ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ వెంచర్లనుంచి వాటాగా స్థలం తీసుకుని- జగనన్న ఇళ్లు కట్టేలాగా ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. కేంద్రం పెద్ద కంపెనీలతో విధిగా సమాజసేవకు ఖర్చు పెట్టించే సీఎస్ఆర్ లాంటి పద్ధతి ఇది. కానీ దానికీ దీనికీ మధ్య చాలా తేడా ఉంది. పెద్దరికానికీ- రౌడీయిజానికీ ఉండే తేడా!
రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో సర్వత్రా విమర్శల పాలవుతోంది. కేవలం విమర్శలు మాత్రమే కాదు.. అనేక సందేహాలకు తావిస్తోంది. ఖజానా నింపడానికి ఏదో ఒక రీతిగా డబ్బు పోగు చేసే మార్గాల్లో ప్రభుత్వం పర్యవసానాలు ఆలోచించకుండా పొరబాటు నిర్ణయాలు తీసుకుంటున్నదనే విమర్శలూ వస్తున్నాయి. ప్రభుత్వం ఈ దశలో ఖాతరు చేయకపోవచ్చు. కానీ ముందు ముందు ఖాతరు చేయకతప్పదు.
కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తే దుర్మార్గుడు అంటారు. ఛీ కొడతారు. అలాగని గద్దల్ని కొట్టి కాకులకు వేస్తే మనకు అందరూ జేజేలు కొడతారని జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అనుకుంటే పొరబాటు. రాష్ట్రం చేసిన నిర్ణయం, కేంద్రం అమలు పెడుతున్న ఒక విధానం లాగానే కనిపించినా.. లోతుగా గమనిస్తే ఇందులో చాలా అసమంజస, సహేతుకం కాని ఆలోచనలు ఉన్నాయి. కేంద్రం- రాష్ట్ర పోకడలను బేరీజు వేద్దాం.
సీఎస్‌ఆర్ అంటే..
సమాజానికి సేవ చేయడం ప్రభుత్వం విధి. అందుకోసమే ప్రభుత్వం ఉంటుంది. కానీ.. సమాజానికి అవసరం ఉన్న ప్రతిచోటా ప్రభుత్వమే పనిచేయడం కష్టం కాబట్టి.. పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు ఒక నిబంధన విధించింది. అదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సీఎస్సార్). ప్రతి సంస్థ తమ రాబడిలోంచి కొంత మొత్తం సీఎస్సార్‌కు కేటాయించాలి. ఆ సొమ్ముతో విధిగా సమాజానికి ఉపయోగపడే సేవ, అభివృద్ధి కార్యక్రమాలు చేసి తీరాలి.
అయితే ఇలా సీఎస్సార్ సేవ కార్యక్రమాలు చేసి తీరాల్సిందే అని ప్రభుత్వం దబాయింపుగానే చెబుతుంది. సీఎస్సార్ కింద సేవా కార్యక్రమాలు చేయకపోతే నాన్ బెయిలబుల్ వారంట్లు ఇచ్చేలా కూడా కొత్త నిబంధనలు వచ్చాయి. అయితే ఒక స్థాయి దాటి వ్యాపారం చేస్తున్న వారు మాత్రమే ఇలా విధిగా ప్రభుత్వ నిబంధనకు లోబడాల్సి ఉంటుంది.
సీఎస్సార్ కార్యక్రమాలకు కంపెనీలు కేటాయించవలసిన మొత్తం కూడా నిర్దిష్టం. దీనిని పాట్ (Profit After Tax) అంటారు. మొత్తం రాబడిలో ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులన్నీ పోగా.. మిగిలిన దానిలో కనీసం 2 శాతం సీఎస్సార్‌కు ఇచ్చి తీరవలసిందే. అందుకుగాను ప్రభుత్వం నుంచి వారికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రత్యుపకారాలూ ఉండవు. సదరు సీఎస్సార్ కార్యకలాపాలకు ఏర్పాటయ్యే వ్యవస్థకు ఇతరత్రా విరాళాలు వస్తే గనుక.. వాటికి ఆదాయపు పన్ను మినహాయింపులు పుష్కలంగా వస్తుంటాయి. ఏతావతా ఉభయులకూ ఎంతోకొంత ఉపయుక్తంగా ఈ వ్యవహారం ఉంటుంది.
