‘‘ఓలా అనే సంస్థకు ఒక్క వాహనం కూడా సొంతంగా లేదు గానీ.. దేశవ్యాప్తంగా కొన్ని వేల వాహనాలను టేక్సీలుగా ఆపరేట్ చేస్తోంది’’ అని నిన్నమొన్నటి దాకా అందరూ చాలా కామెడీగా చెప్పుకునే వారు. కానీ.. సొంత వాహనం కలిగి ఉండడం తర్వాత, వాహనాల తయారీలోకే రంగంలోకే ప్రవేశించిన ‘ఓలా’ బహుశా టూవీలర్ ప్రపంచంలో అనేకానేక రికార్డులను బద్ధలు కొట్టేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ లకు ఈ రోజుల్లో ఎక్కడ లేని గిరాకీ ఉన్నదనడంలో సందేహం లేదు. కేంద్రప్రభుత్వం వారానికోమారు.. పెట్రోలు డీజిలు రేట్లను పెంచుకుంటూ పోతూండగా.. ప్రజలకు వాహనాల్లో తిరగడం అంటే జీవితం మీదే విరక్తి పుట్టే వాతావరణం ఏర్పడుతున్నదనడంలో సందేహం లేదు. గతిలేదన్న రీతిలో ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలే ఎలక్ట్రిక్ బండ్లకు పెరుగుతున్న గిరాకీ.. మరోవైపు ఓలా రిలీజ్ చేసిన మోడళ్లలో ఆధునిక ఫీచర్లకు ఉన్న క్రేజ్ కలగలిసి.. అమ్మకాల్లో రికార్డులు బద్ధలవుతున్నాయి.
ఓలా టూవీలర్ తయారీరంగంలోకి ప్రవేశిచింది. ఆన్ లైన్ లో విక్రయాలు ప్రారంభించగానే.. 24 గంటల్లో 600 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తు స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. తమాషా ఏంటంటే.. ఒక్కరోజులో టూవీలర్ కంపెనీలు అన్నీ కలిసి ఎన్ని విక్రయిస్తాయో.. దానికంటె కూడా ఇది ఎక్కువట! నాలుగు సెకన్లకు ఒక స్కూటర్ వంతున అమ్మినట్లుగా వారు ప్రకటించారు. కొనుగోళ్లు వెల్లువెత్తే సరికి, ఉత్పత్తి గురించి వారే బెంబేలెత్తిపోయి.. 24 గంటల్లోనే విక్రయాల ప్రక్రియను ఆపేశారు కూడా!
జెనరేషన్ మారుతోంది. విద్యుత్తు వాహనాల పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే అమ్మకాలు అంటే ఇలా ఉండాలి అని అవాక్కయ్యేలా.. ఓలా స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. లక్షకు తగ్గకుండా ధరలు ఉన్నప్పటికీ.. జనం వాటిని కొనడానికి ఈ రేంజిలో ఎగబడుతుండడమే విశేషం.
.