సమయం సాయంత్రం అయిదు కావస్తోంది.
వనస్థలిపురంలో ఉండే తన మావయ్య నుంచి ఫోనొచ్చింది వంశీకి.. ఒకసారి అర్జెంట్‌గా రమ్మంటూ..
తను ఉండేది కూకట్‌పల్లిలో..
ఎంత త్వరగా వెళదామన్నా కచ్చితంగా గంటన్నర అయినా పడుతుంది.
తప్పదు మరి.. అర్జెంట్ అంటున్నాడుగా..
బండి తీసుకుని బయల్దేరాడు వంశీ..
కట్‌చేస్తే..
ఆరవకుండానే.. తన మావయ్య ఇంట్లో ఉన్నాడు… ఆశ్చర్యమేసింది అతనికి..
ఇంత తొందరగా ఎలా వచ్చేశానబ్బా.. అని ఆలోచిస్తూంటే.. అప్పుడు అర్థమయింది అదంతా సంక్రాంతి మహత్యమని..
***
అవును నిజమే..
నిత్యం జనరద్దీతో, లక్షలాది వాహనాలతో..
గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో
కిక్కిరిసిపోయే భాగ్యనగరానికి..
సంక్రాంతి వస్తోందంటే చాలు.. ఖాళీ అయిపోవడం అలవాటైపోయింది
గల్లీల్లో ఆడుకునే పిల్లలకు నిత్యం రద్దీగా ఉండే రహదార్లు ఆ పండగ రోజుల్లో ఆటవిడుపు మైదానాలైపోతాయనడం అతిశయోక్తి కాదేమో!
పిట్టగూళ్ల లాంటి ఇళ్లల్లో.. ఇరుకిరుకు గదుల్లో.. కొట్టుమిట్టాడే ఎందరో లగేజీలు సర్దుకుని తమ ఊళ్లకు చెక్కేస్తారు పండగల వేళ..
ఇక బ్యాచ్‌లర్ల సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎప్పుడెప్పుడు సెలవులు దొరుకుతాయా.. ఎప్పుడు బస్సెక్కేద్దామా.. అని ఉబలాటపడిపోతూంటారు.
పండగలకు వారం ముందు నుంచే బస్సులు, రైళ్లు కిటకిటలాడిపోతూ ఉంటాయి.
సందట్లో సడేమియా.. అన్నట్లు రేట్లు పెంచేసి నడిపే ప్రత్యేక రైళ్లు, బస్సులే కాదు, ప్రత్యేక బోర్డు తగిలించుకునే డోరుల్లేని సిటీ బస్సులు సైతం పల్లెలవైపు పరుగులు తీస్తాయి.
ఏదో ఒక సీటు దొరికితే చాలనో… లేదంటే నుంచుని ప్రయాణం చేయడానికైనా సిద్ధపడిపోతూంటారు.
కేవలం ఒక్క సంక్రాంతి విషయంలోనే ఇలా జరుగుతూ ఉంటుంది.
మరి మీరూ బయల్దేరుతున్నారా.. ఈ సంక్రాంతికి..
ఓ పని చేయరాదూ.. ఫర్ ఏ ఛేంజ్..
మీ ఊరు ఎప్పుడూ వెళ్లేదే.. ఈసారి గోదారి టూరు పెట్టుకోవడానికి ట్రై చేయండి..
తేడా ఏంటో మీరే గమనిస్తారు..
సంక్రాంతి అంటేనే గోదారి జిల్లాలు… గోదారోళ్లు అంటేనే సంక్రాంతికి ప్రతీకలు… అందునా కోనసీమ వాళ్లయితే మరీనూ… సంక్రాంతిని తమ జీవితం నుంచి విడదీసి చూడటానికి ఏమాత్రం ఇష్టపడరు…
అక్కడి సంక్రాంతి సంబరాలే వేరు.. ఇలా అన్నందుకు మిగతా వాళ్లు ఉడుక్కోకండే…..
