తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ఇండుగమిల్లి ప్రసాద్ తనకు న్యాయం కావాలని, పోలీసుల వేధింపులు తగ్గాలని ఇంకా ఆవేదన చెందుతున్నాడు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. తనకు పోలీసు వేధింపులు ఉన్నాయనే విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా.. ఇంకా వేధింపులు తప్పడం లేదని ప్రసాద్ కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తంచేశాడు. తన కేసును సీబీఐకు అప్పగించాలని, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తనను ఎడతెగకుండా వేధిస్తున్నారని అంటున్నాడు.
శిరోముండనం బాధితుడు ప్రసాద్ కేసు తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చింది. తన కేసును సిబిఐకి అప్పగించాలంటూ బాధితుడు ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించాడు. శిరోముండనం బాధితుడు ప్రసాద్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పదే పదే కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారంటూ శిరోముండనం బాధితుడు ప్రసాద్ పిటిషన్లో పేర్కొన్నాడు.
రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ప్రభుత్వం వేధిస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చాడు. ప్రసాద్ న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ 2 వారాలు వాయిదా వేసింది.
ప్రసాద్ కేసు చాలా అనుమానాస్పదంగా తయారవుతోంది. శిరోముండనం జరిగిన నాటినుంచి.. ఈ వ్యవహారం ఏదో ఒక తీరుగా వార్తల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రసాద్ రాష్ట్రపతికి విన్నవించుకోవడం, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు రావడం కూడా జరిగింది. ఈ విషయం చూడాల్సిందిగా ఒక అధికారిని కేటాయించారు. అయినా సరే.. పోలీసు వేధింపులు తప్పట్లేదని ప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు. కాగా, ఫిబ్రవరి తొలివారంలో ప్రసాద్ అదృశ్యం అయ్యాడంటూ ఆయన భార్య ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వేధింపులు భరించలేక ప్రసాద్ పారిపోయి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు.
.