గుంటూరు జిల్లా నుంచి.. తన స్వయంకృషితో రాజకీయాల్లో ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదిగిన కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. ఆ విధేయతను చివరి వరకు నిలబెట్టుకున్నారు. అయితే ఒకే ఒక్క సందర్భంలో మాత్రం ధిక్కరించారు. అది కూడా ప్రోటోకాల్ మర్యాదలను కూడా తోసిరాజని.. పార్టీ అభీష్టాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ధిక్కరించారు. తన సొంత ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు.
రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో.. ఆయన బహిరంగంగా వినిపించిన ఏకైక ధిక్కారస్వరానికి ఆనవాలుగా ఆ సంఘటన మిగిలిపోయింది. రోశయ్య ఎంతటి విధేయుడు అంటే.. ఏనాడూ ఆయన పార్టీని తనకు ఇది కావాలని డిమాండ్ చేసింది లేదు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను నిర్వర్తించారు. అందుకే ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా అన్ని రకాల బాధ్యతలూ చూశారు. వాటిలో ఏ ఒక్క పదవి కోసం కూడా ఆయన వెంటపడి, ఆరాటపడి పైరవీలు చేసి సాధించుకున్నది కాదు. ఆయన పార్టీని ధిక్కరించిన ఏకైక సందర్భం ఏంటంటే..
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన సంఘటన ఇది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరం సమీపంలో 2010 సెప్టెంబరు 1న ఎన్‌బీపీపీల్ ఆధ్వర్యంలో నిర్మించే విద్యుత్ ఉపకరణాల ప్రాజెక్టుకు భూమిపూజ జరిగింది. రూ.6వేల కోట్ల అంచనాతో నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య ఉన్నారు.
also read : రోశయ్య జీవితం, రాజకీయ ప్రస్థానం వివరాలు
ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ప్రధాని భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య హాజరు కావాల్సి ఉంది. అయితే రోశయ్య ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ మిన్నకుండి పోయారు. నిజానికి రెండు రోజుల కిందటే శ్రీకాళహస్తిలో రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రోశయ్య వచ్చి వెళ్లారు. అంతలోనే అనారోగ్య కారణాల మిష చూపి సెప్టెంబరు 1వ తేదీన.. ప్రధాని కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇతర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే, ప్రధానంగా ఆయన ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి వేరే కారణముంది.
కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా రోశయ్యను తొలగించాలని అప్పటికే నిర్ణయం తీసుకుంది. వైఎస్ మరణం తర్వాత తాను ఆశించకుండానే ముఖ్యమంత్రి పదవి దక్కినప్పటికీ.. రోశయ్య ఏనాడూ దూకుడు ప్రదర్శించలేదు. పదవికోసం కూడా ఆరాటం కూడా కనబరచలేదు. చాలా సౌమ్యుడిగానే ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించారు.
also read : శ్రీకాళహస్తి రాజగోపుర నిర్మాణం రోశయ్య చొరవే
కానీ.. అనేక రకాలుగా రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి.. రోశయ్య కినుక వహించారో ఏమో తెలియదు. తన పదవీకాలం చివరిరోజుల్లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఆ తరువాత కొన్ని రోజులకే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. రోశయ్య తప్పుకున్నారు. తర్వాత.. తమిళనాడు గవర్నరుగా వెళ్లారు. అలా పార్టీ నిర్ణయం పట్ల అప్రకటిత అసంతృప్తిని చూపించిన, ధిక్కారం కనబరిచిన ఏకైక సంఘటనగా అది ఆయన జీవన ప్రస్థానంలో మిగిలిపోయింది.
.