అత్తారిళ్లల్లో అల్లుళ్ల సందళ్లు, బావా బామ్మర్దుల ముచ్చట్లు, మరదళ్లతో సరసాలు, పెద్దోళ్ల ముచ్చట్లు, ఘుమఘుమలాడే పిండివంటలు, అరిటాకు భోజనాలు, ఎరుపెక్కించే తాంబూలాలు, హుషారెక్కించే కొత్త సినిమాలు, ఉత్సాహాన్నిచ్చే కోడి పందేలు, అమ్మవార్ల తీర్థాలు, ప్రభల ఊరేగింపులు…. అబ్బో చెప్పుకుంటూ పోతే… ఇలా ఎన్నో… ఇవన్నీ గోదారి జిల్లాల్లో సంక్రాంతికి ప్రత్యేక సందళ్ళే…
ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు… వెంటనే ప్లాన్ చేయండి
గోదారి జిల్లాల్లో మీకు తెల్సిన వాళ్లు ఎవరూ లేకపోవచ్చు గాక..
అక్కడికి వెళ్లడం మీకు పూర్తిగా కొత్తే కావొచ్చు గాక..
అయినా వెనకాడాల్సిన పనిలేదు..
అచ్చమైన సంక్రాంతికి ఆలంబనగా నిలిచే గోదారి జిల్లాల్లో… పండుగ మూడు రోజులూ మీకు తెలియకుండానే గడిచిపోతాయి. తిరుగు బస్సెక్కాలంటే ఎక్కడలేని నీరసం ఆవహించేస్తుంది. అయితేనేం.. మరిచిపోలేని మధురానుభూతులెన్నిటినో మూటగట్టుకుని బయల్దేరతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలా ప్లాన్ చేసుకోండి
ఈసారి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు శుక్ర, శని, ఆది వారాలొచ్చాయి. స్కూలు, కాలేజీ పిల్లలకు ఎటూ సెలవులే. ప్రభుత్వోద్యోగులకు మూడు రోజులూ సెలవే. ఇక ప్రైవేటు ఉద్యోగులు భోగి రోజు సెలవు పెట్టుకుంటే చాలు. 3 రోజుల టూరునీ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు… బయల్దేరుతున్నారా..
గోదారి జిల్లాల్లో సంక్రాంతి పండుగలను ఆస్వాదించడానికి ప్రధానంగా రాజమండ్రి, రావులపాలెం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాలను ఎంచుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నిటికీ హైదరాబాద్ నుంచి బస్సు సర్వీసులున్నాయి. కొన్ని ప్రదేశాలకు రైలు సౌకర్యం కూడా ఉంది. అలాగే రాజమహేంద్రవరానికి విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నిటిలోనూ మీ బడ్జెట్‌కు అనుగుణమైన లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి… వీలైతే ఇప్పుడే లాడ్జీలు బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇటు కోనసీమ అటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరగడానికి వీలుగా రాజోలుకు దగ్గర్లో దిండి రిసార్ట్స్ ను ఎంచుకోవచ్చు. వాళ్లిచ్చే ప్యాకేజీలను ఒకసారి నెట్‌లో చెక్ చేసుకోండి. అది కుదరకపోతే… ఎక్కడైనా లాడ్జీల్లో దిగొచ్చు. సాధ్యమైనంత తొందరగా కాలకృత్యాలు, స్నానపానాదులు ముగించుకుని దగ్గర్లోని బస్టాండ్‌కు వెళ్తే… అక్కడికి సమీపంలోనే ట్యాక్సీల స్టాండ్స్ కూడా ఉంటాయి. ఓ ట్యాక్సీ మాట్లాడుకోండి.
