నిజ్జంగా నిఝం!
నాకు మహిళలంటే మహా గౌరవం. భక్తి. ప్రేమ.
పొద్దున్నే లేచీలేవగానే, నా శ్రీమతికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాను. పొంగిపోయింది. నా అరచేతిని తన చేతిలోకి తీసుకుని, మణికట్టు మీద ముద్దు పెట్టింది. కళ్లు వర్షించలేదుగానీ, మనసు మాత్రం తడిసిపోయే ఉంటుంది.
ఆ వెంఠనే, నేను మార్నింగ్ వాక్‌కు బయల్దేరి, ‘‘నా షూ ఎక్కడ?’’ అని అరిచాను, ర్యాక్ ఎదురుగా నిలబడి.
పరిగేత్తుకొని వచ్చి, ర్యాక్ పక్కనే కొంచెం మూలగా పడి ఉన్న బూట్లు చేతుల్తో అందుకొని, నా కాళ్ల దగ్గర పెట్టింది. సాక్స్ వేసుకోబోతే, ‘‘ఆగండాగండి. బాగా మురికైనట్లున్నాయ్. ఉతికినవి తెస్తా’’నంటూ మళ్లీ పరిగేత్తుకెళ్లి, సాక్స్ తెచ్చిచ్చింది.
ఒట్టు! సాక్స్ నేనే తొడుక్కుని, బయటికి నడిచాను.
చెమట్లు పట్టకముందే తిరిగొచ్చి, బ్రష్ చేయబోతే, పేస్టు అయిపోయింది. ‘పేస్టూ…’ అని అరుద్దామనుకునే లోపే, కొత్త పేస్టుతో నా ముందు ప్రత్యక్షమైంది.
కాఫీ కూడా అరవకుండానే వచ్చింది.
నేను తదేకధ్యానంతో పేపర్లో ఈత కొడుతుండగా, ముమ్మార్లు ‘సమయా’నుకూల హెచ్చరికలు చేసింది. వినపడినా ఖాతరు చెయ్యకపోవటం నా దైనందిన హక్కు.
కాలకృత్యాలు తీర్చుకొని, మూడు ఇడ్లీ తినటం పూర్తి చెయ్యగానే నాలుగో ఇడ్లీ తీసుకొచ్చి ప్లేటులో వడ్డించబోతుంటే, ‘‘వద్దొద్దు. ఆఫీసుకు టైమైంది. సమయానికి పంచ్ పడకపోతే, జీతంలో పంచ్ కొడతారు’’ అని, ‘‘నేను పేపర్లో మునిగిపోతే టైమవుతోందన్న విషయం కాస్త నువ్వయినా గుర్తు చెయ్యొచ్చుగదా’’ అన్నాను విసుగు ధ్వనించకుండా, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై అమిత గౌరవంతో!
తను నవ్వింది. ఆ నవ్వులో ఏదో ఉందని తెలుసు, ఆ భావం నాలోకి ప్రసరించకుండా అడ్డుకునే విద్య కూడా తెలుసు.
హడావుడిగా బ్యాగ్ తగిలించుకుని, బయటికి వచ్చి చూస్తే, నిన్నంతా ఫీల్డులో పొర్లిన నల్లటి షూ తెల్లగా వెక్కిరిస్తూ కనిపించాయి. మళ్లీ ఆమె పరిగేత్తుకొని…
కిందికి దిగటానికి లిఫ్టు మరో సెకనులో మూసుకోబోతుండగా తను మళ్లీ పరిగేత్తుకొని వచ్చి, అలవాటుగా నేను మర్చిపోయిన లంచ్ బాక్స్ అందించి, చేతులు లిఫ్టు తలుపుల మధ్య నలిగిపోని నైపుణ్యం ప్రదర్శిస్తూ బై చెప్పింది.
కారులో వెళ్తుండగా ఫోను. తనే!
‘‘ఏమండీ, సాయంత్రం త్వరగా వస్తారా… సరుకులు తెచ్చుకోవాలి’’ అంది.
‘‘ఊ… ఈవెనింగ్ యాన్యువల్ బిజినెస్ ప్లాన్ సబ్మిట్ చెయ్యాలి…’’
‘‘సరే సరేనండి. నేనే వెళ్లొస్తాలే. సూపర్ మార్కెట్టు దగ్గరేలే, రెండు కిలోమీటర్లేగా. నడిచి వెళ్లొస్తా’’ ఫోన్ పెట్టేసింది.
ఆనందంగానే ఒప్పుకొందా!?
ఠాఠ్… అవన్నీ ఆలోచించే టైమ్ మనకెక్కడిదీ!
ఆఫీసులో విమెన్స్ డే సందర్భంగా మహిళల గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఓ కవిత చదవాలి…
ఆఫీసు గేటులో అడుగు పెట్టిన దగ్గర్నుంచీ ఎదురొచ్చిన ప్రతి మహిళనూ గౌరవ పూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో సన్మానిస్తూ నా క్యాబిన్ చేరుకోవాలి…
సిస్టమ్ ఓపెన్ చెయ్యగానే మనమున్న వాట్సాప్ గ్రూపుల్లోని మహిళలందరికీ విమెన్స్ డే గ్రీటింగ్స్ పంపాలి…
(మారాలని ఉన్నా చిత్తశుద్ధిలోపంతో ఇంకా అలాగే సాగించుకుంటున్న మగానుభావులందరి ప్రతినిధిగా)
– ఎమ్వీ రామిరెడ్డి
ఉదయం 11.26, మార్చి 8.
Discussion about this post