శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మహాధశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలని తిరుపతి కలెక్టరు వెంకట్రమణారెడ్డి చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణంలోని త్రినేత్ర అతిథి గృహంలో బుధవారం కలెక్టరు వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో ముక్కంటి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాశివరాత్రి, రథోత్సవం, ఆదిదంపతుల కల్యాణం, గిరిప్రదక్షిణ రోజుల్లో భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలోల ఏర్పాట్లు పకడ్బందీగా వుండాలన్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను, పడ్డ ఇబ్బందులు గుర్తించి వాటిని అధిగమించి ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మునిసిపల్, పంచాయితీ రాజ్ శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయిలో పట్టణం, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
తాగునీరు , దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలన్నారు. పోలీస్ శాఖ ఎలాంటి చిన్నపాటి సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు భద్రత , పార్కింగ్, వాహనాల మళ్లింపు వంటివి చూడాలన్నారు. ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలిగితే భక్తులకు సమాచారం పూర్తిగా తెలుస్తుందన్నారు. అన్నదానం వంటివి సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ యంత్రాంగం ప్రోటోకాల్, పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్, పోలీస్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నెల 18న లింగోద్భవం, మహాశివరాత్రికి ప్రత్యేక బందోబస్తు, భద్రత ముఖ్యమన్నారు.
మెడికల్ క్యాంపు లు, 108 అందుబాటులో వుండాలన్నారు. ఆర్టీసీ బస్సులు భక్తుల సౌకర్యం సరిపడా ఉండాలన్నారు. వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వుండాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగరాదన్నారు. కమాండ్ కంట్రోల్ లో అన్ని శాఖల అధికారులు వుంటే సమస్య వచ్చిన వెంటనే పరిష్కారానికి అవకాశం వుంటుందన్నారు. ఫైర్ అధికారులు దేవాలయంలో అన్ని పరికరాలు సర్టిఫై చేయాలని ఆదేశించారు. ఇక ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ… నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ జరగాలన్నారు.
ఆలయ సిబ్బంది, అధికారులకు గుర్తింపు పాసులు వుండాలన్నారు. పాసులు లేకుంటే అనుమతి వుండదన్నారు. నిర్దేశించిన సమయాల్లో ప్రోటోకాల్ దర్శనాలు అనుమతి వుంటుందన్నారు. కమాండ్ కంట్రోల్, అవసరమున్న చోటల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. మహిళా పోలీస్ సహకారంతో బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్య నిర్వహణాధికారి కేవీ సాగర్ బాబు, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
.

Discussion about this post