శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనం పైనా… జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనం పైనా పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.
ఆలయం వెలుపల నుంచి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, పండరి భజనలు, శక్తి అమ్మవార్ల వేష ధారణలతో భక్త బృందాలు వాహన సేవల ముందు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మొదట అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేషంగా అలంకరణ చేశారు. ఆలయ పురోహితులు పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పురవిహారానికి తీసుకువచ్చారు. వినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. పురవీధుల్లో ఊరేగుతున్న పంచమూర్తులను పలువురు భక్తులు దర్శించుకున్నారు.
కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
.