చింతలను మనం కొనితెచ్చుకుంటాం. చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటాం. ఆ సమయానికి అది చిన్నదిగానే కనిపిస్తుంది. తర్వాత చింతగా, ఆందోళనగా, ప్రమాదంగా మారుతుంది. అది ఇక రాత్రీ పగలూ తేడా లేకుండా మనల్ని వెన్నాడుతుంది. దాని ఉచ్చులోంచి బయటపడడం చాలా కష్టం.
నియంత్రణలో లేకుండా చేసే ఏ వ్యవహారం కూడా మనల్ని కుదురుగా ఉండనివ్వదు. మాటలు అయినా చేతలు అయినా.. మన అదుపులో ఉండాలి. అదుపు దాటిపోయినప్పుడు ఆ ప్రభావం మన నిత్యజీవితం మీదనే పడుతుంది. తిన్నది అరగకపోవడమూ.. పడుకుంటే నిద్ర రాకపోవడమూ జరుగుతుంది.
సుఖ నిద్ర ప్రాప్తించాలంటే.. అందుకు నాలుగు మార్గాలున్నాయని చరకుడు చెబుతాడు.
సుఖం శేతే సత్యవక్తా సుఖం శేతే మితవ్యయీ
హితభుక్ మితభుక్ చైవ తథైవ విజితేంద్రియ
ఎవ్వడైతే నిజం చెప్తాడో, ఎవ్వడైతే మితంగా ఖర్చు చేస్తాడో, ఎవ్వడైతే ఆరోగ్యకరమైన భోజనాన్ని మితంగా తింటాడో, ఎవడైతే ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకుంటాడో ఈ నలుగురికీ నిద్ర చక్కగా పడుతుంది. -అనేది చరకుడు చెప్పిన ఈ శ్లోకానికి భావం.
సుఖనిద్ర అందరికీ సాధ్యమైన వ్యవహారం కాదు. చాలా మంది నిద్ర పట్టట్లేదు అంటారు. అదొక ఆరోగ్య సమస్యగా పరిగణిస్తుంటారు. దానికి డాక్టర్ల చుట్టూ తిరిగేవాళ్లు, అందుకోసం మళ్లీ డబ్బు తగలేసేవాళ్లు కూడా మనకు నిత్యం కనిపిస్తూ ఉంటారు.
కానీ.. నిత్య వ్యవహారంలో.. శరీరాన్ని బాధించే ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలూ కూడా లేకపోయినా సరే.. ఎవరికైనా నిద్ర పట్టడం లేదంటే ఆలోచించాల్సిందే. చరకుడు చెప్పిన ఈ నాలుగు సూత్రాల్లో ఏదో ఒకటి వారు అదుపు తప్పుతూ ఉంటారు.
ఈ సుభాషితాన్ని గమనిస్తే నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం ఆందోళన తప్ప మరొకటి కాదు అనిపిస్తుంది. ఇందులో చెప్పిన నాలుగు సూత్రాలు ఏదో రకంగా ఆందోళన కలిగించేవే.
నిజం చెప్పేవాడికి చింత ఉండదు. అబద్ధం చెప్పినప్పుడు. అందరూ దానిని నమ్మినా సరే.. తను చెప్పింది అబద్ధంసంగతి చెప్పినవాడికి తెలిసే ఉంటుంది. ఆ అపరాధభావం అతడిని వెన్నాడుతుంది. అది లోలోపల మెలిపెడుతుంటుంది. అది నిద్రపోనివ్వదు. అదుపు తప్పి ఖర్చు చేసి వాడి పరిస్థితి కూడా అంతే. అప్పు తెచ్చి అయినా అమితంగా ఖర్చు చేసేవాడు.. ఆ భయంలోనే ఉంటాడు. సంపద ఉన్నా కూడా దాన్ని హధ్దులేకుండా ఖర్చు చేసేవాడికి- ఆ సంపద కళ్ల ముందే కరిగిపోతోందనే భయం ఆవరిస్తుంది ఈ రెండు రకాల భయాలూ నిద్రను దూరం చేస్తాయి. తిండి సంగతి సరేసరి.
సుభాషిత కారుడు చెప్పినట్టు ఆరోగ్యకర ఆహారాన్ని అది కూడా మితంగానే తినాలి. ఏది పడితే అది తిన్నా సమస్యే.. ఎంత పడితే అంత తినేసినా సమస్యే. నిద్రను దూరం చేస్తాయి. అన్నిటినీ మించి ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను కోరికలను అదుపులో ఉంచుకోలేనప్పుడు అవి నిరంతరంగా దహించి వేస్తుంటే ఇక నిద్రెలా పడుతుంది. పై మూడూ ప్రయత్నం మీద సాధించగలం గానీ.. ఇంద్రియాలను జయించడం అంత సులువా? జయించలేకపోవచ్చు గాక.. కనీసం నియంత్రణలో కూడా ఉంచుకోకపోతే మాత్రం నిద్ర కష్టమే.
ఈనాలుగు పనుల వలన నిద్ర పట్టదు సరే. మౌలికంగా మనం ఒక సంగతి గమనించాలి. నిద్ర అంటేనే సుఖం. అంటే ఈ నాలుగు పనులు చేసే వాళ్లు నిద్రకే కాదు, సుఖానికే దూరమవుతారు అనేది అంతరార్థంగా గ్రహించాలి. సుఖం అంటే విచ్చలవిడిగా ఉండడం మాత్రమే కాదు. చీకూ చింతా లేకుండా నిద్ర పట్టే పరిస్థితి ఉండడం. ఆ కోణాల్లో జీవితాన్ని బేరీజు వేసుకోవడం బాగుంటుంది.
శుభోదయం.
.
Discussion about this post