మంచివాళ్ల ప్రపంచంలో కేవలం మంచివాళ్లు మాత్రమే ఉండరు. ప్రపంచం అన్నాక అన్ని రకాల వ్యక్తులూ ఉంటారు. మనం ఎవరితో మెలగుతూ ఉంటామో వారి ప్రభావం మనమీద పడకుండా ఎలా ఉంటుంది? ఆరునెలలు గడిస్తే వారు వీరవుతారు.. అన్న సామెత చందంగా తయారవుతుంది పరిస్థితి.
ఇలాంటి స్నేహప్రభావాల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిత్వం, లక్షణాలు.. మీరు ఏ పేరైనా పెట్టండి. మీకు సహజమైన, మీలో సహజాతంగా ఉండే దానిని మీరు కాపాడుకోవాలి. ఇతరుల ప్రభావం వలన మరో మార్గం తొక్కకుండా.. మీ సహజత్వాన్ని పరిరక్షించుకోవాలి.
ఇందుకోసం మనం ఓ సుభాషితం గమనిద్దాం. అది చెబుతున్న నీతిని.. అచ్చంగా ఆచరించడం కంటె.. కాస్త భిన్నంగా ఆచరిస్తే ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది.
మూలం భుజంగైః శిఖరం విహంగైః
శాఖాం ప్లవంగైః కుసుమాని భృంగైః
ఆశ్చర్యమేతత్ ఖలు చందనస్య
పరోపకారాయ సతాం విభూతయః
ఇదంతా ఓ చందన వృక్షం గురించి చెబుతున్నాడు. చందనవృక్షం యొక్క వేర్లు విషనాగులకు నిలయాలుగా మారి ఉంటాయి. చెట్టు పై భాగంలో పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. కొమ్మల మీద కోతులు ఆడుకుంటూ ఉంటాయి. పువ్వుల మీద తేనెటీగలు వాలుతుంటాయి. ఈ చందనవృక్షం వీటన్నింటికీ సమానంగానే ఉపయోగపడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అట్లే సజ్జనులు పరోపకారమే లక్ష్యంగా అన్ని రకాల వారికి ఉపయోగపడుతుంటారు. -అనేది శ్లోకభావం.
పరోపకారులైన మంచివాళ్లు అందరికీ ఉపయోగపడాలి అని ఈ శ్లోకం చెబుతుంది. కానీ.. ఈ శ్లోకం నుంచి మరో అర్థం స్వీకరిస్తే బాగుంటుంది.
నిత్య వ్యవహారంలో మనం ఎంతో మంది మనుషులతో కలుస్తూ ఉంటాం. ఎన్నో రకాల వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ ఉంటాం. చందనవృక్షం అటు పాములతోను, ఇటు పక్షులతోను, కోతులతో, తేనెటీగలతో అన్నిటితోనూ స్నేహం చేస్తూనే ఉంటుంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే.. ఇన్ని రకాల జీవుల్లోని ఏ ఒక్క లక్షణం కూడా చందన వృక్షానికి అంటుకోదు.
పాములు వేర్లను వాటేసుకుని ఉన్నాయి గనుక.. చందనవృక్షం విషపూరితం కాబోదు! అలాగే కోతులు కొమ్మలపై ఆడుకుంటున్నాయి గనుక.. అది అల్లరి వృక్షం కూడా కాబోదు! దాని సహజమైన గాంభీర్యాన్ని, నిలకడను అది కాపాడుకుంటూ ఉంటుంది.
సుభాషిత కారుడు చెబుతున్న సంగతిని మానవ జీవితంలో ఆచరించడం కష్టం. చెడ్డవాళ్లకు, దుర్మార్గులకు, మోసగాళ్లకు, మంచివాళ్లకు అందరికీ సమానంగా మనం ఉపయోగపడడం అనేది విజ్ఞత కాదు. సాధ్యం కూడా కాదు. మంచితనం అనేది పిచ్చి స్థాయిలో ఉంటే తప్ప.. అలాంటి పనులు మనం చేయలేం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అలాగని మన నిత్యజీవితంలో దుష్టులతో మెలగకుండా, వారి ఛాయలకు కూడా వెళ్లకుండా గిరిగీసుకుని బతకడం కూడా కష్టం. అనేక పనుల మీద అనేక తరహా వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం తప్పనిసరి.
అయితే మనం చేయవలసింది ఏమిటి? మనం ఎంతటి దుర్మార్గులతో అయినా మెలగుతుండవచ్చు గాక.. అవసరార్థం ఎంతటి మోసగాళ్లతోనైనా తిరుగుతుండవచ్చు గాక.. కానీ ఆ మోసపూరిత లక్షణం, ఆ దుర్మార్గపు వైఖరి మనం అలవాటు చేసుకోకుండా ఉండాలి. పాము, కోతి తనతో ఉన్నంత మాత్రాన చందనవృక్షం ఎలా పాడైపోకుండా ఉంటుందో.. అలాగే మనం సన్మార్గులం, మంచివాళ్లం అయితే గనుక.. ఎంతటి దుర్మార్గులతో తిరిగినా ఆ లక్షణాలు మనకు అలవడకుండా చూసుకోవాలి. అదే మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
శుభోదయం.
Discussion about this post