గెలిచి అధికారంలోకి రావాలంటే.. నీ గొప్పతనం నువ్వు చెప్పుకోవాలా? ఎదుటివాడి వెధవతనం గురించి చాటిచెప్పాలా? ఏది మంచి పద్ధతి? మన డప్పు మనం కొట్టుకోవడం కంటె.. ఎదుటివాడి మీద బురద చల్లడమే శ్రేయస్కరం అని భావించే ఆలోచనాధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి?
మామూలుగా అయితే.. మన గొప్పతనం చెప్పుకోవడం, మనం గెలిస్తే ప్రజలకోసం ఏం చేస్తామో చెప్పుకోవడం ప్రధానంగా ప్రచారం ఉండాలి.. అని అనుకుంటాం. కానీ.. నవీన రాజకీయ ప్రపంచంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. మన గొప్ప చెప్పుకోవడం కంటె ముఖ్యంగా తన ప్రత్యర్థి వెధవ అని ప్రచారం చేయడానికే అందరూ ఉత్సాహపడుతున్నారు. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అందరిదీ ఒకే ధోరణి. ఒకటే మాట.. ‘వారికి ఓటు వేయొద్దు’ అనడం మాత్రమే.
ఎన్నికల సమయం వచ్చిన తర్వాత.. అన్ని పార్టీలూ గెలవడం కోసమే పోటీ పడతాయి. మేం గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలా చెప్పుకుంటున్నాయి. కానీ పరిమితంగా మాత్రమే. తాము చేస్తామని చెబుతున్న పనులను ప్రజలు నమ్మి.. వాటి మీద ఆశతో తమను గెలిపిస్తారనే నమ్మకం కంటె.. తమ ప్రత్యర్థికి ఓటు వేసేస్తారేమో అనే భయం పార్టీలను ఎక్కువగా వెన్నాడుతోంది. అందుకే ‘ప్రత్యర్థికి ఓటు వేయద్దు’ అని చెప్పడానికి రకరకాల కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. కొత్త ఆరోపణలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా దయనీయమైన పరిణామం. పార్టీలకు కూడా ఆత్మవిశ్వాసం లేకపోవడానికి ఇది నిదర్శనం.
ఇంతకూ ఎవరేం చెబుతున్నారో చూద్దాం..
భారతీయ జనతా పార్టీ : కాంగ్రెస్ గెలిస్తే మీ ఆస్తులను ముస్లిములకు రాసి ఇచ్చేస్తుంది. మీ తాళిబొట్టులను కూడా లాక్కుని ముస్లిములకు ఇచ్చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు. అయోధ్య రామాలయం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు అన్నీ చెప్పుకుంటున్నారు. వాటన్నింటికంటె ఎక్కువగా కాంగ్రెస్ ముస్లంలకు ఆస్తులిస్తుంది అనేదానిమీదనే ఫోకస్ పెడుతున్నారు.
కాంగ్రెస్ : బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. రిజర్వేషన్లను రద్దు చేసేస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి, ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని తెస్తుంది. కాబట్టి వారికి ఓటు వేయొద్దు.
భారత రాష్ట్ర సమితి : కాంగ్రెస్ గెలిస్తే రైతురుణమాఫీ చేయదు గాక చేయదు. కాబట్టి వారికి ఓటు వేయొద్దు.
తెలుగుదేశం, జనసేన : వైసీపీ గెలిస్తే మీ భూములను వైసీపీ నాయకులకు వారి పేర్ల మీదకు మార్చేసుకుంటారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అబద్ధం.. అది- లాండ్ గ్రాబింగ్ యాక్ట్! కాబట్టి జగన్ కు ఓటు వేయొద్దు.
వైఎస్సార్ కాంగ్రెస్ : చంద్రబాబునాయుడు గెలిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోడు. ఇప్పుడు చేస్తానని చెబుతున్నవన్నీ అబద్ధాలే. జగన్ అమలు చేస్తున్న పథకాలన్నీ రద్దు చేసేస్తాడు. కాబట్టి తెలుగుదేశానికి ఓటు వేయొద్దు.
