స్టాక్ మార్కెట్ల దూకుడు మామూలుగా లేదు. ఈవారంలో వరుసగా మూడో రోజూ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ తేరుకుని లాభాల బాట పట్టాయి. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. గత రెండు రోజుల్లో 1600 పాయింట్లు పెరిగిన సెన్సెక్ప్… బుధవారం మరో 400 పాయింట్లు పెరిగింది.
మొత్తం మీద గత 3 రోజుల్లోనూ సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగి మళ్లీ 60000 పాయింట్ల మార్కును చేరుకుంది. మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగడమే కాదు.. విదేశీ మదుపర్ల సందడీ కనిపించింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ ఈరోజు మరో 120 పాయింట్లు పెరిగి మొత్తం మీద 3 రోజుల్లో దాదాపు 600 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకుంది. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు అడ్డూ ఆపూ లేకుండా పరుగులు తీశాయి.
ఐటీ రంగంలోని షేర్లు మాత్రం అధిక నష్టాలు నమోదు చేసుకున్నాయి. ఫార్మా, పవర్, రియాల్టీ రంగ షేర్లు 1-2% పెరిగాయి. మిడ్ క్యాప్ సూచీ లాభాల్లో పయనించగా … స్మాల్ క్యాప్ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 60223 పాయింట్ల వద్ద స్థిరపడగా, nifty 120పాయింట్ల లాభంతో 17925 పాయింట్ల వద్ద క్లోజయింది. బ్యాంకింగ్ రంగ సూచీ 750 పాయింట్లు పెరిగి 37696 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ లో బుధవారం 3481 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 1830 షేర్లు పెరిగాయి. 1555 షేర్లు క్షీణించాయి. 96 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 432 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 11 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 555 షేర్లు అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తే… 252 షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి . బీఎస్ఈ లో మొత్తం 4,670 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
ప్రధానంగా లాభపడ్డ షేర్లు: బజాస్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ లు.
అధిక శాతం నష్టపోయిన షేర్లు: టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ లేబొరేటరీస్, విప్రో లు.
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.