బబుల్‌లో బతకడం అంటే.. సేఫ్ జోన్ వీడకుండా బతుకుతూ ఉండడం. అందులో జాగ్రత్తలు ఉండొచ్చు.. భయాలు ఉండొచ్చు. వర్తమాన రాజకీయాల్లో అలా బబుల్ లో బతుకుతున్న నాయకుడు ఎవరు? దేశరాజకీయాల్లో అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్.. ‘కొంతమంది బబుల్ లో బతుకుతుంటారు’ అంటూ ఎద్దేవా చేసిన వాక్యాలు ఎవరి గురించి!? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.
గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. సోనియా- రాహుల్ ల అచేతనమైన పార్టీ నాయకత్వంపై ఒక రకంగా తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకుడు కూడా! ఆయన తిరుగుబాటు చేయడం- అధిష్ఠానం దూతలు బుజ్జగించడం ఇలాంటివి గతంలో చాలా సార్లు జరిగాయి. ఇటీవల.. అధిష్టానంపై విమర్శలతో 23 మంది సీనియర్లు.. రాసిన లేఖ సంచలనం అయింది. ఈ పరిణామాల మధ్యలోనే ఆజాద్.. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియగానే.. ఆ హోదాకు ‘విరమణ’ కూడా ప్రకటించారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీ కూడా ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని అభినందించారు.
ఇప్పుడు ఆజాద్ చూడబోతే మోడీ అనుకూల రాజకీయం ప్రారంభించినట్లుగా ఉంది. కాంగ్రెస్‌ను ధిక్కరించిన 23 మంది సీనియర్లతో శనివారం జమ్మూలో ఓ సభ పెట్టి.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన ఆజాద్, ఆదివారం శ్రీనగర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీని ఆకాశానికెత్తేశారు. మోడీ లాంటి నాయకుడు గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఒకవైపు మోడీని కీర్తిస్తూనే.. మరోవైపు ‘కొందరు నాయకులు బబుల్స్ లో ఉంటారు.. ఎవ్వరి మాటా వినరు’ అంటూ నిందలు వేశారు.
ఇప్పుడు వాతావరణంలో ఈ విమర్శలు అచ్చంగా రాహుల్ గాంధీ గురించే అనే సంగతి స్పష్టంగానే తెలుస్తోంది.
సీనియర్లతో రాహుల్ పలు సందర్భాల్లో విభేదిస్తున్నారు. వారు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆజాద్.. బబుల్ ఉండే నాయకుడిగా రాహుల్‌ను అభివర్ణించడం విశేషం. రాహుల్ గాంధీ.. చాలా అరుదుగా ప్రజల్లోకి వస్తూ ప్రభుత్వాన్ని తిట్టి వెళుతుంటారు. ఆయన సారథ్యంలో పార్టీ రోజురోజుకూ మెట్లు దిగుతోందనే ప్రచారమూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆజాద్ బబుల్ నాయకుడిగా దెప్పిపొడవడం విశేషం.
Read This
చంద్రబాబును తిరుపతిలో అరెస్టు చేస్తారా?
ఆజాద్ బీజేపీలో చేరుతారా? లేదా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్వతంత్ర వ్యక్తిగానే ఉంటారా? అనే చర్చ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత.. బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన, అప్పట్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన గులాం నబీ ఆజాద్.. ఇప్పుడు ఇలా బహిరంగంగా మోడీని ప్రస్తుతించడం అనేది.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మారుతున్న వాతావరణానికి నిదర్శనమా అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
.
Discussion about this post