ఆయా సంస్థలు కూడా ఉత్సాహంగా సీఎస్సార్‌కు తమ లాభాల్లో నిర్దిష్ట 2 శాతం వాటా, కొన్నిసార్లు అంతకంటె ఎక్కువ కూడా కేటాయించి మంచి పనులు చేస్తుంటాయి. సాధారణంగా తమ వ్యాపారాలు, కంపెనీలు ఉండే ప్రాంతాల్లో అక్కడి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోడానికి వారికి ఇదొక మార్గం. అలా.. తాము కేటాయించే సొమ్మును.. తమకు నచ్చిన చోట, తమకు నచ్చిన రీతిలో ప్రజల సేవకు వారు వెచ్చిస్తూ ఉంటారు.
సీఎస్సార్ కు నిధులు ఇవ్వడం అనేది.. ఆయా కంపెనీలు చెల్లించే ఆదాయపు, ఇతర పన్నులకు అదనం. కాకపోతే.. వాటిని వెచ్చించడంపై వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు పేదల చదువుకు సాయం చేయడం అనే కోటా కింద, తమ డ్రైవరు పిల్లల స్కూలు/కాలేజీ ఫీజులు కట్టవచ్చు. అవకాశం ఉంది.
జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఒక జీవో తెచ్చింది. ‘కంపెనీలు- లాభాలు- సీఎస్సార్- సామాజిక సేవ’ అనే పదాలు ఇందులో లేవు గానీ.. అదే మోడల్‌లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యవహారం.
జగన్ ప్రభుత్వం చేస్తున్నదేంటి?
ప్రభుత్వం, ప్రజల సంక్షేమం చూడాలి. కానీ, సదరు ప్రభుత్వం సంక్షేమం అనే కబుర్లు చెబుతుంది గానీ.. అందుకు అవసరమైన సొమ్మును చెమటోడ్చి సంపాదించదు కాబట్టి.. నడ్డివిరిచేలా పన్నులు వడ్డించి ప్రజలనుంచే వసూలు చేస్తుంది. ఉన్నవాడి దగ్గర పన్నుల రూపంలో దోచుకుని.. లేనివాడికి సంక్షేమం ఖాతాలో పంచిపెట్టేస్తారు. అంటే ప్రభుత్వం ఒక రాబిన్ హుడ్.
ఇంతవరకు ఈ వ్యవహారాన్ని వ్యవస్థ ఆమోదించిన మార్గంగా మనం సబబే అనుకుంటున్నాం. అనుభవిస్తున్నాం. సంపద పోగేస్తున్న వాళ్లంతా.. ప్రత్యక్ష పరోక్ష మార్గాల్లో సమాజం మీదనుంచే పొందుతున్నారు గనుక.. తిరిగి సమాజానికి చెల్లించడం అని సరిపెట్టుకుంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే..
నా సమక్షంలో మీ వ్యవహారం, లావాదేవీ జరుగుతున్నది గనుక- నాకు ఇంత మొత్తం చెల్లించాల్సిందే.. అని వసూలు చేస్తే అది దళారీ కమిషన్. నిజానికి దళారీ కొంత మేలు. ఆ లావాదేవీ జరగడంలో వారి ప్రమేయం ఎంతో కొంత ఉంటుంది. ఒక చిన్న స్థాయి క్విడ్ ప్రోకో అది. ప్రభుత్వం దళారీ అవతారమెత్తడం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఉభయపక్షాలూ సర్దుకుపోతుంటాయి.
