ముందస్తు ఎన్నికలకు వెళ్లబోయేది లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పారు. జగన్ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నదని, అందుకే చాలా నిర్ణయాలను సమీక్షించుకుంటున్నదని, పథకాల బాకీలను హడావుడిగా పూర్తిచేస్తున్నదని పుకార్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ కు అత్యంత దగ్గరి నాయకుల్లో ఒకరైన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్‌ను లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామన్నారు. టీడీపీని కాపాడుకునేందుకే చంద్రబాబునాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు.
ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదన్నది ప్రభుత్వ యోచన అన్నారు. సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని వ్యాఖ్యానించారు. ‘‘మా కుటుంబంపై ఆరోపణలు చేసిన కొండ్రెడ్డి అనే వ్యక్తిపై చాలా కేసులు ఉన్నాయి. బస్సు దోపిడీలాంటి కేసులు కూడా అతనిపై నమోదై ఉన్నాయి’’ అని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు.
ముందస్తు ఎన్నికల విషయంలో సర్వత్రా చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. రెండు నెలల్లోగా ఇంకా స్పష్టత వస్తుందని.. జగన్ రెండున్నరేళ్ల తర్వాత చేపడతానని అన్నటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా దీనితో ముడిపడి ఉన్నదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
.

Discussion about this post