మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలనే ఉద్యమం తీవ్రతరమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల గెజిట్ ప్రతులను కూడా దహనం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చకునే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని నేతలు తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ హేతుబద్దత లేని చెత్త నోటిఫికేషన్ అని… దీన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకస్తున్నారని మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం శివప్రసాద్ అన్నారు. కొత్త జిల్లాల నోటిఫికేషన్ వ్యతిరికిస్తూ గురువారం స్థానిక వాల్మీకి సర్కిల్ వద్ద మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈసందర్బంగా జిల్లా సాధన సమితి నాయకులు కొత్త జిల్లాల నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా జరిగిన ఆందోళనలో శివప్రసాద్ తోపాటు ఎమ్మార్పీఎస్ నేత నరేంద్ర, సీపీఐ నాయకుడు తోపు కృష్ణప్ప, వీసీకే రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీచందు, వాల్మీకి మహాసేన వ్యవస్థాపకుడు ముత్తరాశి హరికృష్ణ, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపకుడు కోనేటి దివాకర్ రావు తదితరులు మాట్లాడుతూ కొత్త జిల్లాల నోటిఫికేషన్ పై తీవ్రంగా మండిపడ్డారు.
దశాబ్దాలుగా మదనపల్లె ప్రజల్లో వున్న జిల్లా ఆకాంక్షలను కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఆవిరి చేసిందని… అందుకే దుర్మార్గమైన నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేసి ప్రజాగ్రహాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. కొత్త జిల్లాల నోటిఫికేషన్ ను ముఖ్యమంత్రి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మదనపల్లె జిల్లా సాధన సమితి ప్రతినిధులు రేపటి నుండి నాలుగు నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
వచ్చేనెల ఎనిమిదో తేదీ జిల్లా సాధన కోసం “మదనపల్లె పొలికేక” పేరుతో బృహత్ ప్రతిఘటనా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. మదనపల్లె జిల్లా సాధన సమితి చేపట్టే ఆందోళనల్లో అందరూ స్వచ్చందంగా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆందోళనకు ముందు వీరు వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో టౌన్ బ్యాంకు సర్కిల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులతోపాటు మదనపల్లె జిల్లా సాధన సమితి ప్రతినిధులు ముత్యాల మెహన్, కొండుపల్లి ఆనంద్, పెద్దపాలెం రవిశంకర్, సుందరం, సొన్నికంటి రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
.