కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కాపుల సంక్షేమం, ఆ కులానికి మేలు జరగడం అనే ఒకే ఒక్క అంశానికి కట్టుబడి సుదీర్ఘకాలం రాజకీయం చేసిన వ్యక్తి ముద్రగడ. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన, రాష్ట్ర మంత్రిగా కూడా రెండుదఫాలు సేవలందించిన ముద్రగడ పద్మనాభం.. చివరిరోజుల్లో కాపుల సంక్షేమానికి మాత్రమే కట్టుబడినప్పటికీ.. ఆయన కేవలం కాపు నాయకుడు మాత్రమే కాదు.
అలాంటి నాయకుడు కన్నుమూసినప్పుడు.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయిస్తే.. అందుకు తిరస్కరించడం ద్వారా.. ముద్రగడ కుటుంబసభ్యులు ఆయన పట్ల అపచారం చేశారనే అభిప్రాయం అభిమానుల్లో వినిపిస్తోంది. కేవలం అధికార లాంఛనాలతో తుదివీడ్కోలు చెప్పడాన్ని తిరస్కరించడం మాత్రమే కాదు.. కన్న కూతురు తండ్రి మృతదేహానికి నివాళి అర్పించడానికి వస్తే.. దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా ఆయన స్వజనులు నానా యాగీ చేయడంపై కూడా పలువురిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీకంటె ముందే మొదలైంది. 1978లోనే ఆయన జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశంలోకి వచ్చి రెండు పర్యాయాలు గెలిచారు. అప్పట్లో ఎన్టీఆర్ తో విభేదించి కూడా ఆయన వెన్నంటి నిలిచిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజీవ్ గాంధీ సారథ్యంలో కాంగ్రెసులో చేరి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో సభ్యుడిగా ఉన్నారు. తర్వాతి పరిణామాల్లో తెలుగుదేశం తరఫున ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత ఆయనకు కాపుకులపరమైన ఎజెండా ప్రధానంగా మారుతూ వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లో వరుస ఓటములు పలకరించాయి. 2024 ఎన్నికలకు చాన్నాళ్ల పూర్వం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ముద్రగడ, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను తాను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని సవాలు విసిరి, దానికి కట్టుబడి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.
మొత్తానికి అధికార పదవుల్లోనే ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకుడికి.. అధికార లాంఛనాలతో తుదివీడ్కోలు ఇవ్వడం సముచితమైన గౌరవం. ప్రస్తుతం అధికారంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఉన్నారు గనుక.. వారు ఆదేశించిన అధికార లాంఛనాలు తమకు వద్దని ముద్రగడ కుటుంబ సభ్యులు భావించి ఉండొచ్చు. ఊరిమీద అలిగినట్టుగా చేయడానికి ఇది సరైన సందర్భం కానేకాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ముద్రగడ కుటుంబ సభ్యులు, మరణించిన నేత పట్ల అవమానకరంగా ప్రవర్తించారనేది నిజం. ఎందుకంటే.. ప్రభుత్వం చంద్రబాబునాయుడు లేదా పవన్ కల్యాణ్ ల సొంత ఆస్తి కాదు. ప్రభుత్వ అధికార లాంఛనాలు అనేవి వారిద్దరి దయవలన ప్రాప్తించినవి కాదు. ముద్రగడ తన సుదీర్ఘ ప్రజాజీవితం ఫలితంగా సాధించుకున్నవి. ఆ గౌరవాన్ని ఆయనకు దక్కకుండా చేయడం వల్ల వారు తప్పు చేశారు.
అలా కూతురు క్రాంతిని తండ్రి మృతదేహం వద్దకు అనుమతించకపోవడం కూడా తప్పే. మనుషులు మరణించిన తర్వాత కూడా.. పగలు, విద్వేషాలను పట్టుకు వేళ్లాడడం మానవత్వం అనిపించుకోదు. అందుకే.. ఆయన మరణించిన సందర్భంలో.. స్వజనులు వ్యవహరించిన తీరు ఆయన అభిమానుల్లోనే విమర్శలకు కారణమవుతోంది.
.