దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు తన విజయానికి చిహ్నంగా నిర్మించిన రాజగోపురం (గాలిగోపురం) 2010 మే 26న నేల కూలింది. ఈ గోపురం పునర్నిర్మాణానికి నవయుగ నిర్మాణ సంస్థ వారు ముందుకు రావడంతో అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య 2010 ఆగస్టు 29న శ్రీకాళహస్తికి విచ్చేసి రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ చేశారు.
శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన రాజగోపురం కూలి పోవడం తనను వేదనకు గురిచేసిందని ఆ సందర్భంగా రోశయ్య అన్నారు. అంతటి గోపురం తమ సొంత నిధులతో నిర్మించడానికి ముందుకు వచ్చిన నవయుగ నిర్మాణ సంస్థ వారిని ఆయన అభినందించారు. రెండేళ్ల లోపు గోపురం నిర్మాణం పూర్తి చేయాలని కూడా అప్పట్లో ఆయన దాతలకు సూచించారు. ఆ తరువాత రాజగోపురంను నవయుగ నిర్మాణ సంస్థ వారు ఎంతో అద్భుతంగా నిర్మించారు.

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉండే రాజగోపురం పునర్నిర్మాణం అనేది.. కేవలం అప్పటి ముఖ్యమంత్రిగా రోశయ్య చొరవతోనే సాధ్యమైందని శ్రీకాళహస్తి వాసులు నమ్ముతుంటారు. రాజగోపురంతో స్థానికాం ప్రతి ఒక్కిరికీ తెలియని అనుబంధం ఉండేది. శ్రీకాళహస్తి వాసులు రోజులో ఒక్కసారైనార రాజగోపురం చూడకుండా ఉండలేరని అందరూ అంటే ఉంటారు. వీరబ్రహ్మం కాలజ్ఞానంలో కూడా ఈ రాజగోపుర ప్రస్తావన ఉంటుంది. అలాంటి గోపురం కుప్పకూలిపోయే సరికి స్థానికులు చాలా ఆవేదన చెందారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య.. ప్రత్యేకంగా చొరవ తీసుకుని.. చాలా తక్కువ కాలంలోనే.. కొత్త గోపురం నిర్మాణం అయ్యేలా కీలక పాత్ర పోషించారు. అందుకు ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు ఎఫ్పటికీ గుర్తంచుకుంటారు.
శ్రీకాళహస్తితో విడదీయరాని బంధం
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు శ్రీకాళహస్తి ఆర్యవైశ్య సంఘం నేతలతో విడదీయరాని బంధం ఉంది. ఈ పట్టణానికి చెందిన ఆర్య వైశ్య సంఘం నేతలు పీజే చంద్రయ్య శెట్టి, నాగేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గురప్ప శెట్టి, అయితా మురళి తదితర నేతలు తరచూ ఆయన్ను కలుస్తూ ముక్కంటి శేష వస్త్రంతో సన్మానించి ప్రసాదాలు అందించేవారు. రోశయ్య జ్ఞాపకాలను శ్రీకాళహస్తి వాసులు నెమరు వేసుకుంటున్నారు.
గురు సమానులకు నివాళి
మా గురు సమానులు అద్వితీయ పరిపాలన దక్షులు, సేవా తత్పరులు, నా క్షేమం కాంక్షించు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,కొణిజేటి రోశయ్య గారికి నివాళి అని శ్రీకాళహస్తి వాసి ఆయనకు ఆప్తుడైన ఓరుగంటి నాగేశ్వరరావు తెలిపారు. వీరి మరణం నాకు తీరని లోటుఅని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఒక పెద్దదిక్కును కోల్పోయినట్లుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.