మొదటిరోజు ద్రాక్షారామం (పంచారామాల్లో ఒకటి), ర్యాలీ (విష్ణువు జగన్మోహినీ అవతారం.. ముందు భాగంలో విష్ణు రూపం, వెనుక భాగంలో జగన్మోహినీ రూపం), అయినవిల్లి (శ్రీ సిద్ధి వినాయక స్వామి), మురమళ్ల (శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి), అప్పనపల్లి (శ్రీ బాలబాలాజీ) క్షేత్రాల సందర్శన పెట్టుకోండి. వీటిని ఒక్కరోజులోనే చూసి వచ్చేయొచ్చు. ఈ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు దారిలో ఎదురయ్యే పల్లెల్లో భోగి మంటల రమణీయ దృశ్యాలను తనివితీరా వీక్షించవచ్చు. ఇంటి గుమ్మాల్లో ముగ్గులు, పట్టు పరికిణీలతో సందడి చేసే యువతులు, కొత్త డ్రెస్సులతో షికార్లు చేసే కుర్రాళ్లు… అడుగడుగునా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆయ్… రండి.. అంటూ పలకరించే గోదారోళ్ల ఆప్యాయతే కనిపి
స్తుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని… సంక్రాంతి సంబరాలు చూడటానికి వచ్చామని చెప్పండి చాలు… కొబ్బరి బొండాలతో మర్యాదలు మొదలెట్టేస్తారు.
మకర సంక్రాంతి
రెండో రోజైన మకర సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా పిలుస్తారు. కొత్త అల్లుళ్ల కోరికలు తీర్చేందుకు అత్తమామలు పడే అగచాట్ల మాటెలా ఉన్నా… తమకున్నంతలో అల్లుళ్లను సంతృప్తి పరుస్తూ… సరదా సరదాగా గడిపేస్తారు. పిండి వంటలతో ఊర్లన్నీ ఘుమాయించేస్తూ ఉంటాయి. చుట్టాలు, వచ్చేపోయే వాళ్లతో ఇళ్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి.
మీరు ఎక్కడ బస చేసినా సాధ్యమైనంతవరకు ఉదయాన్నే బయటపడటానికి ప్రయత్నించండి. శీతాకాలపు ఉదయాల్లో.. పచ్చటి పైర్లను ముద్దాడే.. తెలి మంచు బిందువులతో కొత్త శోభను అలంకరించుకుంటాయి పంటపొలాలు. ఆ దృశ్యాలను ఎంత వర్ణించినా తక్కువే. కళ్లారా చూస్తూ… మనసారా ఆస్వాదిస్తూ… అనుభూతులను మదిలో నింపుకోవాల్సిందే. అంతేనా.. పొట్టి నిక్కరు, నోట్లో చుట్టతో నడిచి వెళ్తూనో.. సైకిలెక్కో.. సగటు గోదారోడు మిమ్మల్ని పలకరిస్తాడు. ఎటూ పొద్దున్నే బయల్దేరతారు కాబట్టి… కడుపులో ఎలకలు పరిగెత్తడం ఖాయం. ఏం కంగారు పడనక్కర్లేదు… మీరు ఏ పల్లెటూర్లో ఉన్నా.. తెల్లవారు ఝాము నుంచే హోటళ్లు తెరిచేస్తారు అక్కడ… అయితే మీరు కోరుకున్నట్లు.. సిటీలో మాదిరిగా పెద్ద పెద్ద బోర్డులేవీ కనిపించవు. పాక(గుడిసె)ల్లోనే హోటళ్లను నడిపిస్తారు. అయినా ఏమాత్రం సంకోచించనక్కర్లేదు.. నామోషీ పక్కన పెట్టేయండి. ఒక్కసారి రుచి చూడండి… వేడి వేడి ఇడ్లీ, మినప రొట్టె, పూరీ, గారెలు…మిమ్మల్ని ఊరిస్తూ కనిపిస్తాయి. కొబ్బరి చట్నీ, శెనగ చట్నీ (దీన్నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు)లతోపాటు కాస్త కారప్పొడి-నెయ్యి వేసి ప్లేటులో పెట్టిస్తారు. ఆబగా లాగించేయండి.. ఏం ఫర్వాలేదు. సిటీలో పల్లీ, టమోటా చట్నీలతో పిడచకట్టుకుపోయిన మీ నోటికి కాస్త గోదారి రుచులు చూపించండి.
