ప్రపంచంలో 99 శాతం మందికి ఎంతో ఇష్టమైన పదం ‘నేను’. ఎవరి పేరు వారికి ఇష్టం, ఎవరిలో మంచి గుణాలు వారికి గొప్ప, ఎవరి సంపద వారికి సుఖం, ఎవరి పని వారికి ముఖ్యం, ఎవరి కష్టం వారికి దుఃఖం. ఇది లోకరీతి. దీనికి భిన్నంగా ఎవరుంటారు? ఎందరుంటారు? ఎక్కడ ఉంటారు? అన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. ఒకవేళ ఉన్నా.. ఈ సమాజంలో అంతరించిపోతున్న జాతి అది!
మన గురించి సరే.. ఎదుటివాళ్ల గురించి ఏం ఆలోచిస్తున్నాం.. అనేది ముఖ్యం. మనం సంఘజీవులం. నేను మాత్రమే మంచిగా, నేను మాత్రమే సుఖంగా ఉంటా, నా ఏడుపు నేను మాత్రమే ఏడుస్తా అనుకుంటే కుదరదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఆ మంచితనమూ, సుఖమూ ఉండాలి. అప్పుడే మన జీవనం సవ్యంగా ఉంటుంది. వ్యష్టి జీవనం ఎప్పుడూ కూడా సమష్టి జీవనంగా మారాలి. అప్పుడే సమాజంలో ఆ మధురిమ ఉంటుంది.
ఇదే విషయాన్ని మనకు ఒక సుభాషితం చాలా స్పష్టంగా చెబుతుంది.
విరళా జానన్తి గుణాన్ విరళాః కుర్వన్తి నిర్ధనే స్నేహమ్
విరళాః పరకార్యరతాః పరదుఃఖేనాపి దుఃఖితా విరళాః
ఇతరులలోని మంచి లక్షణాలను గుర్తించే, తెలుసుకోగలిగే వాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. ఆర్థికంగా పేదవాళ్లతో స్నేహం కొనసాగించే వాళ్లు కూడా చాలా కొద్దిమందే ఉంటారు. అలాగే ఇతరుల పనిలో పూర్తిగా లీనమైపోయి.. తమ పని కంటె ఎక్కువగా భావిస్తున్నట్లు అందులో మమేకమై పనిచేసేవారు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇతరుల దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించేవాళ్లు, ఇతరుల కష్టాన్ని చూసి ఓర్వలేని వాళ్లు కూడా చాలా తక్కువమంది కనిపిస్తారు. .. అనేది శ్లోకభావం.
ఎవడి డప్పు వాడే కొట్టుకోవడమనేది లోకసహజం. ప్రతి ఒక్కరికీ తమ గురించి, తమ ఘనత గురించి, తమ వైదుష్యం గురించి నలుగురూ గుర్తించాలని.. వారు గుర్తించకపోయినా.. తాము వారందరికీ చెప్పుకోవాలని దుగ్ధ ఉంటుంది. మరి మనం అలా ఆశిస్తున్నప్పుడు.. ఇతరుల ఘనతను గుర్తించే అలవాటు కూడా మనకి ఉండాలి కద. ఆ పని మాత్రం చాలా తక్కువ మందే చేస్తారు. ఇతరుల్లో మంచి లక్షణాలను గుర్తించాలన్నా మనకు మనసొప్పదు- అలా గుర్తించడం వల్ల మనకు నష్టం లేకపోయినా సరే! అలా గుర్తించగలిగేవాళ్లు తక్కువమందే ఉంటారు.
అలాగే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా సంపదతో తులతూగే వాడితో స్నేహం చేయడానికి బోలెడు మంది పోగవుతారు. పేదవాడితో ఎవరు స్నేహం చేస్తారు? అలా చేసేవాళ్లు కొద్దిమందే ఉంటారు. ఆర్థిక వ్యత్యాసాలు పేదరికానికి అడ్డుకావని అనుకునేవాళ్లు కొందరే ఉంటారు. మన పని కానప్పుడు అందులో వేలు పెట్టే ఉద్దేశం కూడా చాలా మందికి ఉండదు. మన పనులు మానుకుని, వాళ్లకు మనమెందుకు సాయం చేయడం అనుకుంటూ ఉంటారు. దీనికి విరుద్ధంగా ఇతరుల పనిలో కలబడి.. అండగా నిలిచేవాళ్లు తక్కువ. ఇతరుల దుఃఖానికి స్పందించడం కూడా సామాజిక సమష్టి జీవనానికి చాలా అవసరం. ఎవరికైనా ఆపద వాటిల్లితే.. మొక్కుబడిగా నాలుగు సాంత్వన వచనాలు చెప్పి దులుపుకుని వెళ్లిపోవడం కాదు. వారి బాధను పంచుకోవడం అనేది ముఖ్యం.
సమష్టి జీవనమే అద్భుత జీవన నాదంగా భావించే వాళ్లే అంతరించిపోతున్న జాతి- అని చెబుతుంది ఈ సుభాషితం. అందుకే ఈ నాలుగు రకాల మనుషుల్లో మనం ఏ ఒక్క రకానికైనా చెందుతామో లేదో పరీక్షించుకోవాలని అంటుంది.
ఒక్క సంగతి గుర్తు చేసుకుందాం..
శ్రీరంగం శ్రీనివాసరావును మించిన కవిత్వం రాస్తున్న వాళ్లు ఆ రోజూ ఉన్నారు. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉన్నారు. కానీ ఆయనని మహాకవి అని ఎందుకు అంటున్నాం. ఈ శతాబ్దం నాది అని ఆయన ప్రకటించుకుంటే, మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? ఎందుకంటే- ‘ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ’ అనే నిర్వచనానికి ఆయన ఒదిగాడు కాబట్టి.
శుభోదయం
.

Discussion about this post