బద్వేలు ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీలో లక్ష మార్కును అందుకోలేకపోయినా విజయం సాధించింది. అయితే ఈ విజయం జగన్మోహన్ రెడ్డి దళం మరీ మురిసిపోయేంత విజయమేమీ కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు కట్టిన పట్టం అని పండగ చేసుకునేంత ఘన విజయం ఇది కాదు. లోతుగా తరచిచూస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పాదుగొంటున్నదనే సంకేతాలు ఈ ఎన్నికలో స్పష్టంగా కనిపించాయి. గ్రౌండ్ రిపోర్ట్ సమాచారం..
వైసీపీ అభ్యర్థి దాసరి సుధ సాధించిన మెజారిటీ 90వేల ఓట్లు అనే సంగతి పక్కన పెట్టేయండి. సాధించిన ఓట్లను మాత్రం లెక్క చూడండి. 2019లో 95 వేల ఓట్లు సాధించిన వైసీపీ, 2021లో కేవలం 17వేల ఓట్లను మాత్రమే అదనంగా పొందగలిగింది. అది కూడా, ప్రధాన ప్రతిపక్షం బరిలోకి లేని సమరంలో! నియోజకవర్గంలో అస్తిత్వం కూడా లేని భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ దక్కని రీతిలో 21వేల ఓట్లను సాధించింది. ఇది ఎలా జరిగింది. కేవలం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే పనిచేసింది!
తెలుగుదేశం, జనసేన పార్టీలు బరిలో దిగకపోయినా.. భారతీయ జనతా పార్టీ బద్వేలును విడిచిపెట్టలేదు. బీజేపీ అభ్యర్థికి తెలుగుదేశం, జనసేన దొంగచాటుగా మద్దతు అందిస్తాయని విరివిగా ప్రచారం జరిగింది. 2024 నాటికి ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే గనుక.. ప్రజాస్పందన ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక ట్రయల్ రన్ లాగా వారు భావిస్తున్నారనే ప్రచారం కూడా బాగా జరిగింది.
బీజేపీ శ్రేణులు కూడా అలాగే మురిసిపోయాయి. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే.. శాసనసభలోకి తమకు ఎంట్రీ దొరుకుతుందని కలలు కన్నాయి. అయితే వాస్తవంలో బద్వేలు పరిస్థితి భిన్నంగా సాగింది. తెలుగుదేశం ఓటు బ్యాంకు మొత్తం తమకు గంపగుత్తగా పడిపోతుందని కలలుకన్న బీజేపీ శ్రేణులు.. తాము యాభైవేల ఓట్లు స్కోర్ చేస్తామని భావించారు. ఎంత ప్రయత్నించినా సరే.. తెలుగుదేశం ఓట్లు మొత్తం పువ్వు గుర్తుకు పడిపోవడం జరగలేదు. బద్వేలులో తాము బరిలోకి దిగకపోయినంత మాత్రాన.. చంద్రబాబునాయుడు ను నిత్యం తూలనాడుతూ ఉండే బీజేపీకి తెలుగుదేశం శ్రేణులు మద్దతిస్తాయని అనుకోవడం భ్రమ. బద్వేలులో అదే జరిగింది.
బీజేపీ సాధించిన 21 వేల ఓట్లలో కేవలం 2, 3 వేల ఓట్లు మాత్రమే తెలుగుదేశం ఓట్లు అనేది ఒక అంచనా. అదే సమయంలో తతిమ్మా ఓట్లన్నీ ప్రభుత్వవ్యతిరేక ఓట్లుగానే పరిగణించాలి. బీజేపీ అభ్యర్థి.. పనతల సురేష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. కష్టపడి పనిచేయడం ద్వారా తన పార్టీ బలాన్ని మించి ప్రజాదరణను కూడా గట్టుకోవడంలో పనతల సురేష్ సఫలం అయ్యారు.
వైసీపీ ఓట్లు ఎలా వచ్చాయి?
మరి ఇలాంటి నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో సాధించిన 95,482 ఓట్లకు మించి.. ఈసారి 1,12,211 ఓట్లు ఎలా సాధించింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు.. వైఎస్సార్ సీపీ ఎడ్వాంటేజీ తీసుకోవడం సహజం. తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో కూడా దొంగఓట్ల అప్రతిష్టను ఆ పార్టీ ఘనంగానే మూటకట్టుకుంది. గెలుపు ఖరారుగా దక్కుతుందనే నమ్మకం ఎంతగా ఉన్నప్పటికీ.. మెజారిటీకోసం పెడతోవలు తొక్కడం మాత్రం వైఎస్సార్ సీపీ మానలేదు. బద్వేలులో కూడా అదే వ్యవహారం రిపీట్ అయింది.
