ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. వరద బాధిత ప్రాంతాలను పరిశీలిచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. ఈ రెండు రోజుల్లో ఆయన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనలో భాగంగా.. ‘సీఎం సెల్ఫీముచ్చట’ ఇప్పుడు తాజా వివాదానికి కేంద్రబిందువు!
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. తన తొలిరోజు పర్యటనలో క్షణం తీరిక లేకుండా తిరిగారు. కడప జిల్లాలోనూ చిత్తూరు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రతి చోటా బాధిత ప్రజలు, రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న బ్రిడ్జి తదితర ప్రాంతాలను పరిశీలించారు. అన్ని రకాలుగా నష్టపోయిన పేదలకు తానున్నాననే భరోసా ఇచ్చారు.
పర్యటనలో ఈ వ్యవహారాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ.. సీఎం జగన్మోహన రెడ్డి సెల్ఫీ ముచ్చట మాత్రం ఇప్పుడు వివాదంగా మారుతోంది.
విషయం ఏంటంటే.. వరద ప్రాంతాల పర్యటనలో తిరుగుతూ ఉండగా.. సీఎం జగన్ వాహనంలో ఉన్నప్పుడు.. తన వెంట ఉన్న సహచరులతో కలిసి ఓ సెల్ఫీ దిగారు. ఆ వాహనంలో సీఎం జగన్ తో పాటు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎం కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనంజయరెడ్డి ఉన్నారు. సీఎం జగన్ స్వయంగా సెల్ఫీ తీస్తూ ఉండడంతో.. వారంతా కెమెరాకేసి చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తున్నారు.
సీఎం తీసిన ఈ సెల్ఫీ ఫోటో మీడియాకు లీక్ అయింది.
ఈ ఫోటో చూసిన వారంతా భగ్గుమంటున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి విహార యాత్రకు వచ్చారా? వరద బాధిత ప్రాంతాలు చూడడానికి వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన తీరు ప్రజల కన్నీళ్లు తుడవడానికి వచ్చినట్టుగా లేదని.. ఏదో ఎంజాయ్ చేయడానికి ఒక టూర్ వచ్చినట్టుగా ఉన్నదని విమర్శలు వస్తున్నాయి. సెల్ఫీలు సాధారణంగా సరదాగా మిత్రులతో కలిసి తీసుకుంటారు. నిజానికి సీఎం జగన్ తీసుకుంటున్న సెల్ఫీ కూడా అలాంటిదే. అందుకే ఫోటోలోని వారందరూ కూడా చిరునవ్వులు చిందిస్తున్నారు.
ఒకవైపు గ్రామాలకు గ్రామాలే.. జలమయమై.. లక్షలాది మంది ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయిన సమయంలో.. జగన్ ప్రజల మధ్య తిరిగినంత సేపు వారిని ఊరడించి.. తిరిగి వాహనం ఎక్కగానే ఇలా సెల్ఫీ ఎలా తీసుకోగలుగుతున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది.
కావడానికి అది ఒక చిన్న సెల్ఫీనే కావచ్చు. అది సీఎం జగన్ ముచ్చట గనుక.. ఆ పార్టీ వారందరికీ కూడా ముచ్చట గానే కనిపించవచ్చు. కానీ.. సందర్భ శుద్ధి లేకుండా.. ప్రజల కన్నీళ్లు, వ్యథలు చూడడానికి వెళ్లి సెల్ఫీ దిగడమే పెద్ద వివాదంగా మారుతోంది.
.