చాలా సందర్భాల్లో మనకు ఒక పెద్ద ధర్మ సంకటం ఎదురవుతుంటుంది. మన మిత్రులు, అయినవాళ్లతో అసహనానికి గురవుతూ ఉంటాం. వారిలో ఉండే లోపాలు మనల్ని చికాకు పెడుతుంటాయి. వారితో అనుబంధాన్ని కొనసాగించే బదులు.. వదిలిపెట్టడం సుఖం అనే భావన కలుగుతుంది. ఇది సరైనదేనా?
మామూలుగానే స్నేహానికి, అనుబంధానికి సంబంధించి పాటించి తీరాల్సిన ఒక నియమం ఉంది. ‘మన’ అనుకున్న వారిలో ఉండే లోపాలను కూడా సహించగలిగినప్పుడు మాత్రమే.. ఆ బంధం నిలబడుతుంది. అన్నీ అద్భుతమైన లక్షణాలు ఉన్న వారితో మాత్రమే స్నేహం చేసి, చిన్న చిన్న లోపాలు ఉన్న వారిని.. విడిచిపెట్టేసేట్లయితే.. అది స్వార్థం, అవకాశ వాదం అనిపించుకుంటుంది గానీ.. స్నేహం, అనుబంధం ఎలా అవుతుంది?
ఇదే విషయాన్ని ఒక సుభాషితం మనకు ఇంతకంటె చక్కగా వివరిస్తుంది.
గుణవాన్ వా పరజనః స్వజనో నిర్గుణోపి వా
నిర్గుణః స్వజనః శ్రేయాన్ యః పరః పర ఏవ చ
బయటివాడు సద్గుణ సంపన్నుడు అయి ఉండొచ్చు. స్నేహితుడిలో, సొంతవారిలో కొన్ని దుర్లక్షణాలు ఉండొచ్చు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే.. దుర్లక్షణాలు ఉన్నా సరే.. స్నేహితుడినే ఎంచుకోవాలి. ఎందుకంటే.. బయటివాడు- ఎప్పటికీ బయటివాడే! ..అనేది శ్లోకభావం.
ఇద్దరి మధ్య తూకం వేసి.. ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన సందర్భాలు మనకు అనేకం ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే అవకాశవాదం పెద్ద పాత్ర పోషిస్తుంటుంది. అవకాశవాదం, స్వార్థం మన నిర్ణయాలను ప్రభావితం చేసే అలాంటి కీలక సందర్భాల్లోనే మనం మరింత సంయమనంతో వివేచనతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఒక ఉదాహరణ గమనిద్దాం. ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతడు మరీ గొప్ప అందగాడు కాదు. చిరుకోపం. గొప్ప తెలివైన వాడు కాదు. అయినా సరే, గాఢంగా ఇష్టపడుతుంది. జీవితం పంచుకోవాలని అనుకుంటుంది. ఆ అమ్మాయికి మరొక అబ్బాయితో పెళ్లి సంబంధం వస్తుంది. అతడు అందగాడు, సంపన్నుడు, తెలివైన వాడు, నెమ్మదితనం ఎక్కువ… ఇలా సకల లక్షణ సంపన్నుడు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి? (మొదటి వాడు మరీ భరించలేనంత దుర్మార్గుడు అయితే చెప్పలేం. నిజానికి అలాంటివాడితో ప్రేమే కుదరదు కదా!)
ఆ అమ్మాయి సహజంగా తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటుంది. ప్రేమ గుడ్డిది, బుద్ధి లేనది.. అని మనం బయటి వ్యక్తులుగా దెప్పిపొడుస్తాం. మంచి కుర్రాడిని వదులుకుందని హేళన చేస్తాం. కానీ ఆ అమ్మాయి ఎంపికే సరైనది. రెండో వాడిలో సర్వలక్షణాలూ ఉన్నాయి.. కానీ మొదటివాడిపై ప్రేమ ఉంది. ప్రేమకు ఉన్న బలం, స్వచ్ఛత అది!
ఇదే సిద్ధాంతం స్నేహానికి, మరే ఇతర అనుబంధానికైనా అనువర్తించుకోవచ్చు. ఒక బంధం నిలబడాలంటే.. అవతలివారిలోని చిన్న లోపాలను కూడా మనం ఆమోదించగలగాలి. సహించగలగాలి. స్నేహితులు, బయటి వారి మధ్య ఒకరినే ఎంచుకోవాల్సి వస్తే.. స్నేహితులనే ఎంచుకోవాలి.
ఒకటి రెండు దుర్గుణాలు ఉండవచ్చు గాక.. కానీ స్నేహితుడు ఎప్పటికీ హితుడే. మన మేలుకోరే వాడే. బయటి వారిని ఎంచుకోవడం కంటె.. మన మేలు కోరేవారిని వెంట ఉంచుకోవడం ఎప్పటికీ మంచిదే కదా.
శుభోదయం.
.

Discussion about this post