ఆంధ్రప్రదేశ్‌లో అమాత్యులకు వెన్నులో వణుకు మొదలైంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. పనితీరు బాగున్నా, రేయింబవళ్లు కష్టపడ్డా అందరినీ ఒకే గాట కట్టి ఉద్వాసన చెప్పడం ఏమిటన్న అంతర్మధనం మొదలైంది మంత్రుల్లో.
మాట తప్పను, మడమ తిప్పను అనే మాటను మిగతా వాటి సంగతేమో గానీ.. అక్షరాలా ఈ విషయంలో అమలు జరిపి తీరాలన్న పట్టుదలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు.
‘‘ఈ మంత్రి వర్గం రెండున్నరేళ్లు మాత్రమే పదవిలో ఉంటుంది. ఆ తర్వాత వారంతా ప్రజల ముందుకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ బలోపేతానికి పాటుపడాల్సి ఉంటుంది. ఈ మంత్రుల స్థానే కొత్తవారికి అవకాశం కల్పిస్తాం’’ అని 2019లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే జగన్ మోహన రెడ్డి విస్పష్టంగా ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు కార్యాచరణకు ఉపక్రమించి 2022 జనవరి మధ్య నాటికి వారు వీరనే మినహాయింపులు లేకుండా అందరినీ తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా ఎక్సర్‌సైజ్ నడుస్తోందని అంటున్నారు.
మంత్రి వర్గానికి సరికొత్త జవసత్వాలు ఇచ్చే ప్రక్రియ ఇదే మొదలు కాదు. 1963లో అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కామరాజ్ నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఈ తరహా సూచనే చేశారు. కాంగ్రెస్ సీనియర్ మంత్రులంతా రాజీనామా చేసి పార్టీ బలోపేతానికి పాటుపడాలన్న కామరాజ్ సలహాను నెహ్రూ వెంటనే ఆమోదించి అమలు జరిపారు.
పూర్తిగా కొత్త ముఖాలతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జగన్ మోహన రెడ్డి ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నారు? పదవుల నుంచి అర్థంతరంగా వైదొలగుతున్న మంత్రుల్లో అసంతృప్తి రాజుకుని అది పార్టీలో తిరుగుబాటుకు, చీలికకు దారితీస్తుందా? పదవులు కోల్పోయిన వారు ప్రజాక్షేత్రంలోకెళ్లి చిత్త శుద్ధితో పార్టీ బలోపేతానికి కృషి చేయగలరా? కొత్తగా మంత్రులు కాబోతున్న వారు తమ శాఖలపై పట్టు సాధించి సమర్థవంతంగా ఆయా శాఖలకు సారధ్యం వహించి జగన్ మోహన రెడ్డికి మంచి పేరు తెస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ సందర్భంలో తలెత్తక మానవు.
కర్త కర్మ క్రియ అన్నీ జగనే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కర్త, కర్మ క్రియ అన్నీ జగన్ మోహన్ రెడ్డే. ఆ మాటకొస్తే దేశమంతటా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పాలన కంటె ఏకవ్యక్తి ఛత్రాధిపత్యమే కొనసాగుతోంది. అధినాయకుడు ఆడిందే ఆట, పాడిందే పాట. అతడికి ఎదురునిలిచి సలహాలు చెప్పే సాహసం కూడా ఎక్కడా ఎవరూ చేయడం లేదు. తెలంగాణలో అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన ఈటల రాజేందర్ ఎదుర్కొన్న అనుభవాలేమిటో అందరికీ తెలిసినవే. తన నియోజకవర్గంలో తిరుగులేని పట్టు, ప్రజాభిమానం ఉన్నందున అధికార టిఆర్ఎస్‌ను తట్టుకు నిలబడి ఉప ఎన్నికల్లో గెలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఒకప్పుడు ముఖ్యమంత్రి తర్వాత కీలకస్థానం హోమ్ మంత్రిది. ఇప్పుడు మంత్రుల్లో ముఖ్యులనే మాట అనుకోవడమే అనవసరం. అధినేత కనుసన్నల్లో మెలుగుతూ మంత్రి పదవిని కాపాడుకోగలిగితే జన్మ చరితార్థమవుతుందనుకునే వారే ఎక్కువ మంది. కనుక, జగన్ మోహన రెడ్డి నిర్ణయాలను ప్రశ్నించి నిలిచే సాహసం ఆయన మంత్రివర్గ సభ్యులెవరూ చేయకపోవచ్చు. అలా సాహసం చేస్తే రాజకీయంగా నామరూపాల్లేకుండా కొట్టుకుపోతామని వారికి తెలుసు. అధికార పార్టీకి దీటైన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్‌లో మరొకటి కనపడటం లేదు. కనుక ఎన్ని అసంతృప్తులున్నా, అణచుకుని జీహుజూర్ అనటం మినహా ఎవరికీ పెద్దగా మార్గాలు లేవు.
