యక్తి బుర్ర హీటెక్కి, తిక్కతిక్క అయిపోయి ఇంట్లో అకారణంగా అరవడం, కరవడం మనం చూసే ఉంటాం.
మన సమాజంలో రోగమొచ్చి మంచాన పడినా, గాయం పాలై మూలాన పడినా’ అయ్యో’ ని సానుభూతి చూపితే చూపుతారు గానీ, మనసు వికలమై, హృదయం గాయపడి ఇబ్బంది పడుతుంటే ‘ఏమైంది?’ ‘ఎందుకలా ఉన్నావ్?’ ‘ఏమీ కాదులే’ అని ఊరడించేవాళ్ళు, భుజం ఆసరాగా అందించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడేవారిని ‘ఏమిటా మాడు మొహం?’, ‘ఎప్పుడూ ఏడుపు మొహమేనా?’, ‘నీ మొహం నాకు చూపించకు’ అనే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు. ప్రేమలో పడిన వాళ్ళు అభిప్రాయ బేధాల వల్లనో, చెప్పుకోలేని కారణాల వల్లనో గుండెకు చిల్లుపడి దిగాలై, కుదేలై పోవడమే ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉండి ఆదుకునేవారు లేక కుమిలి పోయే వాళ్ళ, అప్పు పుట్టక ఇబ్బంది పడేవాళ్ళ, కుటుంబ సభ్యులు పట్టించుకోనివాళ్ళ మానసిక స్థితి ఊహించుకుంటేనే కష్టంగా ఉంటుంది.
స్కూల్లో టీచర్లు, ఇళ్లలో భర్తలు, ఆఫీసుల్లో బాసులు, ఇతరత్రా అధికారం, డబ్బు ఉన్నవారే ఎక్కువగా ఇతరుల మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అవకాశం ఉంది. మార్కులు సరిగా రాలేదని తల్లిదండ్రులు, ఏదో విషయం మిషతో అత్తమామలు, ప్రతిదానికీ తిట్టే పై ఉద్యోగి వల్ల కనిపించని నష్టం అంతా ఇంతా కాదు. ఈ మాటలు పడడం కన్నా ‘పోవడం నయం’ అనుకుని అర్థంతరంగా తనువు చాలించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎదుటివారి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోని మానసిక వికలాంగుల గురించి చెప్పాలంటే ఎంతైనా ఉంటుంది. మానసిక ఆరోగ్యంపై కొవిడ్ ప్రభావం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు అందరిలో నిరాశ నిస్పృహలు బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయి.
మనమందరం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం (మెంటల్ హెల్త్) గురించి గట్టిగా పట్టించుకోవాలి ఈ సమయంలో. నేను మీడియాలో నే కాకుండా బైట వివిధ వృత్తుల్లో ఉన్న కొందరు మిత్రులను చూస్తే ఈ మధ్యకాలంలో వారి మానసిక ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నట్లు అర్థమవుతోంది కానీ, వారికి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థంకాలేదు. మీకూ ఇలాంటిది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. మానసిక ఆరోగ్యం విషయంలో కొన్ని సూచనలు:
1) మానసిక ఆరోగ్యానికి హాని కలుగుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. హర్ట్ ఫీలింగ్ తో పాటు గుండె లో గుచ్చినట్లు, బుర్ర భారం అయినట్లు అనిపించి చీకాకు, కోపం అనిపిస్తే వెంటనే అలర్ట్ కండి. మనల్ను ఇబ్బంది పెడుతున్న అంశాన్ని తాత్కాలికంగా దూరం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం.
2) టాక్సిక్ ఆలోచనల నుంచి మనసు దూరంగా పోయేలా డీవియేషన్స్ వెతుక్కోవడం వెంటనే చేయాలి. ఏవైనా ఆటలు ఆడటమో, పాటలు వినడమో, పుస్తక పఠనమో, కుటుంబ సభ్యులతో కాలక్షేపపు మాటలో, సన్నిహిత మిత్రులతో కులాసా కబుర్లో బాగా మేలు చేస్తాయి. వీలైతే లాంగ్ వాక్ కు వెళ్లడం మంచిది.
3) మనల్ను ఇబ్బంది పెట్టిన అంశం పదేపదే గుర్తుకు వచ్చి మదిలో కల్లోలం సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిపోతుంది. అది మరీ ఇబ్బంది పెడుతుంటే ఎదుటివారిపై చీకాకు కలుగుతుంది. తిక్క లేచి దాడి చేసే స్థాయికి వెళ్తాం. అప్పుడు మనకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి సాయం తీసుకుని ఆ అంశాన్ని అన్ని కోణాల నుంచి చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చినా బాగుంటుంది.
4) మనసు గాయపడినప్పుడు చేయకూడని పని: హడావుడిగా ఆ వేడిలోనే నిర్ణయాలు తీసుకోకపోవడం, ఒక నిశ్చితాభిప్రాయానికి రాకపోవడం. అలాంటి సమయంలో టెక్స్ట్ మెసేజ్ లు అస్సలు ఇవ్వవద్దు. ఫోన్ దూరంగా పారేసి ఒక గంట మౌనం పాటిస్తే ఇంకా మంచిది.
5) అన్నిటికన్నా ముఖ్యంగా, పాత విషయాలు తోడుకొని వాటిని ప్రస్తుత పరిస్థితికి యాడ్ చేస్తే మన నరాలకు, మన చుట్టూ ఉన్నవారికి ప్రమాదం. ప్రస్తుత అంశానికి నిన్నటి అంశాన్నైనా జతచేసి చూడకండి ప్రస్తుతానికి.
6) ఇతరుల ప్రతిభ, సామర్థ్యాలను తక్కువ చేయకుండా ఉండడం అనే సంస్కారాన్ని అలవరచుకోవాలి.
7) ఎవ్వర్నీ చిన్న చూపు చూడవద్దు. అహంకారం, ఈర్ష్య వదిలేస్తే ఈ పరిస్థితి రాదు.
8) కఠినంగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడకుండా గొంతుచించుకుని అరవడం రాక్షస లక్షణమని అందరం గుర్తిస్తే అందరి మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
9) కొద్ది సమయంలో పెద్ద మొత్తంలో సంపాదించాలన్న యావ చాలా సమస్యలకు మూలం. ఉన్నదాంతో తృప్తి పడి, పది మెట్లు ఒకే సరి ఎక్కేయాలని కాకుండా ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఎక్కుతూ పోతే మంచిది.
10) మనం టెన్షన్ పడవద్దు, ఎదుటివాడిని టెన్షన్ పెట్టవద్దు. ఎవడి బతుకు వాడిని బతకనిస్తే నిశ్చింత.
నోటి తీటతో ఇతరులను మానసికంగా ఇబ్బంది పెట్టినట్టే, ఒక మంచి ఊరటనిచ్చే ఇతరుల్లో మాటతో సాంత్వన కలిగించవచ్చు. దయచేసి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇతరుల మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేలా ప్రవర్తించండి.
.. డాక్టర్ ఎస్ రాము
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం బోధకులు

.