కానీ, నేను నీకు చేసేది ఏమీ ఉండదు. నీ ప్రతి వ్యాపారంలో నాకు ఇంత వాటా ఇవ్వాల్సిందే అని హుకుం జారీచేస్తే దాన్ని ఏమనాలి? అది, దందా! రౌడీ మామూలు లాంటిది! ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మిగిలిన దశలు అన్నీ దాటి ఆ దశకు వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై ఇలా కన్నేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ జీవో కూడా జారీ చేసింది.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి పేరిట, జీవో ఎం.ఎస్.నెం.145, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నుంచి డిసెంబరు 6వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. (గెజిట్ కాపీ కోసం వార్తకు దిగువ చూడండి)
ఆ కొత్త జీవో అంశాలివీ..
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు.. వెంచర్ వేయగానే.. అందులో 5 శాతం స్థలం ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలి.
అదే లేఅవుట్‌లో స్థల భాగాన్ని కేటాయించలేని పక్షంలో, ఆ లేఅవుట్ ప్రాంతానికి.. 3 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఒక చోట, ఆ మాత్రం విలువకు సరిపడా స్థలాన్ని కొని, ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా స్థలంలో వాటా ఇచ్చే విషయంలో వ్యాపారులకు ప్రభుత్వం గొప్ప వెసులుబాటు కూడా ఇచ్చింది. 5 శాతం స్థలం ఇవ్వలేకపోతే ఆ దామాషాలో స్థలం బేసిక్ వేల్యూను ప్రభుత్వానికి చెల్లించాలి. డబ్బు రూపంలో పుచ్చుకుంటారు. ఇలా కేటాయించే స్థలాన్ని పేదలకోసం ప్రభుత్వం చేపట్టే వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కోసం వినియోగిస్తారు.
వివరాలను గమనిస్తే..
రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేఅవుట్లు వేసేవాళ్లు ఆ స్థలంలో 5 శాతం స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తే, అందులో జగనన్న హౌసింగ్ కాలనీ వెలుస్తుందన్నమాట. వాళ్లు ఎంత భారీ లేఅవుట్లు అయినా వేసుకోవచ్చు గాక.. అందులో 5 శాతం ప్రభుత్వానికి అప్పగిస్తే.. దానిని ఒక్కొక్కరికి ఒక్కో సెంటు వంతున ప్రభుత్వం పేదలకు ఇచ్చేస్తుంది. అలా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు సాగినంత కాలమూ.. కొత్త జగనన్న కాలనీలు వెలుస్తూనే ఉంటాయి.
పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఆలోచన దివ్యమైనదే. అందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి, కూడూ గూడూ గుడ్డలలో ఒకటిగా- ప్రతి మనిషి ప్రాథమిక అవసరాల్లో ఇది ఉంటుంది. ప్రభుత్వాలు- పేదల సొంత ఇంటి కల తీర్చడానికి ఎప్పటినుంచో ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తూనే ఉన్నాయి.
జగన్మోహన రెడ్డి వాటిని ఇంప్రొవైజ్ చేసి.. పేదవాడికి ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు, ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇచ్చేలా, ఇంకాస్త మేలైన, మెరుగైన పథకం తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వైఎస్సార్ జగనన్న ఇళ్లు వెలుస్తున్నాయి. ప్రభుత్వమే ప్రెవేటు వ్యక్తుల నుంచి స్థలాలు కొని పేదలకు కేటాయిస్తోంది. ఇల్లు కూడా కట్టి ఇస్తోంది.
ఇంతవరకు బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్లు ప్రతి వెంచర్‌లో 5 శాతం స్థలం ప్రభుత్వానికి ఇవ్వాలనడమే చిత్రంగా ఉంది. ప్రస్తుతం ఇలా స్థలాలను డెవలప్ చేస్తున్న వారు 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకో 5 శాతం స్థలం ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ మేరకు మునిసిపాలిటీ శాఖలో నిబంధనలను కూడా సదరు జీవోలో సవరించారు.
