ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొణిజేటి రోశయ్య సుమారు 14 నెలలకు పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వర్తమాన తెలుగు రాజకీయాల్లో తిరుగులేని రాజనీతిజ్ఞత ఉన్న కొణిజేటి రోశయ్య- కేవలం బడ్జెట్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు.. దార్శనికుడు కూడా! ఆయన పదహారు సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా కూడా తన సమర్థతను నిరూపించుకున్నారు.
రోశయ్య ముఖ్యమంత్రి అయిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే కర్నూలులో అది వరకు ఎన్నడూ ఎరగనంత వరదలు వచ్చాయి. వరద పరిస్థితులను ఎదుర్కోవడంలో, సహాయక చర్యల్లో ముఖ్యమంత్రిగా రోశయ్య సమర్ధతకు చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఏకంగా రాష్ట్ర సెక్రటేరియట్లోనే రాత్రిళ్లు కూడా బస చేసి, వరద సహాయక చర్యలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే అదే సమయంలో జరిగిన ఒక సంఘటన ముఖ్యమంత్రి పదవి మీద ఆయనకు ఉన్న వైరాగ్యాన్ని, ఆ పదవిలో ఆయన అనుభవించిన ఒత్తిడిని తెలియ చెబుతుంది.
కర్నూలు వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం సభా ప్రాంగణం వద్ద ఓ సంఘటన జరిగింది. మొత్తం బురదమయంగా మారిన నేలపై కార్పెట్ పరిచి దానిమీద కుర్చీలు వేసి కార్యక్రమం నిర్వహించారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత కార్పెట్ తీస్తుండగా సరిగ్గా రోశయ్య కూర్చున్న ప్రాంతంలోనే రెండు పాములు కనిపించాయి. పోలీసులు వాటిని బురద పాములుగా తేల్చి దూరంగా పారేశారు. ఈ సంఘటన వల్ల ముఖ్యమంత్రి కార్యక్రమం అయినా అప్పట్లో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెబుతోందనే విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో లో ప్రొద్దుటూరులో జరిగిన మరో సంఘటనలో ఆయనలోని వైరాగ్యం బయటపడింది. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు సత్కారం జరిగింది.
ప్రొద్దుటూరులోని ఆర్యవైశ్య సంఘ ప్రముఖులందరూ కూడా ఆయనను పెద్దఎత్తున సత్కరించారు. మీడియాను కూడా అనుమతించని ప్రెవేటు కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో రోశయ్య మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి.
‘కోమటోళ్లలోంచినేనొక్కడినే ముఖ్యమంత్రిని అయ్యాను. నాకంటే ముందు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. నా తర్వాత కూడా మరొకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి మీరెవరు కూడా రాజకీయాల్లో ఉంటే పెద్ద పదవులకోసం పట్టు పట్టకండి. ఎప్పుడు వస్తే అప్పుడు దానిని దొరకబుచ్చుకోండి. ఫలానా పదవులే కావాలనే మొండి పట్టుదల వద్దు నష్టపోతారు’ అని తన సామాజిక వర్గానికి చెందిన వారిని హెచ్చరించారు.
కోమటోళ్ళలో ఈ స్థాయి వరకు ఎవరూ రారు. ఇప్పుడు కూడా నేను ఈ పదవిలో ఎంత కాలం ఉంటానో తెలియదు. వీళ్ళు నన్ను ఎంత కాలం ఉండనిస్తారో తెలియదు.. నన్ను లాగి పడేయాలని చూస్తునారు..’ అంటూ అప్పట్లో పార్టీ రాజకీయాల్లో ప్రబలంగా ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.
రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిలోకి ఆయన వచ్చారే గానీ.. తొలినుంచి ఆ పదవి మీద ఆయనలో అభద్రత ఉన్నట్లే కనిపిస్తోంది. రోశయ్య చేపట్టిన అనేక పదవులలాగానే.. ఇది కూడా ఆయన అడగకుండానే వచ్చిన అవకాశం. అయితే.. ‘ఎవరు ఎప్పుడు లాగిపడేస్తారో తెలియదు’ అని వైరాగ్యం నిండిన మాటలు కూడా సీఎం అయ్యాక తొలి నెలల వ్యవధిలో ఆయన అన్న మాటలే. అప్పటికే ఆయన పదవికి ఎసరు పెట్టడం ప్రారంభం అయిందన్నమాట. అయితే.. అదే అభద్రత, ఒత్తిడిలోనే ఆయన మరో సంవత్సరం పాటు ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించారు. ఎంత స్వేచ్ఛగా విధులు నిర్వర్తించి ఉంటారో ఊహించుకోవచ్చు.
.