విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా క్రాంతి రాణా టాటా నియమితులయ్యారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ అంటే చాలా కీలకమైన పదవి. అధికారులు పోటీపడే పదవి. అయితే ఈ పదవిలోకి క్రాంతిరాణా టాటా రావడం వెనుక చాలా హైడ్రామా జరిగినట్టు సమాచారం.
పోలీసుబాస్‌కు, ప్రభుత్వంలో కీలకమైన మంత్రికి మధ్య ఈ విషయంలో పీటముడి బిగిసింది. చివరకు రాజకీయ పలుకుబడిదే పైచేయి అయింది. వివరాల్లోకి వెళితే..
విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న బి.శ్రీనివాసులు నవంబరు 30వ తేదీన పదవీవిరమణ చేశారు. కీలకమైన ఆ పదవిలో కొత్తగా ఎవరిని నియమించబోతున్నారనే విషయంలో చాలా రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. పోలీసు ప్రముఖుల్లో ఈ పదవికోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఉండడంతో పోటీ పెరిగింది. అధికార పార్టీ కూడా ఈ పదవిని కీలకంగా భావిస్తున్నందున రాజకీయ ఒత్తిళ్లూ ఇందులోకి ఎంటరయ్యాయి.
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం.. తనకు అనుయాయుడు పాల్ రాజ్ ను విజయవాడ సీపీ చేయాలని అనుకున్నారు. గతంలో వేర్వేరు సందర్భాల్లో నగరానికి ఇన్చార్జిని నియమించాల్సి వచ్చిన సమయంలో పాల్‌రాజ్ కే ఆ పని అప్పజెప్పారు. గౌతంసవాంగ్ కు పాల్ రాజ్ సన్నిహితుడిగా ముద్ర ఉంది. ఆయనకున సంబంధించిన ఇతర వ్యవహారాలన్నీ పాల్ రాజ్ చూస్తుండారని కూడా అంటుంటారు. ఆయన డీజీపీ కార్యాలయంలోనే టెక్నికల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డీఐజీగా ఉన్నారు. పాల్ రాజ్ కే కమిషనర్ పదవి ఇవ్వాలనేది డీజీపీ ఆలోచన.
also read : విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..
అయితే అనంతపురం డీఐజీ క్రాంతి రాణా టాటా మరోవైపు నుంచి పావులు కదిపారు. ఆ హోదాలో ఉంటూ.. రాయలసీమకు చెందిన అధికార పార్టీ నాయకులతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. గతంలో ఆయనకు విజయవాడకు డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మొత్తానికి క్రాంతి రాణా టాటా వైపు ప్రభుత్వంలో కీలకంగా ఉండే మంత్రి పెద్దిరెడ్డి మొగ్గు చూపారు.
ఈ రకంగా కమిషనర్ ఎంపిక రేసు ఫైనల్స్ కు వచ్చేసరికి ప్రతిష్టంభన గౌతంసవాంగ్‌కు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య ఏర్పడింది. వ్యవహారం సీఎం జగన్ దాకా వెళ్లింది. అనేక తర్జన భర్జనల తర్వాత.. సీఎం జగన్.. క్రాంతి రాణా టాటా నియామకానికి ఓకే చెప్పారు.
దాంతో.. శ్రీనివాసులు రిటైర్ కాగానే.. ఇన్చార్జిగా కొత్వాలు బాధ్యతలు తీసుకున్న పాల్ రాజుకు ఆ ముచ్చట ఒక్కరోజే మిగిలింది. అదే రోజున క్రాంతి రాణా టాటా నియామకం ప్రకటన కూడా వచ్చేసింది.
.

Discussion about this post