ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వాలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజులుగా చర్చలే చర్చలు! వ్యవహారం ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చర్చలకు స్వయంగా కూర్చోలేదు. వ్యవహారం సంపూర్ణంగా తెగలేదు.
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ చర్చించారు. వీళ్లంతా కలిసి ఒక్క విజయం సాధించారు. ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు వెళ్లకుండా ఆపగలిగారు. వాళ్లు తలపెట్టిన పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో చర్చల సారాంశాన్ని మీడియాకు వివరించే ప్రయత్నంలో మరో సంగతి కనిపిస్తోంది. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకోవడంలో భాగంగా, వాటిని దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలని చెప్పే పనిలో భాగంగా.. ఉద్యోగుల వైపు నుంచి జగన్ ప్రభుత్వం మీద ఒక చిన్న వెటకారం, ఎత్తిపొడుపు కనిపిస్తోంది. వారివైపునుంచి ఒక డిమాండ్ మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి పుండుమీద కారం రాసినట్టుగా ఆగ్రహం తెప్పించే అవకాశం కూడా ఉంది. డైరెక్టు మీనింగ్ కాకపోయినా ఇండైరక్ట్ మీనింగ్ జగన్‌కు చిరాకు పుట్టించేదే.
ఉద్యోగులు మొత్తం 85 సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. వాటితోపాటు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి- 11 డిమాండ్లను కూడా ప్రభుత్వానికి వినిపించారు. అందులో సచివాలయ ఉద్యోగులకు అమరావతిలోనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలనే ప్రధాన డిమాండ్ కూడా ఉంది. అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో ప్రస్తుతం సచివాలయం నడుస్తూ ఉండవచ్చు గానీ.. ‘అమరావతి రాజధాని’ అనే భావననే తాను సమూలంగా తుడిచిపెట్టేశానని ముఖ్యమంత్రి జగన్ అనుకుంటున్నారు. అలాంటి నేపథ్యలో సెక్రటేరియేట్ ఉద్యోగులు అందరికీ అమరావతిలో ఇళ్ల స్థలాలు కావాలి అనే డిమాండ్.. అన్యాపదేశంగా జగన్ ప్రభుత్వపు అసహాయతను ఎత్తిచూపే డిమాండ్. ‘అమరావతినుంచి రాజధాని ఎక్కడకూ తరలిపోదు, మీరు ఎక్కడకూ తరలించలేరు.. సచివాలయం ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది..’ అని ఉద్యోగులు భావిస్తున్నట్టుగా ఈ డిమాండ్ చెబుతోంది.
అసలే.. హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పదనే సంగతి అర్థమైన తర్వాత.. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుని.. సీఎం జగన్ పరాభవ భారంతో ఉన్నారు. దానికి మరింత ఆజ్యం జత చేస్తున్నట్టుగా.. అమరావతి నుంచి రాజధాని తరలిపోవడం అసాధ్యం అనే సంకేతాలు ఇస్తూ సచివాలయ ఉద్యోగులందరికీ ఇక్కడ ఇళ్ల స్థలాలు కావాలనడమే తమాషా.
ఉద్యోగుల డిమాండ్లలో పైకి కనిపించికపోయినప్పటికీ బిట్వీన్ ది లైన్స్ గమనించినప్పుడు.. జగన్ సర్కారు పట్ల మరొక వెటకారం కూడా ఉంది. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. ఇందులో వింతేం లేదు. అయితే ‘‘కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నందున అదనపు పనిభారం పెరుగుతోందంటూ’’ వారు పేర్కొన్నారు. కోర్టుకేసులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని ప్రస్తావించడం అంటే.. జగన్మోహన రెడ్డి వచ్చిన తర్వాత.. ప్రతి అంశమూ కోర్టుకు వెళుతోందని దెప్పిపొడవడమే.
ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన మాట నిజమే గానీ.. ఈ రెండు అంశాలను గమనించినప్పుడు.. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అసహనం కలిగేలా మాట్లాడారని అనిపిస్తోంది.
.

Discussion about this post