ఇక మీ ప్రయాణంలో అంబాజీపేట ఎటూ తగులుతుంది. కోనసీమ కొబ్బరి భాండాగారమది. ఆ ప్రాంతం నుంచి వివిధ రాష్ట్రాలకే కాదు.. విదేశాలకు సైతం ఇక్కడి నుంచి కొబ్బరి కాయలు, కురిడీ కొబ్బరి, కొబ్బరి నూనె, కొబ్బరి పీచుతో తయారుచేసిన ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అంతేకాదండోయ్… ఈ ప్రాంతం పొట్టిక్కలకు చాలా ప్రసిద్ధి. వాడేది ఇడ్లీ పిండే అయినా.. బుట్టల రూపంలో తయారుచేసిన పనసాకుల్లో పెట్టి… ఆవిరి ద్వారా ఉడికిస్తారు. భలే రుచిగా ఉంటాయిలెండి… పొట్ట ఖాళీ ఉంటే లాగించేయడానికి ఏమాత్రం వెనకాడకండి.
సరే… అంతా బానే ఉంది.. ఇంతకీ ఎక్కడికెళ్లాలో చెప్పలేదు అనుకుంటున్నారా… వస్తున్నా.. అక్కడికే వస్తున్నా…కోనసీమలోని అంతర్వేది (శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం), పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు (శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి… ఇది కూడా పంచారామాల్లో ఒకటి), భీమవరం (శ్రీ సోమేశ్వర స్వామి… ఇదీ పంచారామమే), అక్కడే ప్రఖ్యాత మావుళ్లమ్మ తల్లి దేవాలయం (సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతాయి ఇక్కడ) చుట్టి వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకదానికొకటి దగ్గర్లోనే ఉంటాయి. అన్నట్లు భీమవరం ఎటూ వెళ్తారు కాబట్టి… వీలుంటే కోడి పందేలు చూసి వచ్చేయండి (ప్రభుత్వ అనుమతి లభించి అవి జరుగుతున్నట్లయితే). పాలకొల్లులో ఆగినప్పడు బస్టాండుకు దగ్గర్లో లీలా మహల్ సెంటర్ ఉంటుంది. అక్కడి సందులో ఇప్పటి తరానికి పరిచయం లేని కుంపట్లపై మూకుడు పెట్టి… దాంట్లో మినప్పిండి వేసి… పైన మూతపెట్టి… దాని మీద బొగ్గుల నిప్పులేసి.. దోరదోరగా కాల్చిపెట్టే మినప రొట్టెలను వదిలిపెట్టకండి. ఆ టేస్టే వేరు. ఇక్కడికి సాయంత్రం పూట వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. సరేనా.. ఇలా రెండో రోజు గడిపేశారు కదా…!
కనుమ రోజు
ఇక మూడో రోజున సరాసరి రాజోలు వచ్చేయండి. గోదారి గట్టు ఎక్కేయండి. అక్కడి నుంచి గోదారి కొబ్బరి తోటల దృశ్యాలను తిలకించండి. గోదారి ఒడ్డున పడవలు ఉంటాయి. ఓ పడవ మాట్లాడుకోండి. అరగంటలో అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడన్నీ లంక తోటలే. ఆ తోటల్ని పాడుచేయకుండా.. సరదాగా అలా తిరిగొస్తామంటే వద్దనేవాళ్లు ఎవరూ ఉండరు. ఒకటి రెండు గంటలు అలా తిరిగొస్తే మీకు మీరే మైమరచిపోతారు.
