ఇలాంటిది జరుగుతుందని అందరూ ఊహిస్తున్నదే. అందరి అంచనా వేస్తున్న తీరులోనే.. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డి తనకు సంబంధం లేదని అంటున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
వివేకాందరెడ్డి మాజీ డ్రైవరు దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇటీవల బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా గంగిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి ఆప్తుడు అయిన శంకరరెడ్డి హత్యలో ప్రధానంగా పాల్గొన్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఆ తర్వాతి పరిణామాలలో శంకరరెడ్డిని కోర్టులో విచారిస్తునన సందర్భంగా అవినాష్ రెడ్డి అక్కడకు వచ్చి ఆయనతో మాట్లాడడం, ఆ సందర్భంగా చేసిన హల్ చల్ కూడా చర్చనీయాంశం అయింది.
దస్తగిరి వాంగ్మూలం గమనించిన వారికి మాత్రం.. అసలు హత్యలో ప్రధానంగా పాల్గొన్నది గంగిరెడ్డి అని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సదరు గంగిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పిటిషన్ దాఖలు అయింది. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు పిటిషన్ ధాఖలు చేశారు.
కీలకం ఏంటి..
దస్తగిరి వాంగ్మూలంలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. హత్యక్రమం, అందుకు గల కారణాలు అన్నీ ఒక క్రమపద్ధతిలో పక్కాగా చెప్పినట్లుగా ఉంది. అయితే.. అదంతా తనను ఇరికించడానికి జరిగిన కుట్రగా గంగిరెడ్డి చెబుతున్నారు. ఏ రకంగా అది కుట్ర, అలాంటి కుట్ర ఎవరు చేసి ఉంటారని.. ఆయన అనుమానిస్తున్నారు? ఇవన్నీ కూడా బలంగా ఉంటే తప్ప ప్రజలు నమ్మరు. అయితే.. ఈ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగితే.. అప్పుడు ఈ వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది.
.

Discussion about this post