వల్లూరు ఘటనపై జనసేన పోరుకు సిద్దమైంది. న్యాయం పోరాటం చేస్తాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. నాదెండ్ల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే… జనసేనాని రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే ప్రభుత్వం తలవంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వల్లూరులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీనాకుమారి అనే మహిళా సర్పంచ్ పై శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అనుచరులు ఇటీవల అనుచితంగా వ్యవహరించారు.
ఈ ఘటనపై మీనాకుమారి రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీనాకుమారికి అండగా మండపేట మండలానికి చెందిన జనసేన నేతలు అండగా నిలిచారు.
అండగా నిలవడమే వారి తప్పయింది. సర్పంచ్ మీనాకుమారికి అండగా నిలిచిన జనసేన నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో వారు ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. మీనా కుమారి ఫిర్యాదు చేసినా… పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ‘‘సర్పంచ్ ప్రోటోకాల్ ను కాదన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు? సర్పంచ్ కు అండగా నిలిచిన జనసేన నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. రామచంద్రాపురం డీయస్పీ కేసును పక్కదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగాయి. వీటిపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వల్లూరు సంఘటనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి… న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం’’ అని మనోహర్ ప్రకటించారు.
నాదెండ్ల మనోహర్ మాటలకు మండపేట పోలీసులు స్పందించక పోతే జనసేనాని తప్పకుండా రంగంలోకి దిగుతారు. తమ పార్టీ కార్యకర్తలకు, దళిత సర్పంచ్ మీనాకుమారికి న్యాయం జరిగే వరకు పవన్ వదలరు. ఒకవేళ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే అది తప్పకుండా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది.
మీనాకుమారి దళిత కులానికి చెందినందున … ఆ సామాజిక వర్గం కూడా ఈ పోరాటంలో జనసేనానికి అండగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సామాజిక సమస్య అయినందున ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంతో పాటు… జనసేన మిత్రపక్షమైన బీజేపీ కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. దళిత సమస్య అయినందున వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయి. ఇవన్నీ జరగక మునుపే ప్రభుత్వం మేల్కొంటే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో వెలువడుతోంది. వల్లూరు ఘటనపై ప్రభుత్వం ఏం చేస్తుందో వేచిచూద్దాం.
.