గతంలో దొంగఓట్లు అనే పేరుతో చెలామణీ అయిన ఓట్ల స్థానే.. ఇప్పుడు సైక్లింగ్ ఓట్లు మామూలైపోయాయి. తెలుగుదేశం నాయకులు బూత్ లలో ఏజంట్లుగా కూర్చున్నారే గానీ.. నకిలీఓట్లు వేయడానికి వచ్చిన వారిని నియంత్రించడం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రకంగా చాలాపెద్ద సంఖ్యలోనే వైఎస్సార్ సీపీ నాయకులు రీసైక్లింగ్ ఓట్లు వేసుకోగలిగారు.
ప్రజలు తమకు, తమ సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రచారం చేసుకోవడానికి, టముకు వేసుకోవడానికి వారికి ఈ మెజారిటీ ఉపయోగపడుతుంది. అంతే తప్ప సరైన రీతిలో ఆత్మసమీక్ష చేసుకుంటే.. తమకున్న ప్రజాబలం పెరిగిందో సన్నగిల్లిందో అందరికంటె వారికే బాగా అర్థమవుతుంది. బూత్ లలో మిగిలిపోయిన ఓట్లేవీ వృథా కాకుండా ఎన్నివేల సైక్లింగ్ ఓట్లు వేయించారో ఈ ఎన్నికల బాధ్యతలు చూసిన కీలక నాయకులకు ఎరుకే. ఇప్పుడు లభించిన 1.12 లక్షల ఓట్ల నుంచి తాము వేయించుకున్న నకిలీ/రీసైక్లింగ్ ఓట్లను మినహాయించి చెక్ చేసుకుంటే.. వాస్తవంగా తమకు పడిన ఓట్లు ఎన్నో వారికే అర్థమవుతుంది.
నోటా, కాంగ్రెస్ ఓట్లు దేనికి సంకేతం
కాంగ్రెస్, నోటాలకు కలిపి నియోజకవర్గంలో సుమారు పదివేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు ఇక్కడ ఇంకా 6వేల పైచిలుకు ఓట్లు సాధించేంత సీను మిగిలుందా? అనేది సందేహం. అలాగే నోటాకు నాలుగువేల ఓట్లు పడేంత చైతన్యం బద్వేలు నియోజకవర్గంలో ఉన్నదా అనేది కూడా సందేహమే.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సాధారణంగా విద్యావంతులు ఎక్కువగా ఉండే నగర ప్రాంతాలలో నోటాకు ఎక్కువ ఓట్లు రావడం సహజం. కానీ బద్వేలులో సుమారు నాలుగువేల ఓట్లు వచ్చాయి.
అయితే కాంగ్రెస్, నోటా ఓట్లు.. సైక్లింగ్ ఓట్ల పుణ్యమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా సైక్లింగ్ చేసేప్పుడు ఉన్నఓట్లన్నీ గంపగుత్తగా ఒకటే పార్టీకి వేసేయకుండా మార్చి మార్చి వేయడం సహజం. ఆ క్రమంలోనే.. ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థికి అయిన బీజేపీకి కాకుండా కొన్ని కొన్ని ఓట్లు కాంగ్రెస్, నోటాకు వేయడం వల్లనే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి.
ఈ విషయాలు అన్నింటినీ అధికార పార్టీ వారు బేరీజు వేసుకోవాలి. ఆ మేరకు వారే జాగ్రత్త పడాలి. ఆత్మవంచన చేసుకుంటే గనుక, అధినేత జగన్మోహన్ రెడ్డిని మభ్యపుచ్చుతూ.. వచ్చిన ఓట్లన్నీ తమ అసలైన ప్రజాబలమే అని చెప్పుకుంటూ ముందుకు సాగితే గనుక.. తిరిగి అధికారం దక్కించుకోవడానికి ఎదుర్కోవలసిన అసలైన కీలక ఎన్నికలలో భంగపాటు తప్పకపోవచ్చు.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post