మూడు నిమిషాల ఆ వీడియో చూసిన ప్రతిసారీ గుండెల్లో నుంచి బాధ తన్నుకొస్తోంది. కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
కథకుడు శిరంశెట్టి కాంతారావు వాట్సాప్‌లో ఆ వీడియో పంపించాడు. అందులోని విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే-
తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా వందవాసి సర్కిల్ ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబం అది. తండ్రి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తల్లి కాయకష్టం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ దంపతులకు 7వ తరగతి చదివే కూతురు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లాలంటే ఏ రిక్షానో ఆటోనో భరించే స్తోమత లేదు. ప్రతిరోజూ రానుపోను ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లివస్తూ చదువుకుంటోంది. ఆ బాలిక కష్టాన్ని ఎవరో ఒకాయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆటు తిరిగి ఇటు తిరిగి ఆ రాష్ట్ర మంత్రి దాకా చేరింది.
ఆ మంత్రి సానుకూలంగా స్పందించి కొత్త సైకిల్ కొని ఆ బాలిక ఇంటికి వచ్చి బహుమతిగా అందచేశాడు. దాంతోటే ఓ స్వీటు బాక్సూ పట్టుకొచ్చి స్వయంగా తినిపించాడు.
సైకిల్‌ను అందుకున్న ఆ బాలిక ఆనందాన్ని ప్రకటించింది. ఇంతకాలం పడిన ప్రయాసను గుర్తుకు తెచ్చుకుంది. నిన్నటి బాధ, నేటి ఆనందం, రేపటి వెసులుబాటు- ముప్పేటగా కలిసి కన్నీళ్లతోనే ఆనందాన్ని వ్యక్తం చేసింది. మంత్రికీ కృతజ్ఞతలు చెప్పింది.
ఆ అమ్మాయికి మంత్రి గారెవరో సైకిల్ కానుకగా ఇస్తే ఆ చిన్నారితోపాటు నాకూ గుండెల్లోనుంచి ఎందుకు దుఃఖం పొంగుకొస్తోంది.
బహుశ నాకు తెలీకుండానే నేను నా బాల్యం లోకి వెళ్లి ఉంటాను. నేనూ మూడు కిలోమీటర్ల దూరంలోని స్కూలుకి బస్సులోనో కుదరకుంటే నడిచో వెళ్లి వచ్చేవాణ్ని. ఆ తర్వాత వంద రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ సైకిల్ ను నాన్న కొనిచ్చాడు. సైకిల్ ఇంటికి వచ్చిన ఆరోజు రాత్రి నిద్ర కరువైంది.
ఆ పాపను చూస్తుంటే ఆ వయసులో ఉన్నప్పటి నా కూతురు గుర్తొచ్చి ఉంటుంది. నా కూతురుకే ఆ కష్టం వచ్చిందన్న భావనా చుట్టుముట్టి ఉంటుంది.
అంత లేత పాదాలు ప్రయాసపడి ఎంత వేదనను, బాధను అనుభవించాయో గదా!
చిట్టితల్లీ! నాకు తెలిసినా ఏదోరకంగా నీకు సైకిల్ కొనిపెట్టి ఆ కష్టం తీర్చేవాణ్ని గదా!
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ మహానుభావుడికి గుండెల్లో ఎక్కడో తడి ఉండి ఉంటుంది. ఆ వీడియోను చూసి తక్షణం స్పందించిన ఆ మంత్రి గారికీ మనసులో ఎక్కడో కలుక్కుమని ఉంటుంది.
ఈ యాంత్రిక యుగంలో మనసులు మొద్దుబారిపోతున్నాయి. పక్కవాడు ఏమైపోతేనేం, నా వరకు నేను బావుంటే చాలునన్న స్వార్థం ఊడల మర్రిలా పాతుకు పోతోంది.
ఇలాంటి పరిస్థితిలో ఎదుటివారి బాధను మన బాధగా బందీ చేయడం ఈ కాలపు అపురూప ఘట్టాల్లో ఒకటే గదా!
పక్షి శోకాన్ని తన గుండెల్లో నింపుకుని శ్లోకంగా మలుచుకుని మహత్తర కావ్యాన్ని అందించాడు వాల్మీకి. ప్రపంచం బాధనే తన బాధగా తలకెత్తుకుని మహా ప్రస్థానంతో రెండు మూడు తరాల యువతను ఉర్రూతలూగించి సరికొత్త ఆలోచనామార్గాలు పరిచాడు శ్రీరంగం శ్రీనివాసరావు.
‘ఎదుటివారి కష్టాల్లో తోడు నిలవని వారికి, వారి ఆనందాల్లో పాలు పంచుకునే అర్హత లేదు’ ఎవరో ఎక్కడో రాశారు.
ఎదుటివారి కష్టంలోకి తొంగిచూసి వారి బాధను మన బాధ చేసుకుని వెన్నుతట్టి నిలవడానికి మించిన మహత్తర కార్యం మరేదైనా ఉంటుందా?
గుండెల్లో తడిని ఆరనీకండి.
కళ్లనూ పొడిబారనీకండి.
కొసమెరుపు
‘‘మన పనమ్మాయి మంజుల కూతురుకు జ్వరంగా ఉంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. పాపం ఆ పసిది నడవలేకపోయిందట నాలుగడుగులకోసారి ఫుట్ పాత్‌పై కూలబడిందట’’ అమెరికాలోని నా కూతురు శిల్పతో చెప్తోంది వాళ్లమ్మ.
‘‘అదేమిటి? అంత చిన్న పిల్లనూ పైగా ఒంట్లో నలతగా ఉంది, అలా నడిపించి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లటమేమిటి? ఆటోలో తీసుకెళ్లచ్చుగా’’ నా కూతురు ఫైర్ అవుతోంది.
‘‘నిజమే. కానీ ఆటోలో రాను పోను వంద రూపాయలు అవుతుంది. డాక్టరుకు ఫీజివ్వాలి. మందులు కొనాలి. అంత డబ్బు చేతిలో లేదేమో?’’
మర్నాడు నా కూతురు ఫోను-
‘‘ఆరు వేల రూపాయలు ఎకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశాను. పనమ్మాయి మంజులకిచ్చి ఇంకెప్పుడూ ఆ పసిదాన్ని నడిపించవద్దని చెప్పండి.’’
నా కూతురు కూడా ఎక్కడో కనెక్ట్ అయింది.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.