అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోయిన కూరుకు పోయిన జగన్ సర్కారు పన్నుల వసూళ్లకు ‘వింత’ పద్ధతి ఎంచుకుంది.
వసూళ్ల కోసం పురపాలక, రెవిన్యూ, మండల పరిషత్, సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్లను ఇళ్ల వద్దకే పంపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు మొత్తం వసూళ్ల కోసం ఇళ్ల వద్దకే వస్తుండటంతో జనం మానసిక వేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతున్నారు. పన్నుల పేరుతో సామాన్య ప్రజలను వేధించడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జగన్ సర్కారు సంక్షేమ పథకాల అమలు కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నవరత్నాల కోసం ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా అప్పులు చేస్తోంది. ప్రస్తుతం బ్యంకుల్లో కూడా అప్పు పుట్టని దుస్థితి ఏర్పడింది. అప్పు కోసం ప్రభుత్వ, ఆర్టీసీ స్థలాలతో పాటు పార్కులు కూడా తాకట్టు పెడుతోంది.
ఇవి చాలక ‘జగన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ అంటూ పేదలకు ఇళ్లు రిజిస్టర్ చేయిస్తామంటూ… వన్ టైమ్ సెటిల్ మెంటు (ఓటీఎస్) పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52లక్షల ఇళ్లు ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ పథకం పేరుతో నెల రోజుల వ్యవధిలో సుమారు రూ.10వేల కోట్ల వసూళ్లకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
అయితే ప్రభుత్వం మాటలు ప్రజలు నమ్మలేదు. ఓటీఓఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ కారణంగా అత్యధికులు ఓటీఎస్ చెల్లించడానికి నిరాకరించారు.
ఈ కారణంగా ఓటీఎస్ గడువును ఉగాది వరకు పొడిగించారు. వసూళ్ల బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించి… గ్రూపుల్లో వారే అప్పు ఇప్పించి… ఓటీఎస్ జమ చేసుకుంటున్నారు. డబ్బు చెల్లించం అనే వారిని తోటి సభ్యుల ముందే అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారు.
ఓటీఎస్ కథ అలా ఉండగానే… ఇపుడు పల్లె, పట్టణం తేడా లేకుండా ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. మండల పరిషత్, పురపాలక శాఖ అ ధికారులకు పన్ను వంద శాతం వసూలు చేయాల్సిందే నంటూ ఆదేశాలు ఇచ్చారు. వారికి లక్ష్యం కూడా విధించారు. పన్ను వసూలు చేయక పోతే శాఖా పరమైన చర్యలూ తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు తమ కింద పని చేసే క్షేత్ర స్థాయి ఉద్యోగులను, సిబ్బందిని పన్ను వసూళ్లకు పురమాయిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు మొత్తం పన్ను వసూళ్లలో నిమగ్నమయ్యారు. పురపాలక, రెవిన్యూ, మండల పరిషత్, సచివాలయ ఉద్యోగులతో పాటు.. వలంటీర్లు అందరూ బృందాలుగా ఏర్పడి పన్ను వసూళ్లకు ఇళ్ల వద్దకే వెళుతున్నారు.
ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి… వారు ఎంత బకాయి ఉన్నారో అందరూ వినే విధంగా మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. బకాయి డబ్బు చెల్లించే వరకు ఇళ్ల వద్ద నుంచి ఉద్యోగులు కదలడం లేదు. తరువాత చెల్లిస్తామని ప్రాధేయ పడినా వారు అంగీకరించడం లేదు.
బకాయి ఉన్న పన్ను చెల్లించిన తరువాతనే తాము వెళతామని భీష్మించుకుంటున్నారు. ఈ అవమానికి భయపడి పేద, మధ్య తరగతి ప్రజలు అప్పు చేసి మరీ ఇంటి, నీటి పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిరంకుశ విధానం తాము ఎన్నడూ చూడలేదని పలువురు అంటున్నారు.
పన్ను వసూళ్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల ఇళ్ల వద్దకు వచ్చి మొండికేయం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మౌళిక వసతులు కల్పించక పోయినా… పన్ను మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ప్రభుత్వం ఈ వింత విధానానికి స్వస్తి చెప్పి… గతంలో లాగా పన్ను వసూలు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
.