కరోనా విలయాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు రకరకాల విధానాలను అనుసరిస్తున్నారు. అన్ని దేశాలు ముందుగా పాటించింది లాక్ డౌన్ నిబంధనలను విధించడం. మనదేశంలో కూడా మొన్నటి వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి ఉంది. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడడంతో ఇంతపెద్ద దేశంలో లాక్ డౌన్ విధించడంతో దేశంలోని అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా దేశ ఆదాయానికి గండి పడింది.
దీంతో చేసేది లేక దశలవారీగా లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బారిన పడకుండా ప్రజలే తగు జాగ్రత్తలతో మెలగాలని ప్రభుత్వం హెచ్చరించింది. మొదట ప్రజలు కరోనాకు భయపడినా తర్వాత భయంపోయి, ధైర్యం వచ్చేసింది. ఏముంది కరోనా వస్తే మాత్రం ఏం కాదులే అనే ధీమాతో అందరూ రోడ్లపై తెగతిరగడం ప్రారంభించారు. దీంతో కరోనా మళ్లీ విజృంభించింది. దీంతో చేసేది లేక ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను లెక్కించుకుంటూ ప్రజలకు హెచ్చరికలు చేస్తూ వస్తోంది. కానీ మనకంటే తక్కువ జనాభా వున్నఆస్ట్రేలియా దేశంలో కరోనా కేసులు విజృంభించకుండా చాలా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది.
ఆస్ట్రేలియాలోని దక్షిణ భాగంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరంగా అమలు పరచాలని నిర్ణయించుకుంది. అడిలైడ్ నగరంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన వారిలో లక్షణాలు బయటపడడం లేదని ఫలితంగా వ్యాధి వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేయడానికి ఎవరూ ఇంటినుండి బయటికి రాకూడదని, అత్యవసరాలకొరకు మాత్రమే ఇంటినుండి ఒకరు మాత్రమే బయటికివెళ్లవచ్చని, అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామాలు చేయడం, పెంపుడు కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్లడం వంటి వాటిని నిషేధించారు. అంతేకాకుండా సినిమాలు, స్కూళ్లు, యూనివర్సిటీలు, కేఫ్ లు వంటివాటిని జనం ఎక్కువగా గుమికూడడానికి అవకాశం వున్న అన్నింటినీ కూడామూసివేశారు. ఇలా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తే కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మనదేశంలో కూడా ఇంత కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తే… కనీసం కరోనా జాగ్రత్తలను పాటించే విషయంలో అధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే… కరోనా అదుపులోకి వస్తుంది.
.