ప్రతిరోజూ ఉదయం 45 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐటిబిపి యోగా శిక్షకులు వెల్లడించారు. భారత ప్రభుత్వ హోం శాఖ పరిధిలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐటిబిపి ఇన్స్పెక్టర్ వైవి.రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కలికిరి వద్ద గల ఐటిబిపి 53వ బెటాలియన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు “అందరికీ యోగా” కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. నిత్యజీవితంలో యోగా సాధన చేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందాలని కోరారు. శిక్షకులు పలు యోగాసనాలు చేసి చూపారని, వీటిని చుట్టుపక్కల వారికి కూడా నేర్పించి ఆరోగ్యాన్ని పొందాలని కోరారు.
ముందుగా ఐటిబిపికి చెందిన యోగా శిక్షకులు యోగాసనాలు చేయించారు. ఐటిబిపి సిబ్బందితోపాటు టిటిడి ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొని ఆసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో ఐటిబిపి 53వ బెటాలియన్ కమాండెంట్ అమిత్ భాటి, డెప్యూటీ కమాండెంట్ ఆయుష్ దీపక్, టిటిడి ఏపిఆర్వో పి.నీలిమ, ఇన్స్పెక్టర్ వైవి.రెడ్డి, యోగా శిక్షకులు దినేష్ జోషి, సూరజ్ సింగ్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post