ఎలాంటి ఆలోచన ఇది?
అధికారం నా చేతిలో ఉన్నది కాబట్టి.. నేను ఏం చెబితే అది నువ్వు చేయాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వ నిర్ణయం కనిపిస్తోంది. నిజానికి రియల్ వెంచర్లు, లేఅవుట్లపై పన్నులు పెంచుకోడానికి కూడా ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ.. ఇప్పటికే భారీగా ఉన్న రిజిస్ట్రేషన్ రుసుములు, పన్నుల వలన.. అలా చేస్తే పెద్ద రాద్ధాంతం అవుతుంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా.. పేదల ఇళ్లకోసం కొత్త ఆలోచన చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఈ నిర్ణయం చేసినట్లు కనిపిస్తోంది. దీనిని ఎవరైనా తప్పుపడితే.. వాళ్లంతా పేదల సంక్షేమాన్ని వ్యతిరేకించే దుర్మార్గులుగా ముద్రవేయొచ్చుననేది వారి ఉద్దేశం కావచ్చు.
మామూలుగా రౌడీయిజం, దందాలు చేసేవాళ్లు వ్యవహరించే తీరు ఒకలా ఉంటుంది. తాము బలవంతులం గనుక.. నలుగురిని పోగేసుకుని దెబ్బ కొట్టగలం గనుక, ఏదో ఒక రీతిగా నీకు నష్టం చేయగలం గనుక- మాకు నువ్వు ఇంత డబ్బు కట్టాల్సిందే అని వసూలు చేస్తుంటారు. ప్రభుత్వం ఆలోచన, కొత్త జీవో కూడా అదే విధంగా ఉంది.
‘సీఎస్సార్- స్థలం వాటా’ ల మధ్య తేడా ఏంటి?
కేంద్రం పెద్ద కంపెనీల ముక్కు పిండి వారితో డబ్బు ఖర్చు పెట్టించే పథకం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్). రియల్ ఎస్టేట్ వారి ముక్కుపిండి స్థలంలో వాటా (ఆ దామాషా డబ్బు) వసూలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువు. పైకి చూడడానికి రెండూ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాలు బోలెడు ఉన్నాయి.
జగన్ సర్కారు మంచి పనే చేస్తోంది కదా.. అనిపిస్తుంది. కానీ.. ప్రభుత్వం పరువు తీసే, ప్రభుత్వం తీరు మీద, చిత్తశుద్ధి మీద అనుమానం పెంచే తేడాలు అవి.
అవేమిటో చూద్దాం..
| కేంద్రం- సీఎస్ఆర్ | ఏపీ ప్రభుత్వం- స్థలం వాటా | |
| 1 | సీఎస్సార్ కార్యక్రమాలకు నిధులు ఖర్చు పెట్టకుండా కంపెనీలు తేడా చేస్తే.. వారిపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయ్యేలా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిబంధనలు మార్చింది. | ప్రభుత్వ అనుమతి లేకుండా అసలు వెంచర్, లే అవుట్ అసాధ్యం. ఇక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. తదనుగుణంగా అలాంటి క్రిమినల్ చర్యలు లేవు. |
| 2 | పన్నులు చెల్లించగా మిగిలిన లాభంలో 2 శాతం సీఎస్సార్ కు కేటాయించాలి. | లే అవుట్ మొత్తం విస్తీర్ణంలో 5 శాతం ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇది చాలా ఎక్కువ. |
