మదనపల్లె జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ, మదనపల్లె జిల్లా సాధన సమితి చేపట్టిన ప్రత్యక్ష ఆందోళన శనివారం నాటికి 600వ రోజుకు చేరింది. ఈసందర్బంగా మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం శివప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చెన్నై – హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
“మదనపల్లె ప్రజల జిల్లా ఆకాంక్షల పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్యవైఖరి నశించాలి – కొత్త జిల్లాల నోటిఫికేషన్ సవరించి, మదనపల్లెను వెంటనే జిల్లాగా ప్రకటించాలి – మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యేలు మరియు రాజంపేట ఎంపీ మదనపల్లె జిల్లా కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలి” అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నరేష్ అనే జిల్లా సాధన సమితి సభ్యుడు మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండును ఒంటిపై రాసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈసందర్బంగా పీటీయం.శివప్రసాద్ తోపాటు జిల్లా సాధన సమితి కో కన్వీనర్లు బి.శ్రీచందు, ముత్తరాశి హరికృష్ణ మాట్లాడుతూ నేటితో మదనపల్లె జిల్లా సాధన ఉద్యమం దిగ్విజయంగా 600 రోజులను పూర్తి చేసుకున్నదని, 600 రోజుల ప్రత్యక్ష ఆందోళనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మదనపల్లె జిల్లా సాధన సమితికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.
మదనపల్లె జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమం పట్ల ఇక్కడి ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందించక పోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరగనున్న మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో మదనపల్లి జిల్లా ఏర్పాటు కోసం తీర్మాణం చేసి, వెంటనే ముఖ్యమంత్రికి పంపాలని డిమాండ్ చేస్తూ, సోమవారం మునిసిపల్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మునిసిపల్ కార్యాలయం ముట్టడికి ఆక్టివిస్టులందరూ హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన సమితి ప్రతినిధులు ముత్యాల మోహన్, వేణు, స్వాగత్, నరేష్, రవిశంకర్, కృష్ణ, జనా, గంగాధర్, రెడ్డిప్రసాద్, రమేష్, క్రాంతి కుమార్, కృష్ణమూర్తి, శంకర, సుస్మిత్, ఆటో శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
.