తీర్థాల సందడి
ఇక మధ్యాహ్నం పూట చుట్టుపక్కల ఊళ్లను చక్కబెట్టేయొచ్చు. కోనసీమకే ప్రత్యేకతను ఆపాదించే ప్రభల తీర్థాల సందడి మొదలయ్యేది అప్పుడే మరి. జగ్గన్నతోట, నాగుల్లంక, మాచవరం, శివకోటి, పొదలాడ, మందపల్లి, వానపల్లి, గొల్లవిల్లి, తొండవరం, ముక్తేశ్వరం, నేదునూరు, కాట్రేనికోన వంటి 80కి పైగా ప్రదేశాలు ప్రభల తీర్థాలకు పెట్టింది పేరు. జగ్గన్నతోట తీర్థానికి 400 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. భిన్న అలంకృతులతో కొలువుదీరే ప్రభలు కొత్త శోభాయమానం తెచ్చిపెడతాయి. ఇసకేస్తే రాలనంత జనాలతో ఈ తీర్థాలు కోనసీమకే తలమానికంగా నిలుస్తాయి. ఇప్పడు మనకు ఏ వస్తువు కావాలన్నా మన గల్లీలో కూడా దొరుకుతున్నాయి సరే… ఇదివరకటి రోజుల్లో ఆ వస్తువులు తీర్థాల్లో మాత్రమే దొరికేవి. వాటిని కొనుక్కోవడానికే ప్రత్యేకంగా ఈ తీర్థాలు జరిగేవి. బూరాలు, రంగు రంగుల కళ్లద్దాలు, బొమ్మ కార్లు.. ఇలా ఎన్నో వస్తువులను కొనుక్కుంటూ పిల్లలు చేసే సందడి మామూలుగా ఉండదు. తీర్థాలో్ల తిరిగేటప్పడు అప్పటికప్పుడు తయారుచేసే పాకపు జీళ్లు, ఖర్జూరాలు కొనుక్కు తెచ్చుకోవడం మర్చిపోకండే…
ఇలా మొత్తం మీద మూడు రోజుల సంక్రాంతి సంబంరాలను మదిలో పదిలపరచుకుంటూ… మధురానుభూతులను నెమరేసుకుంటూ.. మీ స్వస్థలాలకు బయల్దేరొచ్చు. ఇంకో రోజు మీ టూరును పొడిగించుకుంటే… ముక్కనుమ రోజు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు చాలాచోట్ల అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పిస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. అదికూడా చాలా సందడిగానే జరుగుతుంది. ఆ మర్నాడు ఊళ్లల్లో సంతర్పణ భోజనాలు పెట్టడం ద్వారా సంక్రాంతి పండక్కి ఘనంగా వీడ్కోలు పలుకుతారు గోదారి వాసులు. మీమీ సెలవుల్ని బట్టి టూరు పొడిగించుకోవడమా… లేదంటే మూడు రోజులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవ్వడమా… అన్నది మీ చేతుల్లోనే ఉంది. సరైన ప్రణాళికతో సిద్ధమైతే… మీ సంక్రాంతి టూరు ఒక చక్కటి అనుభూతిని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గమనిక:
- ఎటూ వెళ్తున్నాం కదా… అని మూడు రోజుల్లో్నే అన్ని ప్రాంతాలు కవర్ చేసేయాలని మాత్రం చూడకండి. అలా అనుకుంటే ఏ ఒక్కదానికీ న్యాయం చేయలేరు. మీకు ఎక్కువ వ్యవధి ఉంటేనే చుట్టుపక్కల ఉండే మరిన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టండి.
- కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క ఒమిక్రాన్ వణికిస్తోంది. కాబట్టి ప్రయాణానికి సిద్ధమయ్యేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఒకవేళ వెళ్లడానికి సిద్ధపడితే మాత్రం కచ్చితంగా సురక్షిత చర్యలు తీసుకోండి. గుంపుల్లో తిరగడానికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. శానిటైజర్ దగ్గర పెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పట్టుకెళ్లడం మరిచిపోకండి.
-బెహరా శ్రీనివాసరావు,
సీనియర్ జర్నలిస్ట్
Discussion about this post