| 3 | 1000 కోట్ల టర్నోవర్, లేదా నికర విలువ 500 కోట్లు లేదా, నికర ఆదాయం 5 కోట్లు దాటిన కంపెనీలు మాత్రమే సీఎస్సార్ పరిధిలోకి వస్తాయి. | ఈ జీవోలో అలాంటివేమీ లేవు. ప్రతి లేఅవుట్ లోంచి వాటా స్థలం (ఆమేరకు డబ్బు), ప్రత్యామ్నాయ స్థలం ప్రభుత్వానికి చిన్న రియల్టర్లయినా ఇచ్చి తీరాల్సిందే. |
| 4 | సీఎస్సార్ కు నిధులు కేటాయించడం వలన కంపెనీలకు సేవా కార్యక్రమాలకు ఒక వ్యవస్థ ఏర్పడి.. దానిద్వారా ఇతర విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపులు లాభంగా దక్కుతాయి. | 5శాతం స్థలం ప్రభుత్వానికి ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారికి దక్కేదేమీ ఉండదు. రిజిస్ట్రేషన్ ఇతర రుసుములు, సామాజిక అవసరాలకోసం కేటాయించిన 10 శాతం స్థలం ఇదంతా యథావిధిగా చెల్లించాల్సిందే. |
| 5 | సీఎస్సార్ నిధులను కంపెనీలు తమకు నచ్చిన చోట పేదలకోసం ఖర్చు పెడతాయి. నచ్చిన పనులను సేవా కార్యక్రమాలుగా చేపడతాయి. | 5 శాతం స్థలం పేదలకు కేటాయించే విషయంలో ఆ సంస్థల ఎంపిక ఉండదు. స్థలం పుచ్చుకుని ప్రభుత్వం వారికి నచ్చినోళ్లకు ఇస్తుంది. లబ్ధిదారుల ఎంపికలో స్థలం ఇచ్చిన సంస్థకు ఆప్షన్ లేదు. |
ఏం చేయాలి?
వ్యవహారం ఎప్పుడూ ‘విన్- విన్’ తీరుగా ఉండాలి. లాభం ఉభయులకూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సీఎస్సార్ నిధుల రూపేణా చేస్తున్నది అదే. సీఎస్సార్ కార్యకలాపాల వలన కంపెనీలకు కొంత వెసులుబాటు ఉంది. కనీసం ఆ డబ్బును తమ ఇష్టానుసారం ఖర్చుచేసుకుంటారు. జగన్ సర్కారు కూడా.. 5 శాతం స్థలం కేటాయించే వ్యాపారులకు కొన్ని తాయిలాలు ఇవ్వాలి. ఒక స్థాయిని మించిన వెంచర్లకే ఈ నిబంధన వర్తింపజేయాలి.
తాము గుర్తించిన అర్హులలోంచే అయినా.. పేదలను వారు ఎంచుకుని స్థలాలు కేటాయించే వెసులుబాటు కూడా ఇవ్వవచ్చు. అలాంటప్పుడు బహుశా ఆ వ్యాపారులను నమ్ముకుని సేవలందిస్తూ ఉండే పనివాళ్ల జీవితాలు, జగన్ పుణ్యమా అని స్థిరపడతాయి. సొంతింటి కల నెరవేర్చుకుంటాయి. వాళ్లు అటు సదరు రియల్ వ్యాపారికీ, ఇటు జగన్ కు కూడా రుణపడి ఉంటారు.
ఎలాంటి పరిణామాలు ఉంటాయి?
ఒక ఖరీదైన వెంచర్ వేస్తున్నప్పుడు.. అందులోనే ఒక భాగంలో వైఎస్సార్ జగనన్న ఇళ్లు ఉండడాన్ని ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఒప్పుకోడు. అలా ఒకవైపు జగనన్న ఇళ్లు ఉంటే.. ఖరీదైన కస్టమర్లు రాకపోవచ్చుననే భయం కూడా ఉంటుంది. అలాగని.. 3కిలోమీటర్ల దూరంలో మరొక స్థలం వెతికి దాన్ని కొని ప్రభుత్వానికి అప్పగించే బదులుగా.. ఆ సొమ్ములేవో ప్రభుత్వానికి కట్టేస్తే సరిపోతుంది కదా.. అనే భావనకే అందరూ వస్తారు. ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేఅవుట్‌లు అనేది ఎప్పటికీ తరిగిపోని వ్యాపారం గనుక.. నిరంతరాయంగా డబ్బు రాబడి ఉండే మార్గంగా ప్రభుత్వం దీన్ని భావిస్తుండవచ్చు.
