శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన గురువారం ఉదయం ఆదిదేవుడు అధికార నందిపై పురవిహారం చేశారు. ఆదిదేవుని దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి కామధేనువుపై ఆయనను అనుసరించారు. అంతకు మునుపు అలంకార మండపంలో గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అనంతరం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుని అధికార నందిపై పైనా… జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని కామధేనువు పైనా అధిష్టించి పురవిహారానికి తీసుకు వచ్చారు.
మూషిక వాహనంపై వినాయకుడు, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవపేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. మంగళవాయిద్యాలు, మేళ తాళాల మధ్య పురవిహారానికి వచ్చిన ఆదిదంపతులను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతుల సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
రేపు సభాపతి కల్యాణం
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సాలను పురస్కరించుకుని 9రోజైన శుక్రవారం సభాపతి కల్యాణం నిర్వహించనున్నారు. సభాపతిగా పిలువబడే నటరాజస్వామికి శివకామసుందరితో కల్యాణం నిర్వహిస్తారు. ఈ కల్యాణం ఆలయ ప్రాంగణంలోని 16కాళ్లు మండపం వద్ద జరుగుతుంది.
ఇక సభాపతి కల్యాణం జరిగే రాత్రిని ఆనందరాత్రిగా వ్యవహరిస్తారు. నాగభూషణుడు నటరాజుగా ఆనంద తాండవం చేస్తాడు. నారద తుంబరుడు, సకల యక్ష, గాంధర్వ గానంతో, వాయిద్య ఘోషలతో ఆనందరాత్రి వేళ కైలాసగిరులు ప్రతిధ్వనించనున్నాయి.
.

Discussion about this post