మార్కెట్ల పరుగు ఎక్కడా ఆగడం లేదు. సోమవారం 1000 పాయింట్ల దాకా పెరిగిన సెన్సెక్స్ ఈరోజు మరో 672 పాయింట్లు పెరిగింది. nifty నిన్న 270 పాయింట్లు లాభపడితే ఈరోజు మరో 180 పాయింట్లు పెరిగింది. మార్కెట్ పై బుల్స్ పట్టు బిగించినట్లే కనిపిస్తోంది. కేవలం 3 రోజుల వ్యవధి లోనే సెన్సెక్స్ 1600 పాయింట్లు పెరగ్గా … nifty 450 కి పైగా పాయింట్లు లాభపడింది.
మెటల్, ఫార్మా రంగాలు మినహాయిస్తే బ్యాంకింగ్, ఆయిల్ , పవర్ రంగాలు అధిక లాభాలు నమోదు చేసుకున్నాయి. కొత్త సంవత్సరం తొలి రెండు రోజుల్లోనూ సూచీలు ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగాయి. మిడ్ క్యాప్ సూచీ స్తబ్దుగా ముగియగా … స్మాల్ క్యాప్ సూచీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైందనే చెప్పొచ్చు.
గత మూడు నెలల్లో అమ్మకాలే అవధిగా సాగిన విదేశీ మదుపర్లు కొత్త సంవత్సరంలో మాత్రం కొనుగోళ్లతో సందడి చేస్తున్నారు. ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే కేవలం అరగంట వ్యవధి లోనే షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇక మార్కెట్ నష్టాల్లోకి జారిపోవడం ఖాయం అనుకుంటున్నా దశలో బుల్స్ జూలు విదిలించారు.
స్వల్ప వ్యవధిలోనే మార్కెట్లను మళ్ళీ లాభాల బాట పట్టించారు. ఇక ఆ తర్వాత మార్కెట్లు ఏమాత్రం కదలికలు లేకుండా దాదాపు 3 గంటలు అక్కడే కదలాడుతూ వచ్చాయి. మళ్ళీ మధ్యాహ్నం రెండున్నర తర్వాత జోరు మొదలైంది. ఆపరుగు ఎక్కడా ఆగకుండా… చివరిదాకా సాగుతూనే వచ్చింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 672 పాయింట్లు పెరిగి 59855 పాయింట్ల వద్ద స్థిరపడగా, nifty 180పాయింట్ల లాభంతో 17805 పాయింట్ల వద్ద క్లోజయింది..
బీఎస్ఈ లో మంగళ వారం 3489 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 1891 షేర్లు పెరిగాయి. 1491 షేర్లు క్షీణించాయి. 107 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 551 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 9 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 576 షేర్లు అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తే… 227 షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి . బీఎస్ఈ లో మొత్తం 5,191 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
ప్రధానంగా లాభపడ్డ షేర్లు: ఎన్టీపీసి , ఓఎన్జీసి, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, టైటాన్ లు.
అధిక శాతం నష్టపోయిన షేర్లు: టాటా మోటార్స్ , కోల్ ఇండియా, సన్ ఫార్మా, టాటా కన్జ్యూమర్, శ్రీ సిమెంట్స్ లు.
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.