మంత్రివర్గ సభ్యులుగా ఎవరుండాలని నిర్ణయించుకునే విశేష అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. పైగా జగన్ మోహన రెడ్డి వంటి బలమైన నేతపై సూచనమాత్రంగా కూడా మనసులో మాట చెప్పడానికి సాహసించరు.
‘క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మా అధినాయకుడి నిర్ణయమే మాకు శిరోధార్యం. ఆయన ఏ పని అప్పగిస్తే ఆ పని చేయటానికి సిద్ధం’ అనే ప్రకటనలు మాత్రమే రేపు తెరమీదకు వస్తాయి.
మంత్రివర్గాన్ని పూర్తిగా కొత్త ముఖాలతో నింపడం ద్వారా జగన్ మోహన రెడ్డి పొందే ప్రయోజనాలేమిటి?
ప్రభుత్వంలో, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపి జవసత్వాలు కల్పించవచ్చు. ఇప్పటి వరకూ పార్టీకి అంకితమై పనిచేస్తూ అధికారం కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న ఆశావహుల్లో కొందరినైనా సంతృప్తి పరచవచ్చు. పదవులు రానివారికి నామినేటెడ్ పదవుల ఆశ చూపి బుజ్జగించవచ్చు.
మంత్రి పదవులను అనుభవిస్తూ ఏకు మేకవుతున్న వారిని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. కొందరు మంత్రులపై ప్రజల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని కొత్త ముఖాలతో పారదోలవచ్చు.
గుర్రం నిరంతరం దౌడు తీయటానికి దాని ముందు గడ్డిని వేలాడదీస్తారు. ఆ గడ్డిని అందుకోవటానికి గుర్రం నిర్విరామంగా పరుగులు తీస్తూనే ఉంటుంది. మరోరకంగా జగన్ మోహన రెడ్డి కూడా ఇదే పాలసీని అమలు చేస్తున్నారు. ఎవరి పదవులూ శాశ్వతం కాదు, ఎవరూ స్థిరపడకూడదు. ఎవరూ ఒక స్థాయికి మించి ఎదగకూడదు అని చెప్పకనే చెప్పడం, తద్వారా పూర్తి పగ్గాలు బిగించడం లక్ష్యం కావచ్చు.
పదవిలో ఉండి నియోజకవర్గ ప్రజలపై పట్టు సాధించడం వేరు. నిన్నటిదాకా పదవిలో ఉన్నందున ప్రజలకు ఎంతో కొంత పనులు చేసి పెట్టి అభిమానం పొంది ఉంటారు. ఇప్పుడు పదవి ఉండదు. అధికారులెవరూ నిన్నటిలా మాట వినరు. ఒక్కోసారి పార్టీలో తన ప్రత్యర్థికే మంత్రి పదవి కొత్తగా దక్కితే పుండు మీద కారం చల్లిన చందమూ కావచ్చు.
2024 ఎన్నికలు సమీపించే కొద్దీ క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ రావటం సహజం. ఉచిత పథకాలెన్ని అమలు చేసినా వాటి లోటుపాట్లు అసమ్మతికి దారితీస్తాయి. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందంటున్నారు. ద్వితీయార్థ పాలనలో కూడా అదే స్థాయిలో పథకాలను అమలు జరపగలరా?
ఈ వ్యతిరేక పవనాల ధాటిని కొత్త మంత్రులు తట్టుకు నిలబడి ప్రభుత్వానికి మంచి పేరు తేగలరా? పదవులు కోల్పోయిన అమాత్యులు పార్టీ బలోపేతానికి ఏ మేరకు పాటుపడగలరు? అసలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్ ఇస్తారా? ఇవ్వరా?
మంత్రివర్గం వరకే ఈ ప్రక్షాళనను పరిమితం చే స్తారా? నామినేటెడ్ పదవులకూ విస్తరిస్తారా?
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.