కానీ.. ఏపీలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం శవాసనం వేసి ఉంది. నిర్మాణరంగం కుదేలైపోయింది. రాజధాని సంధిగ్ధావస్థ ఒక్కటే కారణం కాకపోయినా, అనేక కారణాల వల్ల రియల్ వ్యాపారం కూడా దెబ్బతింది. ఇలాంటప్పుడు ఆ వ్యాపారం మీద 5 శాతం అదనపు భారం అంటే.. వ్యాపారులు కార్యకలాపాలు మానుకుని వేచిచూసే అవకాశమే ఎక్కువ. మరింతగా రియల్ వ్యాపారం స్తంభించిపోతుంది. ఎవరైనా వ్యాపారం కొనసాగించినా కూడా లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి. కొత్త జీవో వల్ల.. అదనపు భారం ఎంత పడుతుందో.. దానిని బూచిగా చూపి, ప్రభుత్వం నిబంధనలు మార్చిందని చెప్పి.. రియల్ వ్యాపారులు రెట్టింపు లాభం పొందేలా ధరలు పెంచే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివలన ధరలు పెరుగుతాయి. కొనుగోళ్లు బాగా పడిపోతాయి. అంతిమంగా.. ప్రభుత్వం ఆశించిన, అంచనా వేసిన స్థాయిలో ఖజానా నిండకపోవచ్చు.
ఈ జీవో నిలబడుతుందా?
ప్రభుత్వానికి ఏదో ఒక తీరుగా నిధులు పోగు చేయాలి. రాబడి రావాలి. అదొక్కటే లక్ష్యంగా.. పూర్తి పరిణామాలు ఆలోచించకుండానే తెచ్చిన జీవో ఇది. ఈ జీవోను రియల్ వ్యాపారులు న్యాయస్థానం ఎదుట సవాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేకానేక నిర్ణయాలు న్యాయస్థానం ఎదుట తేలిపోయాయి. అదే జాబితాలో ఈ నిర్ణయం కూడా చేరిపోయినా ఆశ్చర్యం లేదు.
కోర్టులో బ్రేక్ పడితే చాలు.. దానిని కూడా ప్రభుత్వం ఎడ్వాంటేజీగా వాడుకుంటుంది. పేదలకోసం ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక సంకల్పం చేస్తే.. ప్రతిపక్షాలు దుర్మార్గంగా దాన్ని కోర్టు ద్వారా అడ్డుకుంటున్నాయని నిందలు వేసే అవకాశం మెండుగా ఉంది.
ప్రభుత్వం- పరిపాలన అనేది కర్రపెత్తనంగానీ, కొరడా ఝుళిపించడం గానీ కాదు. ఉభయులకు శ్రేయోదాయకంగా ఉండే ఏ ఆలోచన చేసినా.. ప్రభుత్వం మీద కినుక వహించకుండా.. అందరూ హర్షిస్తూ స్వాగతిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం తెరలేపిన ఈ కొత్త దందా విషయంలో పునరాలోచన చేసి, సవరిస్తే సర్వజనామోదం పొందుతారు. లేకపోతే అసంతృప్తికి కారణమవుతారు. విమర్శల పాలవుతారు.
ఇలాంటి సవరణలు చేయాలనే ఆలోచన వలన.. జగనన్న కాలనీలు, వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది నిరంతరాయంగా కలకాలం నడుస్తూనే ఉంటుంది. స్థలాలు పుచ్చుకునే వాళ్లంతా హర్షిస్తుంటారు. అది దందా రూపంలో లేనంతవరకూ.. స్థలం ఇచ్చేవాళ్లు కూడా హర్షిస్తారు. ప్రభుత్వ నిర్ణయంలో ఇంతకంటె సమరసత ఇంకెలా ఉంటుంది.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు, ఆదర్శిని


.

Discussion about this post