భారతదేశం ఇవాళ ఇలాంటి రూపంలో ఉండడానికి ఎందరో మహనీయులు కారకులు. భారతదేశపు భౌగోళిక స్వరూపం, ఈ దేశం యొక్క మ్యాప్ ఇప్పుడున్న రీతిగా ఉండడానికి కీలకమైన కారణభూతుల్లో అగ్రశ్రేణిలో కీర్తించదగినవాడు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశం యావత్తూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.
స్వతంత్ర భారతదేశపు కీర్తిశిఖరంలో వెలుగులీనుతూ ఇమిడిన రత్నాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉంటూ.. దేశానికి నిరుపమాన సేవలందించిన మహనీయుడు. ఈ దేశస్వరూపాన్ని ఘనంగా కలగన్న స్వాప్నికుడు పటేల్. అందుకే ఆయన పుట్టినరోజు ఈ దేశానికే ఐక్యతా దినోత్సవం అయింది. ఆదర్శిని డాట్ కామ్ ఆయన సేవలకు నివాళి అర్పిస్తోంది.
సుదీర్ఘమైన, వీరోచితమైన మడమతిప్పని పోరాటాలకు తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చే సందర్భంగా ఒక అతిపెద్ద కుట్రకు తెరతీసింది. భారతదేశంలోని 556 సంస్థానాలు కూడా విడివిడిగా స్వతంత్రంగా ఉండిటానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది. సరిగ్గా ఆ సమయంలోనే భారతదేశపు ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృఢ సంకల్పం, వజ్రసమానమైన దృఢవైఖరి ఈ దేశం సమైక్యగీతం ఆలపించడానికి అవసరం అయ్యాయి. ఆయన హీరోయిజం ఫలితంగా మొత్తం 556 సంస్థానాలు కూడా భారతదేశంతో ఐక్యం అయ్యాయి. ఇదే జరగకుంటే భారతావని ఇవాళ్టికి కూడా కొన్ని వందల ముక్కలుగా చిరిగిన విస్తరిలాగా ఉండేది.
సంస్ధానాల విలీన ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఆనాడు ఉప ప్రధాని, హోం మంత్రి ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి అఖండ భారత నిర్మాణానికి మూల స్ధంభంగా నిలిచారు. పటేల్ వ్యూహాత్మక వైఖరి, అసమానమైన హీరోయిజం అన్ని రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేయడానికి దారితీసింది.
హైదరాబాదు సంస్ధానం భారతదేశంలో విలీనమైన సమయంలో కూడా, నాటి నిజాం తమ ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఉండాలనే కోరుకున్నాడు. సర్దార్ పటేల్ పోలీసు చర్యకు ఆదేశించటంతో తలొగ్గక తప్పలేదు. హైదరాబాద్ నిజాంను లొంగిపోవాలని, విలీన ఒప్పందంపై సంతకం చేయాలని ఒత్తిడి చేయటం పటేల్ వల్లే సాధ్యం అయ్యిందని, ఆయన లేకుంటే హైదరాబాద్‌తో పాటు అనేక ఇతర సంస్థానాలు స్వతంత్ర దేశాలుగా మిగిలి ఉండేవని ఇప్పటికీ ప్రజలు సర్దార్ పటేల్ సేవలను కొనియాడుతుంటారు.
ఒడిశాలో కూడా అప్పటికి 26 రాచరిక రాష్ట్రాలు ఉండేవి. నాటి ముఖ్యమంత్రి హరేక్రిష్ణ మహతాబ్ ఆహ్వానం మేరకు ఒడిశా వచ్చిన పటేల్ మొత్తం 26 రాచరిక సంస్థానాల విలీనానికి కారణభూతులయ్యారు.
గవర్నర్ బిశ్వభూషణ్ నివాళి
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారత దేశానికి అందించిన సేవలు మరువరానివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటామని, దేశానికి సర్దార్ పటేల్ అందించిన సేవలను భారతీయులు ఎన్నటికీ మరచిపోరని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎత్తైన విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుజరాత్‌లో నెలకొల్పటం ముదావహమని, అది ఇప్పడు ఆ మహానేత గౌరవ చిహ్నంగా విరాజిల్లుతుందని గవర్నర్ స్పష్టం చేసారు. కార్యక్రమంలో గవర్నర్ వారి సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.