రాజనీతిజ్ఞుడు, వివాద రహితుడు, తెలుగు రాష్ట్రాలలో వర్తమాన రాజకీయాలలో మేరునగ సమానుడుగా పేరు తెచ్చుకున్న కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. పార్టీ భేదాలేమీ ఎంచకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ రోశయ్యకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వీరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రోశయ్య చివరి చూపు కోసం హైదరాబాద్ రావడం లేదు. తమ ప్రభుత్వం తరఫున ముగ్గురు మంత్రులను ఎంపిక చేసి మరీ రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి పంపుతున్నారు. బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ ప్రభుత్వం తరఫున హాజరవుతున్నారు.
ప్రభుత్వం తరఫున అధికారికంగా కాకుండా.. కేవలం రోశయ్య మీద గౌరవం, భక్తితో ఇతర మంత్రులు ఎవరైనా వస్తున్నారో లేదో తెలియదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం రావడం లేదు. ఆయన ఫోన్ చేసి రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ జరుగుతోంది..
వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే, రోశయ్య మరణం పట్ల ఇలాగే వ్యవహరించి ఉండేవారా? అనేదే ఆ చర్చ! ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన ప్రజారంజక, జనాకర్షక పరిపాలనలో ఆయనకు వెన్నుదన్నుగా, పెద్దదిక్కుగా సుదీర్ఘకాలం సేవలందించిన నాయకుడు కొణిజేటి రోశయ్య. వైయస్ రాజశేఖర్ రెడ్డి తాను స్వయంగా రోశయ్య కు ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో.. అందరికీ తెలుసు. వైఎస్ హయాంలోనే వరుసగా ఏడు సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా కొణిజేటి రోశయ్య చరిత్ర సృష్టించారు. ఏదైనా శుభకార్యాలకు ఇద్దరూ కలిసి వెళ్ళినప్పుడు ఆశీర్వదించాల్సి వస్తే, పెద్ద వారు గనుక రోశయ్యను ముందు నిలిపి తాను వెనక ఉండే సాంప్రదాయాన్ని కూడా వైయస్ రాజశేఖర రెడ్డి పాటించే వారు. అందుకు తార్కాణాలు ఉన్నాయి.
వీటన్నింటినీ మించి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వతహాగా మానవ సంబంధాలకు పెద్ద పీట వేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరకాల శతృత్వాలను కూడా లెక్క చేయకుండా, తను ఆశ్రయించిన వారితో ప్రేమగా వ్యవహరించే తీరు ఆయన సొంతం. అలాంటిది రోశయ్య లాంటి దిగ్గజ నాయకుడు మరణిస్తే.. ఎంతటి కార్యభారం, పనుల ఒత్తిడి ఉన్నా సరే వైయస్సార్ స్వయంగా రాకుండా ఉంటారా? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.
వైయస్ జగన్మోహనరెడ్డి పట్ల కొణిజేటి రోశయ్య పుత్రవాత్సల్యం చూపించేవారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా వివిధ సందర్భాల్లో ప్రకటించారు కూడా. వైయస్ మరణానంతరం తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆయన ముఖ్యమంత్రి అధికార నివాసం జోలికి వెళ్ళనేలేదు. ఆ అధికారిక నివాసంలో లో జగన్ కుటుంబమే చాలా కాలం నివసిస్తూ వచ్చింది.
వైయస్ జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని అప్పట్లో సంతకాలు సేకరించిన సందర్భంలోనూ రోశయ్య నుంచి ఎలాంటి వ్యతిరేకత, ప్రతిఘటన లేవు. ముఖ్యమంత్రి పదవిని ఆయన తనకు అనుకోకుండా లభించిన పనిగానే చూశారు, నిష్కామకర్మగానే ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
అలాంటి రోశయ్య పట్ల జగన్మోహన్ రెడ్డి మరింత సాదరంగా, మరింత ఆత్మీయంగా.. వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆయన మరణించినప్పుడు అంత్యక్రియలకు కూడా రాలేకపోతే.. అంతకుమించి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా, ఎప్పటికి నిరూపించుకోగలరు?
అనేక విషయాలలో తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటను అనుసరిస్తూ ఉండే.. వైఎస్ జగన్.. మానవ సంబంధాలను కొనసాగించే విషయంలో ఎందుకని ఇలా నిర్లిప్తంగా ఉంటున్నారో.. సామాన్యులకు అర్థం కావడం లేదు. ఆయన అభిమానులకు కూడా ఈ తీరు ప్రశ్నార్థకంగానే ఉంది.
.
Discussion about this post