కేవలం బురద చల్లడం మాత్రమే కాదు. తాము గెలిస్తే ఏం చేస్తామో కూడా వీరు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కాస్త తక్కువ. ‘మేం చేసింది చూసి గెలిపించండి’ అని అడగడంపై ఉన్న ఫోకస్.. ‘గెలిపిస్తే ఇంకా ఫలానా చేస్తాం’ అనేదిశగా వారి ప్రచారం లేదు. తెలుగుదేశం మాత్రం విచ్చలవిడిగా హామీలను జడివానలాగా కురిపించుకుంటూ పోతోంది. ఎన్నెన్ని చేసేస్తాం అంటూ వారు వరాలు కురిపించారో అవన్నీ లెక్క తీయడం కూడా కష్టమే. పరిస్థితి అలా ఉంది. పెన్షన్లు, జీతాలు, పీఆర్సీ, రైతులకు సాయం.. ఇలా అన్ని రకాలుగానూ జగన్ ప్రభుత్వం చేస్తున్నదానికంటె మిన్నగా చేస్తాం అంటూ చంద్రబాబునాయుడు అనేక హామీలు గుప్పించారు. నిజానికి ఈ హామీలను విశ్వాసంలోకి తీసుకుంటే.. కరడుగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రతి ఒక్క ఓటరు కూడా తెలుగుదేశానికి, కూటమికే అండగా నిలబడతారు. కానీ.. ప్రజలు తన హామీలను నమ్ముతారో లేదో అని చంద్రబాబుకే నమ్మకం లేదు. భయం! అందుకే ఇన్ని హామీలను ప్రకటించినా కూడా చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో నెగటివ్ ప్రచారానికే పెద్ద పీట వేస్తున్నారు. వైసీపీ గెలిస్తే మీ భూములను లాక్కుంటారు అని ప్రజలను భయపెట్టడం ఒక్కటే ఆయనకు మెరుగైన మార్గంగా కనిపిస్తున్నట్టుంది.
ఈ ‘నెగటివ్’ ఎలా వచ్చింది?
నాయకుల బుర్రల్లోకి ఈ నెగటివిటీ ఎలా ప్రవేశించింది. చాన్నాళ్లుగా మనం రాజకీయాలను గమనిస్తోంటే.. తాము చేయగలిగేది చెప్పుకోవడం ద్వారా మాత్రమే గెలవాలని అనుకుంటుండేవాళ్లు కదా. ఇప్పుడు దాదాపుగా అందరూ ఒకేతరహా బాటలో ఎదుటివాడికి వేయవద్దు అనే నెగటివ్ బాటలోనే నడుస్తున్నారు ఎందుకు? అనే అనుమానం ప్రజలకు రావడం సహజం. రాజకీయ పార్టీల ప్రచార ధోరణుల్లోకి వారి సొంత బుర్రల కంటె కార్పొరేట్ వ్యూహకర్తలు చొరబడడమే దీనికి ఒక కారణంగా అనుకోవాలి. కార్పొరేట్ వ్యాపార ప్రపంచంలో.. మన ప్రోడక్ట్ ఎంత గొప్పదో చెప్పుకోవడంతో పాటు, తమ వ్యాపార ప్రత్యర్థి ప్రోడక్ట్ ఎంత ప్రమాదకరమైనదో ప్రచారం చేయడం కూడా ఒక ఎత్తుగడ. కాకపోతే అక్కడ న్యాయపరమైన చిక్కులు వస్తాయి గనుక.. అలాంటి నెగటివ్ ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా చాపకింద నీరులా సాగిస్తూ ఉంటారు.
రాజకీయ ప్రచారాల్లో విషం చిమ్మడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు. ఇక్కడ ఎవరికి తోచినట్టుగా వారు విషం కక్కడంలో విశ్వరూపం చూపించవచ్చు. వారి కుయుక్తులు, కుట్రలు అమలులో పెట్టడానికి ఈ ఆధునాతన కార్పొరేట్ వ్యూహకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
నాయకులు, నిజంగా ప్రజలకు మంచి చేయాలని అనుకునే నాయకులు.. ఇలాంటి కార్పొరేట్ వ్యూహకర్తల మాయంలోంచి బయటకు రావాలి. ఇవాళ్టి ఆధునిక ప్రపంచపు పోకడలను, ఆ వేగాన్ని అందుకోవడానికి.. నవతరం వ్యూహకర్తలు అవసరమే కావొచ్చు. వారి సలహాలను ఎంతగా తీసుకున్నప్పటికీ.. అమలులో పెట్టేప్పుడు తమ సొంత విచక్షణను ఉపయోగించాలి. ప్రజలను భయపెట్టడం ద్వారా కంటే వారి నమ్మకాన్ని సంపాదించడం ద్వారా పొందగలిగే ఓటు తమ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఏర్పడుతుందనే వాస్తవాన్ని వారు గ్రహించాలి.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
పాత్రికేయుడు, రచయిత
Discussion about this post