మూడో ఫ్రంట్. భాజపాయేతర, కాంగ్రేసేతర ఫ్రంట్. ఈ పదాన్ని కేంద్రలోని అధికార పార్టీ భాజపాను ఢీకొట్టే అస్త్రంగా వాడుకుంటున్నాయి పలు ప్రాంతీయ పార్టీలు. ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఫ్రంట్ అంటూ ముక్కుమీద లేచి పక్క రాష్ట్రాలకు చుట్టపు చూసి వచ్చినట్టైంది. అయితే మమతా బెనర్జీతో కలిసి మోడీని ఢీకొడతాం అని కలకత్తా వెళ్లి వచ్చారు సీఎం కేసీఆర్. కానీ అదే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ స్థానాలకు కోల్పోయింది తెరాస పార్టీ.
ఆ తరువాత ఆ ఊసెత్తని సీఎం, మళ్లీ ఇప్పుడు పావులు కదుపుతున్నారు. గత కొన్ని రోజులుగా భాజపాతో యుద్ధం అంటూ చెబుతున్న మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎంతగా మోడీ మీద ఒంటికాలిపై లేస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ప్రమాదకరశత్రువుగా పరిగణిస్తున్నా.. ఆ పార్టీతో కేంద్రం స్థాయిలో ఆయన ఒంటరిగా మోడీని ఢీ కొట్టడం కష్టం! అందుకే మూడో ఫ్రంట్ అనే పడికట్టు పదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చి ముందుకు సాగుతున్నారు.
ఈయనతో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన సీఎంలు జత కడితే తప్ప.. పావులు కదపలేని పరిస్థితి. అలాగని కేసీఆర్ దేవుడు కాదు కదా.. ఆయన ఇలా చెబితే అందరూ అలా వినడానికి. ఈయన లాగే వారు కూడా ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులే కదా. వారి రాజకీయ కోణాలు వారికి ఉంటాయి. ఈ నేపథ్యంలో అగ్గికి అజ్యం పోసినట్టు మమతాబెనర్జీ కూడా, కేసీఆర్‌కి తోడయ్యేట్టు కనబడుతోంది.
కానీ ఆమె రాజకీయ కోణం వేరేలా ఉంది. మూడో ఫ్రంట్ కాకుండా తృణమూల్ కాంగ్రెస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోని అసమ్మతి నేతలకు గాలం వేస్తోంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సీఎంలతో పొసగని రాజకీయ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది.
ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు మమతాబెనర్జీ దృష్టి అంతా గోవా ఎన్నికల మీద పడింది. అక్కడ ఎలాగైనా టీఎంసీ పాదం మోపాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఇక్కడ అధికారం చేజిక్కించుకొని తమ సత్తా చాటి కమలానికి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇటీవలి కాలంలో రెండోసారి ఆమె గోవాలో పర్యటిస్తున్నారు. 40 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారం కోసం ఇప్పటికే ఆమె ఎన్నికల్లో పోటీకి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే విపక్షాలు తమతో కలిసి రావాలని ఆమె కోరారు. మోడీపై పోరాటంలో ఏ పార్టీ ముందుకు వచ్చినా స్వాగతిస్తామని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి గోవాని దక్కించుకునేందుకు ఆమె విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు మొదలెట్టారు.
మరోవైపు తెలంగాణ సీఎం కూడా మోడీ ఢీకొట్టి ఢిల్లీ గద్దెపై తన ముద్ర చూపించాలని తహతహలాడుతున్నారు. తమిళనాడులో దేవాలయాల పర్యటన పేరుతో అక్కడి సీఎం స్టాలిన్‌ను కలిశారు. అతను కూడా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌తో సంబంధాలు సరిగా లేవు. మొదట తమిళం, తెలుగు చక్కబెట్టుకున్నాక.. ఉత్తరాది వైపు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారని కేసీఆర్ ఉన్నారని సమాచారం. ఈ మూడు రాష్ట్రాల తర్వాత.. మమతను తమ వైపు తిప్పుకోవాలని పావులు కదుపుతున్నారు.
అయితే ఈ మూడో ఫ్రంట్ ఏకతాటి మీదకు వస్తుందో లేక ముక్కలై పోతుందో చూడాలి మరి.
.. కె.శ్రీనివాస్

.

Discussion about this post