మార్కెట్లకు బ్రేక్ పడింది. కొత్త సంవత్సరంలో తొలి మూడు రోజులు పరుగులు తీసిన మార్కెట్లు గురువారం భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లనూ ప్రభావితం చేశాయి.
మూడు రోజుల్లో దాదాపు 2000 పాయింట్ల దాకా పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 621 పాయింట్లు నష్టపోయి 59602 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ 179 పాయింట్లు క్షీణించి 17745 పాయింట్ల వద్ద స్థిరపడింది. వాహన, చమురు రంగాలనకు చెందిన షేర్లు మినహాయిస్తే ఐటీ. రియాల్టీ రంగాలతో సహా బ్యాంకింగ్, ఫార్మా ఎఫ్ఎంసీజీ తదితర రంగాలకు చెందిన షేర్లన్నీ గణనీయంగా నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్తబ్దుగా ముగిశాయి.
గురువారం వీక్లీ ఇండెక్స్‌లకు ఎక్స్‌పైరీ కావడం, అమెరికా ఫెడ్ రిజర్వు తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లను పడదోయడానికి దోహదపడ్డాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరిదాకా అదే పంథాలో సాగాయి. మధ్యాహ్నం 2 తర్వాత కొద్దిగా కోలుకున్నట్లు అనిపించిన మార్కెట్లు చివర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
బీఎస్ఈ లో గురువారం 3472 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 1980 షేర్లు పెరిగాయి. 1401 షేర్లు క్షీణించాయి. 107 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 421 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 11 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 679 షేర్లు అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తే…165 షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి . బీఎస్ఈ లో మొత్తం 4,676 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
ప్రధానంగా లాభపడ్డ షేర్లు: యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, ఐషర్ మోటార్స్‌లు.
అధిక శాతం నష్టపోయిన షేర్లు: జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, శ్రీ సిమెంట్, రిలయన్స్‌లు.
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.